పట్టపగలు పెట్రోల్ దోపిడీ
- ఏడాదికి లక్షల కోట్లు ఆదా.. అయినా సామాన్యుడికి దక్కని ఊరట
- గోవధ నిషేధాన్ని ఏనాడో ఎజెండాలో చేర్చాం: జైపాల్ రెడ్డి
-2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి
- టీఆర్‌ఎస్‌పై కోపంతోనే సంగారెడ్డి సభకు జనం
- ‘మీట్ ది ప్రెస్’లో కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలు
హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అయిల్ పరిశ్రమ పడిపోయిందని, ఆ ప్రభావంతో ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయేతప్ప ఇందులో నరేంద్ర మోదీ ప్రభావమేదీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ దిగుమతుల్లో మన దేశానాకి ఏటా రూ. 1.20 లక్షల కోట్లు ఆదా అవుతున్నదని, అయితే ఈ ఫలాలు మాత్రం వినియోగదారుడికి దక్కడంలేదని ఆయన ఆవేదన చెందారు. యూపీఏ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రూ. 71 ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు అదే స్థాయిలో ఉందని, ఎన్డీఏ పట్టపగలు పెట్రోల్ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్న జైపాల్‌రెడ్డి.. గోవధ, కేసీఆర్ పాలన తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గోవధ నిషేధం పాతదే: స్వాతంత్ర సమరం కాలంలోనే గోవధ నిషేధం అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చేర్చామని జైపాల్ రెడ్డి గుర్తుచేశారు. అయితే గోవధ నిషేధం అమలు బాధ్యతను ఆయా రాష్ట్రాలకు వదిలేశామని, రాష్ట్రాలు శక్తికొలదీ తమ బాధ్యతను నెరవేర్చాయని చెప్పుకొచ్చారు. గోవధతోపాటు చాలా విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని జైపాల్ స్పష్టం చేశారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం కాదు: సచివాలయంలో భవనాలన్ని కొత్తగానే ఉన్నా, వాటిని వదిలేసి కొత్తవి కట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, నిజానికి తెలంగాణ రెవెన్యూ మిగులున్న రాష్ట్రమేకానీ, ధనిక రాష్ట్రం మాత్ర కాదని జైపాల్‌రెడ్డి అన్నారు. ‘మిగులు విద్యుత్ సాధించామని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్ సొంతగా విద్యుత్ సృష్టించారా? మొత్తం విద్యుత్‌లో 54 శాతం తెలంగాణకు ఇవ్వాలని నాటి కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లులో పెట్టడం వల్లే ఇవాళ తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారైంది’ అని జైపాల్ వివరించారు.
ధర్నాచౌక్ వద్దన్నవాళ్లు ఢిల్లీలో ధర్నా చేస్తారా?: ‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ భూమిని సృష్టిస్తున్నారా? నిజానికి ఆ హామీ సాధ్యంకాదని ఆయనకు కూడా తెలుసు. ఇక హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తేసిన ఆయన.. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాననడం హాస్యాస్పదం’ అని జైపాల్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రేమకంటే కేసీఆర్‌పై కోపం ఉండబట్టే మొన్నటి సంగారెడ్డి సభకు ప్రజలు భారీగా తరలివచ్చారని జైపాల్ అన్నారు.