Meet the Press
-
ఇక నా రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్ 3న తెలంగాణలో ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని, స్వేచ్ఛకు మించింది ఏదీ లేదని నిరూపించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంబించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో రేవంత్ మాట్లాడారు. ‘మా ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నిన్నటిదాకా సీఎంగా నిబద్ధతతో పనిచేశా. ఇక పార్టీ అధ్యక్షునిగా నన్ను చూస్తారు. ఎన్నికల నగారా మోగినందున ఎన్నికల్లో నా రాజకీయ రూపం చూస్తారు. సీఎంగా వందవ రోజు ఒక గేట్ ఓపెన్ చేశా. అవతల వర్గం ఖాళీ అయితే గేట్లు మూసినా తెరచినా ఒక్కటే. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటానా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు పెద్దలు కొట్టకుండా ఊరుకుంటామా. యువకుల ఆత్మబలిదానాలతో సమైక్య పాలన నుంచి విముక్తి పొంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ రాజరికపోకడలను మళ్లీ తీసుకువచ్చారు. తన వారసులే ఆధిపత్యం చెలాయించాలని కోరుకున్నారు. కేసీఆర్ నిజాం నకలునే మళ్లీ చూపించాడు. ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు. తిరుగుబాటు చేసినవారందరినీ అణచివేశాడు. దీంతో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పరిపాలనను తీసుకువచ్చారు. ధర్నాచౌక్ వద్దు అన్న వారిని కూడా ధర్నా చేసుకోనిచ్చిన ప్రభుత్వం మాది. ప్రగతిభవన్ కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. సామంతులలాగా అధికారం కొద్ది మంది అధికారుల చేతిలో పెట్టకుండా అధికారులందరికీ పాలనలో స్వేచ్ఛను కల్పించి పారదర్శకతను తీసుకువచ్చాం. ఉద్యమంలో మాట్లాడిన మాటలను మర్చిపోయి కేసీఆర్ తెలంగాణ సంస్కృతిని చెరిపే ప్రయత్నం చేశారు. మేం వచ్చిన తర్వాత జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు తీసుకువచ్చి, ఆరోగ్య శ్రీ పరిమితి పెంచాం. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరి కమిషన్(ఈఆర్సీ)లో కేసీఆర్ నాటిన గంజాయి మొక్క ఒకటి గృహజ్యోతి డబ్బులు ముందే డిస్కంలకు ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఇచ్చిన వ్యక్తి ఇంటి పేరు కూడా తన్నీరు. ఈ తన్నీరుకు గతంలో రైతులకు ఉచిత విద్యుత్ డబ్బులు కేసీఆర్ ముందే ఇచ్చాడో లేదా తెల్వదా. ఈ గంజాయి మొక్కలన్నింటిని సమూలంగా పీకేస్తాం’ అని రేవంత్ హెచ్చరించారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా -
‘హంగ్’ ప్రసక్తే లేదు..!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పూర్తి మెజారిటీ సాధించి మూడోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి సందిగ్ధత లేదని, ఎటువంటి అనుమానాలు అక్కరలేదని వ్యాఖ్యానించారు. ఎవరిని ఎన్నుకోవాలో క్షేత్ర స్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ‘హంగ్’కు అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ ఆధిక్యత లభించదనేది కాంగ్రెస్ ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టి పారేశారు. హైదరాబాద్ దేశోద్ధారక భవన్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే– ఐజేయూ) ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. కాంగ్రెస్‌ది అంతా గోబెల్స్ ప్రచారం ‘గతంలో ప్రత్యక్షంగా మహాకూటమి పేరిట బీఆర్ఎస్ గొంతు నులమాలని చూసినా విజు్ఞలైన ఓటర్లు కేసీఆర్‌కు మద్దతు పలికారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు, వ్యక్తులతో అంటకాగుతున్న వ్యక్తి రేవంత్. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ రాహుల్ గాంధీ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ఇక్కడ ఉద్యోగాల కల్పన విషయంలో గోబెల్స్ ప్రచారం చేస్తోంది. మా మేనిఫెస్టోను కాపీ కొట్టి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటోంది. మేనిఫెస్టో హామీల అమలులో కాంగ్రెస్‌ది ఎగవేసిన చరిత్ర అయితే బీఆర్ఎస్ది నెరవేర్చిన చరిత్ర’ అందరినీ సంతృప్తిపరచలేము ‘‘వరుసగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు అందరినీ సంతృప్తి పరచలేరు. నాణేనికి రెండువైపులా అన్నట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయి. మేనిఫెస్టోను అమలు చేయగలిగే వారికే మెజారిటీ ఓట్లు పడతాయి. కేసీఆర్‌కు సరితూగే నాయకులు రాష్ట్రంలో లేరు. ఓటమి ఎరుగని నాయకుడు కేసీఆర్ మీద పోటీ చేయడం ద్వారా రేవంత్, ఈటల పెద్దవాళ్లు కావాలనుకుంటున్నారు. బీజేపీ గుజరాత్, కాంగ్రెస్ కర్ణాటక మోడల్ అంటున్నా తెలంగాణ మోడల్‌కు ఏదీ సాటిరాదు. కర్ణాటక మోడల్ అట్టర్ ఫెయిల్. నెత్తీ కత్తీ లేని బీజేపీ ఇచ్చే హామీలకు విలువ లేదు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాతో పనిచేయడం లేదు. కాంగ్రెస్ చెప్తున్నంతగా క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి కేడర్ బలం లేదు. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని బదనాం చేసి ప్రయోజనం పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోంది.’’ సోషల్ మీడియాలో నాపై విష ప్రచారం తెలంగాణ ఉద్యమంలో రెండు వందలకు పైగా కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన నాపై విమర్శించేందుకు ఏమీ లేకనే సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులను తృణప్రాయంగా వదిలేశా. తెలంగాణ ప్రజలపై రైఫిల్ ఎక్కు పెట్టిన రేవంత్‌కు విమర్శించే హక్కు లేదు. ఎన్నో బ్యారేజీలు, రిజర్వాయర్లు, టన్నెళ్లు, కాలువల సముదాయం కాళేశ్వరంపై విమర్శలు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదే. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల కూటమి దేశంలో గణనీయ పాత్ర పోషిస్తుంది. మళ్లీ అవకాశం వస్తే ఆరోగ్య శాఖ మంత్రిగానే.. ‘తెలంగాణలో గంగా జమునా తహజీబ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతాం. రాబోయే రోజుల్లో విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేస్తాం. హైదరాబాద్‌లో మౌలిక వసతుల మీద ఫోకస్ పెంచుతాం. కరోనా, పెద్దనోట్ల రద్దు మూలంగా ఉద్యోగుల వేతనాల చెల్లింపులో కొంత ఆలస్యం జరిగినా చెల్లింపులు ఆగలేదు. మాకు ఏ పార్టీతోనూ అవగాహన లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. నేను కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే కార్యకర్తను. పార్టీ అప్పగించే బాధ్యతను నెరవేర్చే వ్యక్తిని మాత్రమే. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం కత్తిమీద సాము అయినా ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం అనే సంతృప్తి ఉంటుంది. అందుకే మళ్లీ అవకాశం వస్తే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయాలనుకుంటా. -
ఎలాంటి తెలంగాణ కావాలో తేల్చుకోండి
సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలంగాణలో కొందరు విద్వేషపు విత్తనాలు నాటుతూ మత సామరస్యం దెబ్బతీసే విధంగా ప్రయ త్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా మత కలహాలు, బాంబు పేలుళ్ల వంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుంది. తెలంగాణకు ఆర్థిక యంత్రంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విద్వేషంతో నిండిన హైదరాబాద్ కావాలో లేక విజ్ఞతతో ఆలోచించే తెలంగాణ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. ‘హమారా హైదరాబాద్’ అంటూ నగరాన్ని కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము గల్లీ పార్టీ.. వారిది ఢిల్లీ పార్టీ.. ఈ రెండింటిలో ఏది కావాలో ప్రజలు తేల్చుకోవాలి’’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో కేటీఆర్ మాట్లాడారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తామనే బీజేపీ నేతల ప్రకటనలపై స్పందిస్తూ అక్కడ కేసీఆర్ జాతీయ జెండా ఎగరేస్తారని, తాము మాత్రం బల్దియాపై గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తాము సవాళ్లు విసరబోమని, విపక్షాలు సవాలు చేస్తే స్పందిస్తామన్నారు. ‘‘గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని నేనే గెలిపించాలనే భ్రమల్లో లేను. పెద్ద లీడర్‌ను అనుకోవడం లేదు. కేసీఆర్ రూపంలో మాకు సమర్థుడైన నాయకుడు ఉన్నారు. నా పొజిషన్‌తో సంతృప్తిగా ఉన్నా. నాకు వేరే ఏమీ అవసరం లేదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మహిళా కార్పొరేటరే మేయర్... ‘‘గ్రేటర్ ఎన్నికల్లో మాకు ఎవరితోనూ దోస్తీ లేదు. గత ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసి పాతబస్తీలోఎంఐఎం అభ్యర్థులపై ఐదు చోట్ల గెలుపొందాం. ఈసారి పాతబస్తీలో పది స్థానాల్లో ఎంఐఎంపై విజయం సాధిస్తాం. మజ్లిస్ పార్టీకి మేయర్ పదవి ఇస్తామని కొందరు చెబుతున్నారు. మాకేమైనా పిచ్చా.. ఎందుకిస్తాం? గతంలో 99 స్థానాల్లో గెలిచి మేయర్ పీఠాన్ని సాధించుకున్నాం. డిసెంబర్ 4న టీఆర్ఎస్కు చెందిన మహిళా కార్పొరేటర్ మేయర్ అవుతారు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘దుబ్బాకలో ఓటమి ఒలికిపోయిన పాల లాంటివి. వాటి గురించి ఆలోచించదలుచుకోలేదు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. గతంలోనూ బీజేపీ మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో గెలిచినా మళ్లీ విజయం సాధించలేదు. కానీ టీఆర్ఎస్ 2014 నుంచి ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. అయినా కొందరు మా అపజయాన్నే వార్తగా పైశాచిక ఆనందం పొందుతున్నారు. మేము ఎవరి బీ–టీం కాదు. అంతర్గత కారణాలతోనే కాంగ్రెస్ బలహీనమైంది. గ్రేటర్ ఎన్నికల్లో రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, కాంగ్రెస్ తేల్చుకోవాలి. మేము మాత్రం ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతూ ప్రచారంలోకి వెళ్తాం. గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. గ్రేటర్ మేనిఫెస్టోపై సరైన సమయంలో స్పందిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీకి తెలిసింది విద్వేషాలు సృష్టించడమే... ‘‘కేంద్ర ప్రభుత్వ పనితీరు వల్లే లాక్డౌన్ తర్వాత దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. కేంద్రం ఓ మిథ్య. ఆరేళ్లుగా తెలంగాణ నుంచి రూ. 2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో సమకూరినా రాష్ట్రానికి మాత్రం రూ. 1.40 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. వరదలతో హైదరాబాద్ నష్టపోయినా కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు. దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదు. వాళ్లకు తెలిసింది ఒకటే విద్య.. హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్, ఎంఐఎం–టీఆర్ఎస్ అనే పిచ్చిమాటలతో విద్వేషాలు సృష్టించడం’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. 70 ఏళ్లుగా నాలాలు, చెరువుల ఆక్రమణల వల్లే హైదరాబాద్‌లో వరద నష్టం జరిగింది. వరదల బారిన పడిన కాలనీలకు చెందిన 6 లక్షల మందికి ఇప్పటికే రూ. 650 కోట్ల మేర ఆర్థిక సాయం చేశాం. మరికొందరు అర్హులకు జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సాయం అందిస్తాం. ఎల్ఆర్ఎస్ విషయంలో కేంద్రం చేసేదేమీ లేదు. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొనేది సీఎం కేసీఆర్ మాత్రమే. స్థిరా>స్థికి పాస్‌బుక్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కోటి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది’’ అని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులకు అయస్కాంతంలా హైదరాబాద్.. ‘తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న అపోహలను తొలగించి రాష్ట్రం, హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆరే. ఆరేళ్లలో ఎవరితోనూ మేము గిల్లికజ్జాలు పెట్టుకోలేదు. ఆరేళ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. పెట్టుబడులకు హైదరాబాద్ అయస్కాంతంలా మారింది. నిరంతర విద్యుత్, స్వచ్ఛ హైదరాబాద్, శానిటేషన్‌లో హైదరాబాద్ దేశానికి రోల్ మోడల్‌గా ఉంది. చెత్త నుంచి 63 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. రూ. 1,800 కోట్లతో సమగ్ర రోడ్డు ప్రణాళిక, 8 వేల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం. నాలాల ఆక్రమణల తొలగించేలా గ్రేటర్ ఎన్నికల తర్వాత సమగ్ర చట్టం తెస్తాం. హైదరాబాద్‌లో గత ఆరేళ్లలో రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశాం. రెండు, మూడు రోజుల్లో నయాపైసాతో సహా లెక్కలు చెప్తాం. మేము చెప్పేది అబద్ధమైతే శిక్షించండి. నిజమైతే ఆశీర్వదించండి’’ అని కేటీఆర్ కోరారు. గ్రేటర్లో సీఎం ప్రచార సభ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజమౌళిచారి, సూరజ్, రవికాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని విషయంలో కేవలం స్వార్థ బుద్ధితో వ్యవహరించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం పాలనా వికేంద్రీకరణకు పూనుకున్నారన్నారు. వాస్తవానికి చంద్రబాబుకు ఇక్కడ రాజధాని కట్టాలన్న ఆలోచన లేనే లేదని, దానిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించాలన్నదే లక్ష్యం అని విమర్శించారు. స్థానిక ఐలాపురం హోటల్లో బుధవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అమరావతిలో వర్షాలు వస్తే వరద సమస్య వస్తుందని తెలుసని.. లింగమనేని వంటి వారికి, తన అనుయాయులకు మేలు చేసేందుకే రూ.లక్ష కోట్లతో రాజధాని అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకున్నారన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేస్తే తప్ప అమరావతిలో కనీస వసతులు కూడా కల్పించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిపైనే ఇంత భారీగా ఖర్చు చేస్తే ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీ, నీటి పారుదల ప్రాజెక్టుల సంగతేమిటన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్నంలో పాలనాపరమైన రాజధాని, ఇపుడున్న చోట శాసన రాజధానిని ఏర్పాటు చేయాలన్నదే జగన్ సంకల్పమని తెలిపారు. ఒకే చోట లక్ష కోట్లు ఖర్చు పెట్టి కొత్త రాజధాని నిర్మించే కన్నా, అందుబాటులో ఉన్న నగరాన్ని తీర్చి దిద్ది ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే విశాఖపట్టణాన్ని ఎంచుకున్నారన్నారు. సీఎం జగన్ మనసున్న నేత సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు వీలైనంత ఎక్కువ మేలు చేయాలని చూస్తున్నారని సజ్జల చెప్పారు. రూ.90 వేల కోట్ల అప్పుతో ఉన్న ఏపీ.. చంద్రబాబు పుణ్యమా అని రూ.2.60 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. పైగా ఆయన దిగిపోతూ రూ.60 వేల కోట్ల పెండింగ్ బిల్లులు నెత్తిన వేసి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ దూర దృష్టితో పరిస్థితులను చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారని అన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, నాడు–నేడు కింద పాఠశాలలు.. ఆసుపత్రుల అభివృద్ధి, వైఎస్సార్ కంటి వెలుగు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు.. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, 1.50 లక్షల శాశ్వత ఉద్యోగాలు.. ఇలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలతో అనతి కాలంలో దాదాపు 80 శాతం హామీలు నెరవేర్చి, ప్రజల మన్ననలు పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు వేదికపై ఆసీనులయ్యారు. సీఏఏపై ఆందోళన చెందొద్దు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ సీఏఏకు మద్దతు ఇచ్చినప్పుడు ఎన్పీఆర్–ఎన్ఆర్సీలు లేవన్నారు. పొరుగు దేశాల నుంచి చొరబాట్లు, అక్రమ వలసలు నిరోధంలో భాగంగా దేశ భద్రత దృష్ట్యా పార్లమెంటులో సీఏఏకు వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చిందనే విషయాన్ని తమ పార్టీ అప్పుడే స్పష్టంగా ప్రకటించిందన్నారు. ఆ తర్వాతే ఎన్ఆర్సీ అంశం వచ్చిందన్నారు. ముస్లిం మైనారిటీల్లో నెలకొన్న ఆందోళన విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులను రానివ్వబోమని ఆయన చెప్పారు. ‘ఎవరైనా మమ్మల్ని దాటుకుని వెళ్లే.. ఆ చట్టాలను అమలు చేయాల్సి ఉంటుంది. చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. సీఏఏ, ఎన్ఆర్సీపై ఆందోళన చెందాల్సిన పనే లేదు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమే’ అని ఆయన పేర్కొన్నారు. -
మున్సిపోల్స్‌లో సత్తా చూపుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదని, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వేరు కాదని ప్రజలు గుర్తించారన్నారు. కాంగ్రెస్‌ను వెనకేసుకొస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమన్నారు. టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. హైదరాబాద్‌లో గురువారం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దెబ్బతిన్న సంక్షేమాభివృద్ధి, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధానంగా ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళతామని, అలాగే కేంద్రం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అంశాలను ప్రజలకు వివరిస్తామన్నారు. టీఆర్ఎస్ ముసుగులో మజ్లిస్ చేస్తున్న పాలనను బీజేపీ మాత్రమే తిప్పికొట్టగలుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. తిరుగులేని శక్తిగా మారుస్తాం... ఉద్యమాలు, పోరాటాల సంవత్సరంగా 2020ని భావిస్తున్నామని, ఈ ఏడాది బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని లక్ష్మణ్ తెలిపారు. చాప కింద నీరులా బీజేపీ దూసుకుపోతుంటే కేసీఆర్, కేటీఆర్‌కు గుబులు పట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ వస్తాయన్నారు. ఎంఐఎం మేలు కోసమే టీఆర్ఎస్ పనిచేస్తుందని, అందుకే పౌరసత్వ సవరణ బిల్‌ను కూడా వ్యతిరేకించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటి అయినందునే టీఆర్ఎస్లోకి వెళ్తున్న తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కాపాడుకోలేకపోయిందన్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈ నెల 7న మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరుతున్నారని లక్ష్మణ్ వెల్లడించారు. -
అందుకే ఆ చానల్స్‌కు నోటీసులు : స్పీకర్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్బుతమైన బిల్లులపై చర్చ జరిగిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభా నిబంధనల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియమావళికి విరుద్ధంగా ప్రసారాలు నిర్వహించినందుకే ఆ మూడు చానల్స్‌కు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. రూల్స్ తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. నిద్రపోయేవారిని లేపవచ్చు కానీ.. నిద్రపోయినట్టు నటించే వాళ్లను ఏమి చేయలేమని వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని బిల్లులపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని బీఏసీలో చెప్పారు. బిల్లులపై పూర్తి స్థాయి చర్చ జరిగినప్పుడే అందులో ఏముందనేది అందరికీ అర్థమవుతుందనే సీఎం వైఎస్ జగన్ అభిప్రాయం. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు మరో మూడు నాలుగు రోజులు పొడిగిద్దామని కూడా సీఎం వైఎస్ జగన్ చెప్పారు. నాపై ఎటువంటి ఒత్తిళ్లు లేవు. స్పీకర్‌పై తమవైపు నుంచి ఎటువంటి ఒత్తిళ్లు ఉండవని సీఎం వైఎస్ జగన్ ముందే చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాను. పార్టీ విలీన వ్యవహారాల్లో నేను అసలు రాజీ పడను. చట్టం ప్రకారం అది నేరం.. నిబంధనలకు విరుద్ధంగా నేను నడుచుకోన’ని తెలిపారు. -
తిరుపతిని సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుతా..
సాక్షి, తిరుపతి: నగరంలోని మురికివాడల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని అభివృద్ధి చేసి సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుతామని తిరుపతి వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్ లో ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..టిటిడీలో పని చేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని, అలాగే టిటిడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని తెలిపారు. తిరుపతిలో సంపూర్ణ మధ్యనిషేధానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో దశల వారీగా మధ్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి హామీని గుర్తు చేశారు. స్థానికుల సమస్యల పట్ల సత్వరమే స్పందిస్తానని, ఎల్లప్పుడు వారికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. -
ఏపీ రాజకీయాలు: త్వరలోనే చూస్తారుగా : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తమ నాయకుడు కేసీఆర్ దేశం కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చూస్తుంటే.... ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాత్రం తెలుగుదేశం బాగుకోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్ శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో సుమారు 2 కోట్ల మంది ఓటు వేస్తే అందులో 98 లక్షల మంది ప్రజలు తమ పార్టీపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీ కట్టబెట్టారన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పినట్లుగా ఇక్కడ నిశ్శబ్ద విప్లవం లేదని శబ్ద విప్లవమే వారికి సరైన సమాధానం చెప్పిందని ఎద్దేవా చేశారు. త్వరలో చూస్తారు.. తెలంగాణలో మహాకూటమి ఓటమిని ప్రస్తావిస్తూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా... ‘ చంద్రబాబు నాయుడు సెల్ఫోన్లు, మొబైల్ ఫోన్లు కనిపెట్టానని చెబుతారు. తెలంగాణ ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే ఆ క్రెడిట్ కూడా కొట్టేయాలని చూశారు. కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారు. ఏపీ రాజకీయాలు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఆనాడు ప్రత్యేకహోదా సంజీవని కాదు అన్న చంద్రబాబు.. ఇప్పుడు అదే జిందాతిలిస్మాత్ అంటున్నారు. హోదా విషయంలో ఆయనే గందరగోళంలో ఉన్నారు. కేవలం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీని బూచిగా చూపి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీది నామమాత్రపు పాత్రే. అయితే జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు వచ్చేలా, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కాబట్టి దేశంలో అంతర్భాగమైన ఏపీ రాజకీయాల్లో కూడా మా పాత్ర ఉంటుంది. అయితే అది ఏ రూపంలో అనేది త్వరలో చూస్తారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
జూన్‌లో సీఎంగా రాబోతున్నారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని వెల్లడించారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన కేటీఆర్ శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్న నేపథ్యంలో మే లేదా జూన్‌లో మీట్ ది ప్రెస్‌కు ముఖ్యమంత్రిగా ఏమైనా కేటీఆర్ రాబోతున్నారా అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. ‘జాతీయ రాజకీయాలంటే ఢిల్లీలోనే కూర్చుని చేయాలని లేదు. అలా అని రూల్ ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు. జాతీయ రాజకీయాలను హైదరాబాద్ నుంచి శాసించొచ్చు. తెలంగాణ సీఎంగా ఉంటూ కూడా జాతీయ రాజకీయాల్లో మన ముద్ర వేయొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ ఆనాడు దేశ రాజకీయాలను కూడా శాసించారు. తెలంగాణ రాష్ట్రానికి మరో పది, పదిహేనేళ్లు కచ్చితంగా కేసీఆర్ నాయకత్వం అవసరముంది. నాతోపాటు, లక్షలాది మంది కార్యకర్తలు బలంగా ఇదే కోరుకుంటున్నారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్ష పదవి నాకు ఇచ్చారని, మరేదో పెద్ద పదవి నాకు ఇస్తారని ఊహించి రాసి ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. హైదరాబాద్‌లో సీఎంగానే ఉంటూనే మన పాత్ర పోషించవచ్చు. గతంలో పెద్దవాళ్లు చేశారు. ఇప్పుడు కూడా చేసే అవకాశముంద’ని కేసీఆర్ వివరణయిచ్చారు. సీఎం పోస్టు మరో పది, పదిహేనేళ్లు ఖాళీగా లేదన్నారు. తన సోదరి, నిజామాబాద్ ఎంపీ కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. -
‘భగీరథ’లో సీఎంకు 6% వాటా
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కమిషన్ భగీరథలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వాటా ఆరు శాతం. ప్రాజెక్టు మొత్తం ఖర్చులో ఆరు శాతం కమిషన్ తీసుకుని ఆయన కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. రాష్ట్రంలో సగటున కోటి ఇళ్లు ఉంటే నాలుగున్నరేళ్లలో కనీసం లక్ష ఇళ్లకు కూడా భగీరథ నీళ్లు ఇవ్వలేదు. కమిషన్ డబ్బుతోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియాగాంధీ చలవే. ఆమె లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని కేసీఆర్ బహిరంగం గానే చెప్పారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిం ది 33 శాతం ఓట్లే. కేసీఆర్‌ను 65 శాతం మంది ఓటర్లు తిరస్కరించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. దళితుడిని సీఎం చేస్తామన్న మొదటి హామీతోనే ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టారు. ప్రజా స్వామ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించే జర్నలిస్టులు సహా అన్ని వర్గాలను మోసగించి రాజకీయ విలువలకు పాతరేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను కాపీ కొట్టి చవకబారుతనాన్ని చాటుకున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడిగా కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నారు’ అని ఉత్తమ్ దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ఓటేస్తే ప్రజల ఉనికికే ప్రమాదమని, ఆ పార్టీకి మళ్లీ ఓటేస్తే రాష్ట్రంలో బతకడమే కష్టమవుతుందన్నారు. మళ్లీ అధికారం తమదేనని చెప్పుకున్న కేసీఆర్‌కు మహాకూటమి అంటే వణుకు పుడుతోందన్నారు. కేసీఆర్ తాగి సోయి లేకుండా సోని యాపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ దొంగ పాస్‌పోర్టులు అమ్ముకునే సమయంలో తాను సైన్యం లో దేశ సరిహద్దులో భద్రతా దళంలో ఉన్నానని, ఆయన బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకున్నాఎంఐఎం మద్దతివ్వడమా? తమిళనాడు తరహాలో రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తాన ని చెప్పిన కేసీఆర్... వాటిని అమలు చేయకుండా ఆయా వర్గాలను మోసం చేశారని ఉత్తమ్ ఆరోపిం చారు. ఎంఐఎం అహంకారంతో మాట్లాడుతోందని, టీఆర్ఎస్కు ఎందుకు మద్దతిస్తోందో ఆ పార్టీ స్పష్టం చేయాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వనందుకు టీఆర్ఎస్కు ఆ పార్టీ మద్దతు పలుకుతోందా? అని ప్రశ్నించారు. సూట్‌కేసులు తప్ప ఏమీ గుర్తుకు రావు తెలంగాణ రాష్ట్రం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడుతాయని సోనియా భావించారని, కానీ వారిని కేసీఆర్ పాతాళంలోకి నెట్టేసినందుకే ఆమె కడుపు తరుక్కుపోయిందని, ఆమెను విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదన్నారు. ప్రతి దాంట్లో కమిషన్ తీసుకునే కేసీఆర్‌కు సూట్‌కేసులు తప్ప మరే విషయాలు గుర్తుకు రావన్నారు. ఓటమి భయంతో సోయి తప్పి ఆయన మాట్లాడుతున్నారన్నారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌లాగా తాను బ్రోకర్లా బతకలేదని, దేశ భద్రతా దళంలో ప్రాణాలకు తెగించి యుద్ధ విమానాలు నడిపానన్నారు. విభజన హామీలపై గళమెత్తరేం? టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తి చేయలేదని, గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల ఫలితంగానే రాష్ట్రంలో కరెంటు వస్తోందన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే చోట ముందుగా పనులు చేపట్టి భారీగా నిధులు ధుర్వినియోగం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం స్పాట్‌లా మార్చారని, సాగునీళ్లు ఇవ్వకుండా వచ్చిన వాళ్లందరినీ అక్కడికి తీసుకెళ్లి ఆహా, ఓహో అనిపిస్తున్నారన్నారు. విభజన హామీలపై గళమెత్తే సాహసం కేసీఆర్ చేయరని, మోదీ పేరు చెబితేనే కేసీఆర్ లాగు తడుస్తుందన్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ అమలును కేసీఆర్ అటకెక్కించారన్నారు. గెలిచినా ఓడినా నాదే బాధ్యత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్‌ను కొందరు మీడియా ప్రతినిధులు పలకరించారు. డిసెంబర్ 11 తర్వాత అన్ని వ్యవహారాలు సచివాలయం నుంచే నిర్వహిస్తారా అని అడిగారు. ఉత్తమ్ స్పందిస్తూ... ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, ఓడినా నాదే బాధ్యత. డిసెంబర్ 11 తర్వాత గాంధీభవన్‌కు రాను’అని అన్నారు. ఉత్తమ్‌కుమార్ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉత్తమ్ సచివాలయానికే వెళ్తారు కదా! అని వారు అనుకున్నారు. జర్నలిస్టుల ఇళ్లపై కోర్టు కేసుల్లేవు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని, డబుల్, ట్రిబుల్ బెడ్రూంల ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కట్టుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి కేసుల్లేవని, ఒక సొసైటీకి సంబంధించిన కేసు మాత్రమే సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. అందులో అన్ని వర్గాలు ఉన్నాయని, అది జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించిన కేసు కాదన్నారు. డిసెంబర్ 12న ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వంలో మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జర్నలిస్టులకు 18 వేల ఇళ్లు, స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కుటుంబాలకు విద్య, వైద్య పథకా లు అమలు చేస్తామన్నారు. తన భార్య పద్మావతి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతోనే అధిష్టానం టికెట్ ఇచ్చిందన్నారు. తమకు పిల్లలు లేరని, రాష్ట్ర ప్రజలే తన కుటుంబమన్నారు. తమ జీవితం ప్రజాసేవకే అంకితం చేశామన్నారు. -
సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత వస్తోంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందని, ప్రజల్లో కేసీఆర్‌పై నెలకొన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో సైలెంట్ స్వీప్‌గా వస్తోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువ లు మృగ్యమైపోయాయని, భావప్రకటనా స్వేచ్ఛకు, పౌరహక్కులకు భంగం కలిగిందని ఆరోపించారు. విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష, నియంతృత్వ విధానాల అమలు వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూజేఎఫ్) సోమవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో చాడ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన నిరుద్యోగ యువత కు ఉద్యోగాలు భర్తీచేయకుండా చిన్నచూపు చూశారన్నారు. సీట్ల సర్దుబాటులో జాప్యం జరిగినా కూటమి ఏర్పడ్డాక కాంగ్రెస్‌కు మంచి ఊపు వచ్చిందన్నారు. ప్రజా ఫ్రంట్‌లో చేరికపై పార్టీదే నిర్ణయం ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో సీపీఐ చేరికపై పార్టీదే తుది నిర్ణయమని చాడ తెలిపారు. వామపక్ష ఐక్యతను దెబ్బతీసే విధంగా సీపీఎం వ్యవహరించడమే కాకుండా తాము కలిసి రాలేదని ఆపార్టీ ఆరోపిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకోలేమంటోన్న సీపీఎం జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్ గాంధీతో వేదిక పంచుకుంటోందని, ఇది దేనికి సంకేతమో ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. -
ఎక్కడికీ పారిపోం.. రాజకీయాల నుంచి తప్పుకోం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటానని, ఎక్కడికీ పారిపోనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పబోనని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పదవి ఉన్నా, లేకున్నా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే పనిచేస్తానని, పదవి అనేది ఒక వెసులుబాటు మాత్రమేనన్నారు. సోమవారం ఇక్కడి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూ జే నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. సీఎంగా కేసీఆర్ స్థిరంగా ఉన్నా రాష్ట్రంలో అస్థిరత విపరీతంగా పెరిగిపోయిందని, ప్రభుత్వం పట్ల విశ్వసనీయత సన్నగిల్లిందన్నారు. ఇంతటి అస్థిరత ను ఎప్పుడూ చూడలేదని, సీఎం పదవే ఎక్కువ విమ ర్శలకు గురైందని పేర్కొన్నారు. ప్రజల విశ్వసనీయ తను ఎంతమేరకు చూరగొన్నామన్నదే ముఖ్యమని, సీఎంలు ఎంతమంది మారుతారన్నది ముఖ్యం కాదన్నారు. వ్యక్తుల వల్ల రాజకీయాల్లో స్థిరత్వం రాదన్నా రు. రాష్ట్రంలోనూ సీఎం, మంత్రుల వాహనాల సైరన్ మోతలు ఆగిపోవాలని, బుగ్గలను పీకేయాలని సూచించారు. ఓట్లు వేసిన ప్రజలు తిడితే పడాలని, వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఏం చేశారని కేసీఆర్‌కు ఓటేయాలి? సీఎం తన కుటుంబం కోసం అధికారాన్ని సొంత ఆస్తిగా వాడుకుంటున్నారని కోదండరాం ఆరోపిం చారు. ‘ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం అందరి కోసం పని చేయాలి. కానీ కొందరి కోసమే పని చేస్తోంది’ అని అన్నారు. సీఎంకు ఒక కార్యాచర ణ అంటూ లేదని, ప్రభుత్వాన్ని వ్యాపారంగా వాడుకుంటున్నారని, కమీషన్లు, సంపాదనకు వాడుకుం టున్నారని ఆరోపించారు. ‘అధికారం అనేది ప్రజల కోసం పని చేయాలి. ఉద్యోగాలు కల్పించాలి. పారి శ్రామిక, వ్యవసాయ, ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలి’ అని అన్నారు. అవకాశం ఇస్తే తమ ఎజెండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఓ వైపు నిరంకుశ పాలన, మరోవైపు ప్రజల ఆకాం క్షలు ఉన్నాయని, ఆ రెండింటిలో ఏ వైపు ప్రజలు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘కేసీఆర్, నలుగురు కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మేము మాత్రం ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలనుకుంటున్నాం. ఇదీ ఇప్పడున్న ఘర్షణ, ఎన్నికల వేదికగా అటో ఇటో తేలి పోవాలి’ అని అన్నారు. నాలుగున్నరేళ్ల పాలన కేసీ ఆర్ ఏం చేశారని టీఆర్ఎస్కు ప్రజలు ఓటు వేయాలని కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదు.. తెలంగాణ ఏర్పాటు అనేది చివరి మజిలీ కాదని.. తాము ఆశిస్తున్నది సామాజిక మార్పు అని కోదండరాం చెప్పారు. ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడే కొత్తతరం నాయకత్వం అవసరమన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేశారు. తాము గరికె గడ్డి లాంటి వాళ్లమని, పీకేసిన కొద్ది మొలుస్తూ నే ఉంటామన్నారు. ఈ ఎన్నికల్లో తమ ఎజెండా గెలిస్తే, తాము గెలిచినట్టేనన్నారు. ఉమ్మడి కార్యాచరణకు చట్టబద్ధత ప్రజల ఆకాంక్షలతో కూడిన ఉమ్మడి ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు రాహుల్‌గాంధీ ఒప్పుకున్నార ని కోదండరాం అన్నారు. మత ఘర్షణల నిరోధానికి, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి ఢిల్లీకి పోవడం సాధ్యం కాదన్నారు. డిప్యూటీ చీఫ్ మినిçస్టర్ పదవి వస్తదన్న ఆశలో తాను లేనని తెలిపారు. కాంగ్రెస్ ఉంటే రామన్న సీపీఎం కూటమిలోకి రావాలని అడిగితే సీపీఎం నేతృత్వం లోని బీఎల్ఎఫ్ నేతలు కాంగ్రెస్‌తో కలువబోమని చెప్పారని కోదండరాం చెప్పారు. కాంగ్రెస్‌తో కలవకుండా ఇప్పుడు నిలదొక్కుకోవడం సాధ్యం కాదని కూటమిలోని మిగతా పక్షాలు చెప్పాయన్నారు. అందుకే కామన్ ప్రోగ్రాం రాసుకొని దానికోసం పని చేద్దామని చెప్పారని, ఆ మేరకే ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నిరంకుశంగా పాలించారు కేసీఆర్ నాలుగున్నరేళ్లు నిరంకుశంగా పరి పాలించారని, రాజకీయమంటే డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడమని అనుకుంటున్నారని కోదండరాం ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కమీషన్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం రాజకీయం కాదన్నారు. ఒక పార్టీలో టికెట్లు రాని వారు మరోపార్టీ లోకి మారుతున్న తరుణంలో అలాంటివారితో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అసాధ్యమన్నారు. -
కేసీఆర్ బద్దకిస్టు సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత బద్దకస్తుడని, సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పైరవీ భవన్ ఏర్పాటు చేసుకుని దొరపాలన సాగించారని విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2019లో ఒకేసారి వస్తాయని భావించామని, కానీ కేసీఆర్ అసమర్థత వల్ల డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయని అన్నారు. ఒకేసారి ఎన్నికలు వస్తే ప్రజాధనం భారీగా మిగిలేదని, అలాకాకుండా వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో ఖజానా పై తీవ్ర భారం పడుతుందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలే లేవన్న కేసీఆర్.. ప్రతిపక్షాలు ఇబ్బందులకు గురిచేస్తున్నందునే ఎన్నికలకు వెళ్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశా రు. ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ లోకి చేర్చుకుని ఎలా బలహీనుడయ్యాడో అర్థంకావడం లేదని వాపోయా రు. కేసీఆర్ మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌లా భావించి వాటిని అమలు చేయడం లేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో కేసీఆర్ పూర్తి గా విఫలమయ్యారని, బీజేపీతో లోపాయికారీ ఒప్పందంతో ప్రజలను వెర్రివాళ్లని చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఐదు సార్లు రూ. 6.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని, కానీ కాళేశ్వరంప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదన్నారు. కమీషన్ల కోసమే నీటిపారుదల ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వార్ వన్‌సైడ్ ఉంటుందన్న కేసీఆర్ ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిరావాలని సూచించారు. రాష్ట్రంలో పెరుగుతోన్న మాఫియాలు.. రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియాలు పెరిగిపోయాయని రమణ ఆరోపించారు. పబ్ కల్చర్ కూడా పెరగడంతో యువత పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్న కేసీఆర్.. ప్రజల గొంతు వినిపించే ధర్నాచౌక్‌ను ఎత్తేశారని విమర్శించారు. కేటీఆర్‌కు రాజకీయ సన్యాసం ఇప్పించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా రని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకే మహాకూటమి ఏర్పాటైందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సోమయ్య, బసవపున్నయ్య, హైదరాబాద్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, పద్మరాజు, విజయానంద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు ఓటేస్తేనే నేతల పిల్లలు ప్రజాప్రతినిధులవుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకోవాలంటే మనలో మార్పు రావాలి. సామాజిక మార్పుతోనే ఇది సాధ్యమవుతుంది. డబ్బు తీసుకునే ఓట్లేస్తారని చాలా మంది అంటున్నారు. కానీ డబ్బు తీసుకున్న ఓటరు కచ్చితంగా ఆ అభ్యర్థికి ఓటేస్తారని అనుకుంటే పొరపాటు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల నుంచి కూడా డబ్బు తీసుకుని తనకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తాడు. ఇలా డబ్బు తీసుకునే వాళ్లు చాలా తక్కువ. ఇది ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంది’అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు తక్కువగానే ఉందన్నారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 86 కోట్లు సీజ్ చేశామని... అదే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ. 800 కోట్లకుపైగా నగదును సీజ్ చేశారని గుర్తుచేశారు. వారసులను ప్రజలే ఎన్నుకుంటున్నారు రాజకీయ నాయకుల పిల్లలు నేరుగా పదవులు చేపట్టడం లేదని, లక్షల మంది ప్రజలు ఓట్లేస్తేనే ప్రజాప్రతినిధులవుతున్నారని రజత్ కుమార్ గుర్తుచేశారు. ప్రజలు కోరుకున్న వ్యక్తే నాయకుడవుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం సాధ్యమని, అయితే ఇందులో కోరుకుంటున్న మార్పులు ఒక్కరోజుతో అయ్యేవి కావని, కానీ క్రమంగా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అభ్యర్థుల వాస్తవ ఆదాయం, అఫిడవిట్లలో చూపుతున్న లెక్కలకు పొంతన ఉండటం లేదన్న విమర్శలపై స్పందిస్తూ అభ్యర్థులు సమర్పించిన లెక్కలను పరిగణిస్తామని, వాటిపై అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని రజత్ కుమార్ సూచించారు. ఎన్నికల సంఘం పరిమితులకు లోబడి పనిచేస్తుందని, నిబంధనల మేరకే నడుచుకుంటుందని, ఇందులో కొత్తగా తీసుకునే నిర్ణయాలుండవన్నారు. ఎన్నికల సంఘంపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, తాను పనిచేసిన కాలంలో ఇప్పటివరకు రాజకీయ ఒత్తిళ్లకు గురికాలేదని చెప్పారు. అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే ఎవరినీ ఉపేక్షించబోమని, అధికార పార్టీని ఒకలా, ప్రతిపక్ష పార్టీలను ఇంకోలా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎన్నారైల ఓటు నమోదుకు అవకాశం ఇచ్చామని, తక్కువ మంది నమోదు చేసుకున్నారని, వారికి ఓటేసే అవకాశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పోలింగ్ రోజు సెలవు ఇవ్వకపోవడం నేరమే పోలింగ్ రోజు వ్యాపార, వాణిజ్య సంస్థలు సెలవు ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అకారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ లైవ్ ఉందని, వెబ్‌కాస్టింగ్ సర్వీసు లేని ప్రాంతాల్లో రికార్డింగ్ చేస్తామని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ 55 శాతం మించడం లేదని, ఈసారి యువతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. గతంలో కంటే ఈసారి 120 శాతం అధికంగా యువత ఓటు హక్కు నమోదు కోసం ముందుకొచ్చారని రజత్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, బసవ పున్నయ్య, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, హెచ్‌యూజే ప్రధాన కార్యదర్శి గండ్ర నవీన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబులా నేను కంప్యూటర్ను కనిపెట్టలేదు’
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలపై సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ వేదికగా టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..భవిష్యత్ తరాల పిల్లలకు నీటి కష్టాలు లేకుండా చేయడమే మిషన్ భగీరథ లక్ష్యమని చెప్పారు. విద్యుత్ కోతలు అనేది తెలియకుండా భవిష్యత్ తరాల వారికి కరెంటు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా రూ. 39.4 కోట్లు వస్తే.. టీఆర్ఎస్ హయాంలో ఇసుక ద్వారా రూ.2 వేల కోట్లు వచ్చాయని తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చపోయినా మనం ముందుకు దూసుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకువచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం వచ్చిందని, కంటి వెలుగు ద్వారా 80 శాతం ప్రజలకు పరీక్షలు పూర్తి అయ్యాయని వెల్లడించారు. శాంతి భద్రతల విషయంలో క్రైమ్ రేటు తగ్గిందని చెప్పారు. 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 8 వేల పరిశ్రమలకు టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చామని తెలిపారు. గతంలో జలమండలి ముందు బిందెలతో బారులు తీరేవారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి బాధలు లేవని అన్నారు. కారు ఆగవద్దు..డ్రైవర్ మారొద్దని పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని అడిగారు. నాలుగు సంవత్సరాల 3 నెలల పాలనలో ఒక మంత్రిగా మీ ముందుకు వచ్చానని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీయే స్వయంగా కేసీఆర్ దేశంలో ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. గతంలో తెలంగాణాలో ప్రభుత్వాన్ని నడిపే సమర్ధుడైన నాయకుడు లేరని కొంత మంది విమర్శించారని, ఆ మాటలు తప్పని కేసీఆర్ నిరూపించారని అన్నారు. ఆదాయం పెంచుకుంటూ పేదలకు పంచుతూ సమాజంలో అందరినీ కలుపుకుని పోయామని వ్యాఖ్యానించారు. దేశంలో దాదాపు 16 రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉండటానికి టీఆర్ఎస్ పార్టీయే కారణమన్నారు. తెలంగాణ వచ్చాక పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, అలాగే కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కూడా జరిగిందని తెలిపారు. చంద్రబాబులాగా నేను కంప్యూటర్ను కనిపెట్టలేదు ఈ సందర్బంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబులా హైదరాబాద్ నేనే కట్టాను.. హైకోర్టు భవనం నేనే కట్టాను..కంప్యూటర్ను నేనే కనిపెట్టాను.. అంటే ప్రజలు నవ్వుతారని వ్యాఖ్యానించారు. బీజేపీ మాకు రాజకీయ ప్రత్యర్థి అని తెలిపారు. 100 పైగా సీట్లలో బీజేపీ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. తాను మంత్రిని అవుతానని జీవితంలో అనుకోలేదని, ఈ మంత్రి పదవే తనకు ఎక్కువ అని, కేసీఆర్ లాంటి నాయకులు రాష్ట్రాన్ని నడపాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరో 15 సంవత్సరాలు కేసీఆర్‌యే సీఎంగా ఉండాలనేదే తన కోరికన్నారు. బాబు పొత్తుపెట్టుకోని పార్టీ లేదు..ఒక్క వైఎస్సార్సీపీ తప్ప టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఒక్క వైఎస్సార్సీపీతో మాత్రమే పొత్తు పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. అవసరం అయితే వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా వెనకాడరని అన్నారు. గాంధీ భవన్ తలుపులు మూస్తున్నారని, ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడానికే సమయమిచ్చారని ఎద్దేవా చేశారు. చిన్న చిన్న సమస్యలకు ముఖ్యమంత్రి కార్యాలయం ముందు లైన్లో నిలబడితే ముఖ్యమంత్రికి పని చేతకాదు అని ఒప్పుకున్నట్లా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలతో తెలంగాణాను అగ్రపథంలో నిలిపిన టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. -
సంక్షేమానికి ఇది స్వర్ణ యుగం
-
‘ఆ మాటకు కట్టుబడి ఉన్నా.. వాళ్లను వదలం’
హైదరాబాద్: తప్పు చేసిన ఉద్యోగులు తప్పించుకోలేరన్న మాటకు కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. కొందరు ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీకి ఓటేసిన ప్రజలను వేధిస్తున్న అధికారులను ప్రశ్నించకూడదా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఉద్యోగులను సమర్థించాలా అని ప్రశ్నించారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి జరిగినప్పుడు ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఏమయ్యారని నిలదీశారు. విజయవాడలో ఆర్టీఏ అధికారిపై అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే దౌర్జన్యం చేసినప్పుడు ఉద్యోగ సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని అడిగారు. నేను ఇబ్బంది పెట్టినట్టు నా నియోజకవర్గంలో ఒక్క ఉద్యోగినైనా ఒప్పించగలరా అని సవాల్ విసిరారు. 90 శాతం మంది ఉద్యోగులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారులను మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు. -
కేసీఆర్ పగటి కలల వ్యాపారి
‘మీట్ ది ప్రెస్’లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ► తెలంగాణ ఏర్పాటులో ఆలస్యం వల్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పగటి కలల వ్యాపారి అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చి, వాటితో ప్రజలకు పగటి కలల ప్రపంచాన్ని చూపి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ఒంటరిగా ఎన్నికలకు పోవడానికి కేసీఆర్ భయపడ్డారని, అందుకే ఆచర ణ సాధ్యంకాని హామీలన్నీ ఇచ్చారని ఆరోపించా రు. తెలంగాణ ఏర్పాటును అధిష్టానం ఆలస్యం చేయడం, టీఆర్ఎస్ను విలీనం చేసే విషయమై కాంగ్రెస్ స్థానిక నాయకులు అధిష్టానాన్ని తప్పు దారి పట్టించడం వల్ల గత ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ దశల్లో ప్రభుత్వ, బంజరు, సాగు భూము లను ప్రభుత్వం పంచిందని, కొత్తగా ఇవ్వడానికి భూమి లేదని, కొత్తగా భూమిని సృష్టించడానికి కేసీఆర్ బ్రహ్మా అని ప్రశ్నించారు. రుణమాఫీ విధా నం సరిగా లేకపోవడంతో వడ్డీల భారం రైతులపై పడిందని ఆరోపించారు. బ్యాంకుల్లో మరోసారి రుణాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఆచరణ సాధ్యంకాని హామీలనే ఇచ్చారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం కేసీఆర్ గతంలో మంచి దోస్తులని, అందుకే ఓటుకు కోట్లు కేసు వంటివాటిపై ఏం మాట్లాడలేనని తెలిపారు. ప్రజలకు దండగ.. కేసీఆర్‌కు పండగ ఇప్పుడున్న సచివాలయం పూర్తిగా నింపడానికే ప్రభుత్వానికి శక్తి చాలదని, కొత్త సచివాలయం అవ సరం లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. సచివా లయంలోని భవనాలన్నీ కొత్తవే అయినా వాటిని వదిలిపెట్టి కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా ఏమైనా నిర్మిస్తే తప్ప తనకు ఆదాయం రాదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు దండగ అయితే కేసీఆర్‌కు పండుగని ఎద్దేవా చేశారు. చరిత్రను ధ్వంసం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్.. హైదరా బాద్‌ను తామే నిర్మించినట్టుగా, అంతకుముందు హైదరాబాద్ అనేదే లేనట్టుగా చెప్పుకునే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదని, కేవలం రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం మాత్రమేనని వివరించారు. హైదరాబాద్ వల్ల రూ.25 వేల కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ కేసీఆర్ చేశారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం విద్యుత్‌లో 54 శాతం తెలం గాణకు ఇవ్వాలని బిల్లులో నాటి కేంద్ర ప్రభుత్వం పెట్టడం వల్లనే తెలంగాణలో మిగులు విద్యుత్ ఉందని వివరించారు. అమెరికాలో ట్రంప్.. భారత్‌లో మోదీ అమెరికాలో ట్రంప్‌నకు, భారత్‌లో మోదీకి తేడా లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీ యంగా ఆయిల్ ధరలు పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.1.20 లక్షల కోట్లు ఆదా అయినా వినియోగదారులకు మాత్రం తగ్గించలేదన్నారు. స్వాతంత్య్ర పోరాట కాలం లోనే గోవధ నిషేధం కాంగ్రెస్ అజెండాలోని అంశమని, అమలు బాధ్యత రాష్ట్రాలకు వదిలిపెట్టామన్నారు. ఇలాంటి లోతైన అంశా ల్లో దేశంలో రాజకీయ సైద్ధాంతిక నిరక్షరాస్యత పెరిగిందని తెలిపారు. -
పట్టపగలు పెట్రోల్ దోపిడీ
- ఏడాదికి లక్షల కోట్లు ఆదా.. అయినా సామాన్యుడికి దక్కని ఊరట - గోవధ నిషేధాన్ని ఏనాడో ఎజెండాలో చేర్చాం: జైపాల్ రెడ్డి -2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి - టీఆర్ఎస్పై కోపంతోనే సంగారెడ్డి సభకు జనం - ‘మీట్ ది ప్రెస్’లో కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలు హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అయిల్ పరిశ్రమ పడిపోయిందని, ఆ ప్రభావంతో ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయేతప్ప ఇందులో నరేంద్ర మోదీ ప్రభావమేదీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ దిగుమతుల్లో మన దేశానాకి ఏటా రూ. 1.20 లక్షల కోట్లు ఆదా అవుతున్నదని, అయితే ఈ ఫలాలు మాత్రం వినియోగదారుడికి దక్కడంలేదని ఆయన ఆవేదన చెందారు. యూపీఏ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రూ. 71 ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు అదే స్థాయిలో ఉందని, ఎన్డీఏ పట్టపగలు పెట్రోల్ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్న జైపాల్‌రెడ్డి.. గోవధ, కేసీఆర్ పాలన తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవధ నిషేధం పాతదే: స్వాతంత్ర సమరం కాలంలోనే గోవధ నిషేధం అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చేర్చామని జైపాల్ రెడ్డి గుర్తుచేశారు. అయితే గోవధ నిషేధం అమలు బాధ్యతను ఆయా రాష్ట్రాలకు వదిలేశామని, రాష్ట్రాలు శక్తికొలదీ తమ బాధ్యతను నెరవేర్చాయని చెప్పుకొచ్చారు. గోవధతోపాటు చాలా విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని జైపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదు: సచివాలయంలో భవనాలన్ని కొత్తగానే ఉన్నా, వాటిని వదిలేసి కొత్తవి కట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, నిజానికి తెలంగాణ రెవెన్యూ మిగులున్న రాష్ట్రమేకానీ, ధనిక రాష్ట్రం మాత్ర కాదని జైపాల్‌రెడ్డి అన్నారు. ‘మిగులు విద్యుత్ సాధించామని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్ సొంతగా విద్యుత్ సృష్టించారా? మొత్తం విద్యుత్‌లో 54 శాతం తెలంగాణకు ఇవ్వాలని నాటి కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లులో పెట్టడం వల్లే ఇవాళ తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారైంది’ అని జైపాల్ వివరించారు. ధర్నాచౌక్ వద్దన్నవాళ్లు ఢిల్లీలో ధర్నా చేస్తారా?: ‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ భూమిని సృష్టిస్తున్నారా? నిజానికి ఆ హామీ సాధ్యంకాదని ఆయనకు కూడా తెలుసు. ఇక హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తేసిన ఆయన.. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాననడం హాస్యాస్పదం’ అని జైపాల్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రేమకంటే కేసీఆర్‌పై కోపం ఉండబట్టే మొన్నటి సంగారెడ్డి సభకు ప్రజలు భారీగా తరలివచ్చారని జైపాల్ అన్నారు. -
మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది: లక్ష్మణ్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవటం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. ఇందుకోసం అతి శక్తివంతమైన బ్రహ్మాస్త్రం తమ వద్ద ఉందని, అదే ప్రధానమంత్రి మోదీ అని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మాస్త్రం అణుబాంబు కంటే శక్తివంతమైనదని వివరించారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఈనెల 22వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని చెప్పారు. అమిత్‌షా నల్లగొండ జిల్లాలో పర్యటించటంతోపాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమవుతారని వివరించారు. ఈ నియోజకవర్గంలో 1984 ఎన్నికల నుంచి ఎంఐఎం అభ్యర్థి విజయం సాధిస్తున్నందున దీనిపై తమ నాయకత్వం దృష్టిపెట్టిందని వెల్లడించారు. అమిత్‌షా సమావేశం తర్వాత నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ కార్యకర్తలు మోదీ ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తారని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లోకి మారిన నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్‌లపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని తెలిపారు. దీంతోపాటు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకు ఇతర పార్టీలపై విశ్వాసం తగ్గిందని వారంతా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తాము చేపట్టే ప్రచార కార్యక్రమాలు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడతాయని లక్ష్మణ్ దీమా వ్యక్తం చేశారు. -
సిద్ధు పాలనపై మాజీ ప్రధాని నో కామెంట్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు పాత మిత్రుడని, ఆయన పాలనపై వ్యాఖ్యలు చేయబోనని జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ అన్నారు. బుధవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిద్ధరామయ్య నాలుగేళ్ల పాలన ఎలావుందని అడగ్గా... ‘దీనిపై నేను ఎలా మాట్లాడగలను. సిద్ధరామయ్య నాకు పాత మిత్రుడు. ఆయనపై ఎటువంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేద’ని సమాధానం ఇచ్చారు. బంగారప్ప, అంబరీష్ బీజేపీ చేరనున్నారని వార్తలపై స్పందించేందుకు దేవెగౌడ నిరాకరించారు. బీజేపీలో చేరే విషయంపై జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. గతంలో కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజశేఖర్ మూర్తి, బంగారప్ప వంటి నాయకులను వాడుకుని వదిలేశారన్నారని గుర్తు చేశారు. యూపీలో బీజేపీ గెలిస్తే అక్కడ ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లినట్లేనని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మారుస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. -
నా వ్యాఖ్య బాధ కలిగిస్తే క్షమించండి: కోడెల
స్పీకర్ వంటింటి వ్యాఖ్యలపై మహిళాలోకం ఆగ్రహం సాక్షి, అమరావతి: మహిళా లోకానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవన్న తన వ్యాఖ్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలన్నారు. ‘ఒక వాహనం కొని షెడ్లో ఉంచితే ప్రమాదాలు జరగవు. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు..‘ అని కోడెల బుధవారం విజయవాడ ‘మీట్ ది ప్రెస్’లో వ్యాఖ్యానించడం దుమారం రేపింది. (మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవ్) ‘మహిళా సాధికారత–సవాళ్లు’ పేరిట గురువారం విజయవాడలోని ఎంబీభవన్‌లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం స్పీకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య తదితరులు ఈ వ్యవహారం సహా రౌండ్‌టేబుల్‌లో ప్రస్తావనకొచ్చిన అంశాల్ని వెంటనే స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కోడెల... తానలా అనలేదని, ఎవరైనా అలా అర్థం చేసుకుని బాధపడి ఉంటే సారీ అని అన్నట్టు మహిళాసంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు చెప్పారు. -
సర్జికల్ స్ట్రైక్స్‌పైనా విమర్శలా.. హవ్వ!
ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా, ఇంకోవైపు బంగ్లాదేశ్.. ఇలా మూడు దేశాలు మన దేశాన్ని ఎంత ఆక్రమించుకుందామా అని చూస్తున్న తరుణంలో భారతసైన్యం వీరోచితంగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా కొంతమంది రాజకీయ నాయకులు విమర్శించారని, అది ఏమాత్రం సరికాదని రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్స్ ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో జాతీయ భావాన్ని ఉప్పొంగేలా చేశాయని, ఇలాంటి వాటి విషయంలో అనుమానాలు రేకెత్తేలా మాట్లాడటం సరికాదని ఆయన చెప్పారు. వాటిని అందరూ అభినందించాలని, ఈ విషయంలో రాజకీయాలు చేయడం అనవసరమని అన్నారు. రాజ్యసభలో ప్రవేశించడానికి తనకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని, తాను చిత్తశుద్ధితో, ప్రజాకాంక్షలకు అనుగుణంగా, ప్రజల అంచనాలకు తగినట్లుగా పనిచేయాలన్నదే ఆకాంక్ష అని, తప్పకుండా ఆ పని చేస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, మన భాష, సంస్కృతి ఎంత గొప్పవంటే.. విదేశాల్లో ఉన్న ప్రజా సంబంధాలతో పోలిస్తే మన గొప్పతనం ఏంటో అర్థమవుతుందన్నారు. మన దేశంలో భిన్న సంస్కృతులు, మతాలు, సామాజికవర్గాలు ఉండొచ్చు గానీ, భిన్నత్వంలో ఏకత్వంతో మన దేశం ముందంజ వేస్తోందని అన్నారు. కానీ కాలక్రమేణా 1980లతో పోల్చుకుంటే ప్రజాస్వామ్య, సామాజిక విలువలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని.. ఇది సహజంగా జరగడంలేదని, సమాజానికి మంచిది కాదని తెలిపారు. దేశంలో ఇప్పుడు పరిస్థితులు విశ్లేషిస్తే.. భాషలవారీగా, మతాల వారీగా, కులాల వారీగా విడిపోయి, స్వప్రయోజనాలను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్న ముఖ్యమైన నాలుగు వ్యవస్థలు సమన్యాయం పాటించి, కులమతాలకు అతీతంగా న్యాయం చేస్తేనే ఈ వ్యవస్థ పదికాలాల పాటు సవ్యంగా కొనసాగుతుందని, కానీ దురదృష్టవశాత్తు వ్యవస్థలన్నీ కులమతాల మయమైపోయాయని ఆయన అన్నారు. ఎన్నికలు అయిపోయి రెండున్నరేళ్లు అవుతున్న సందర్భంలో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవలని సూచించారు. 2014లో అధికారంలోకి రాకముందు టీడీపీ ఎన్నో హామీలిచ్చింది.. వైఎస్ఆర్సీపీకి 44 శాతం, మిగిలిన పార్టీలన్నింటికీ 45 శాతం ఓట్లు వచ్చాయని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవచ్చు గానీ, ప్రజాబలం ఎంతుందన్నది కూడా ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందా, ప్రజాకాంక్షలకు అనుకూలంగా పనిచేస్తోందా అనేది చూసుకోవాలన్నారు. మీడియా కూడా పార్టీలు, కులాల వారీగా విడిపోయినట్లు కనిపిస్తోందని, చివరకు కొన్ని సంపాదకీయాల్లో కూడా విలువలు పడిపోయి పక్షపాత ధోరణితో రాస్తున్నారని.. ఇలాంటిది జరగకూడదని తెలిపారు. -
సర్జికల్ స్ట్రైక్స్‌పైనా విమర్శలా.. హవ్వ!
-
స్వచ్ఛ విశాఖే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: స్వచ్ఛభారత్ మిషన్‌లో గతేడాది దేశంలోనే 5వ ర్యాంకు సాధించిన విశాఖ నగరాన్ని ఆ ర్యాంకింగ్‌లో ఈ ఏడాది మరింత ముందుకు తీసుకువెళ్లానేది ప్రధాన లక్ష్యమని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ అన్నారు. ఐటీడీఎ పీఓగా పనిచేసి పదిహేను రోజుల క్రితం జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన హరినారాయణ్ గురువారం విశాఖ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ కోర్ సర్వీసులను నగరంలోని ప్రతి ఒక్కరికీ అందించడానికి శాయశక్తుల కషి చేస్తామని చెప్పారు. దేశంలోనే ఎల్ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించిందని, రెండో దశలో ఎల్ఈడీలకు స్మార్ట్ కనెక్షన్ ఇచ్చి ఏ బల్బు ఎక్కడ వెలుగుతుందో లేదో తెలుసుకునే సౌకర్యం తీసుకువస్తామని తెలిపారు. విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెలగని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామరు. శివారు, మారుమూల ప్రాంతాలకు విద్యుత్, తాగునీరు అందిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐఏఎస్ పరీక్షలకు శిక్షణ, పాఠశాల్లో ఈ–ల్యాబ్‌ల ద్వారా విద్యాప్రమాణాలు పెంచుతున్నామన్నారు. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్‌లో ఉండే పాన్‌సిటీ (సేవలు), డెవలప్మెంట్(ప్రాంతాల వారీ అభివద్ధి) అనే రెండు భాగాలను అమలు చేస్తున్నట్లు తెలిపారుు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకా కొందరికి లేవని, వారిని కూడా ప్రోత్సహించి నిర్మించుకునేలా చేస్తామన్నారు. సెప్టెంబర్‌లో జరిగే బ్రిక్స్ సదస్సు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సీఐఐ సదస్సుల వల్ల అంతర్జాతీయంగా విశాఖ ఖ్యాతిని విస్తరించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. జీవీఎంసీలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోస్టు భర్తీ కోసం చీఫ్ సెక్రటరిని కోరామని త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. కబేలా వల్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా తమ వద్దకు వచ్చి తెలియజేయవచ్చన్నారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రత ప్రమాణాల పెంపు అవసరమని వాటిపైనా చర్యలు తీసుకుంటాని తెలిపారు. ఆక్రమణలు తొలగిస్తామన్నారు. అంతకుముందుగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్ దుర్గారావుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు కమిషనర్‌ను సన్మానించారు. -
సిద్ధాంతం, కార్యకర్తలే మా బలం
♦ టీఆర్ఎస్ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా గ్రామాల్లోకి విస్తరిస్తాం ♦ ‘మీట్ ది ప్రెస్’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: సైద్ధాంతిక విధానం, రాజీపడకుండా పోరాడే కార్యకర్తలే తమ పార్టీకి బలమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. అన్ని వర్గాలు, ప్రాం తాల్లో బలమైన నిర్మాణమున్న, సామాన్యులకు అత్యున్నతస్థాయి అవకాశాలు కల్పించే పార్టీ తమదన్నారు. రాష్ట్ర ప్రజల్లో ఎన్నో ఆశలను కల్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా గ్రామాల్లోకి విస్తరిస్తామన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో లక్ష్మణ్ మాట్లాడారు. హామీల అమల్లో అధికార పార్టీ విఫలమవడం, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడటంతో ఏర్పడిన రాజకీయ శూన్యతలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ మనవడు చదివే స్కూల్లోనే అతని డ్రైవర్ కుమారుడు చదివే అవకాశం వస్తుందంటూ చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిం ది. దానికి అతీగతీ లేదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు ఏ కులమైనా, ఏ మతమైనా రిజర్వేషన్లతో అవకాశాలు కల్పిం చాలనేది మా విధానం. కానీ కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం కులమతాల పేరిట ప్రజ లను విభజించే కుట్రలకు టీఆర్ఎస్ పాల్పడుతోంది’’ అని లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్ ప్రసంగం ఆయన మాటల్లోనే... సీఎం సచివాలయానికి పోతేనే గొప్ప... ఉపాధ్యాయుడు రోజూ బడికి వెళ్లడం సహజం. డాక్టర్ ప్రతీరోజూ ఆసుపత్రికి పోవడం సాధారణం. కానీ సీఎం కేసీఆర్ సచివాలయానికి పోతే చాలా పెద్ద వార్త. కేసీఆర్ ఈ రోజు సచివాలయానికి వెళ్లారు, ప్రజలకు సంబంధించిన ఫైళ్లు చూశారు అని గొప్పగా ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది. అదీ కేసీఆర్ పనితీరు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఏర్పా టైంది. కానీ కేసీఆర్ అస్తవ్యస్త విధానాలతో ఇప్పటికే రూ. 1.23 వేల కోట్ల అప్పులు చేశా రు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ల వల్ల పెరిగిన వ్యయానికి అనుగుణంగా ఆయకట్టు పెరగాలి. కేవలం కమీషన్లు, అవినీతి, రాజకీయ ప్రయోజనాల కోసమే రీ డిజైన్లు అయితే అడ్డుకుంటాం. టీడీపీతో పొత్తు లేదు... టీడీపీతో ఇప్పుడు పొత్తులేదు. 2019లో రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఒంటరిగానే ఎదుగుతాం. యువత, మహిళ, దళితులకు సముచిత ప్రాధాన్యమిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం. బీజేపీ అంటే పట్టణ ప్రాంతాల పార్టీ అని, మైనారిటీలకు వ్యతిరేకమని, అగ్రవర్ణాలకే పరిమితమనే అపోహలను తొలగిస్తాం. పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు, సమష్టి నాయకత్వానికి లోబడి పనిచేసేవారెవరైనా బీజేపీలో ఇమిడిపోతారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు వెళ్లడానికి కారణాలు, వారికి బీజేపీలో ఉన్న ఇబ్బందులేమిటో వచ్చిపోయేవారికే తెలియాలి. పార్టీలో ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని పెంచుకుంటున్నాం. ఫిరాయింపులతో గాలిబుడగలా టీఆర్ఎస్.... తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ అనే నమ్మకంతో టీఆర్ఎస్కు ప్రజలు అధికారం అప్పగించారు. ఈ అధికారంతో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల మన్నన పొందకుండా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాం గ్రెస్ వంటి ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ స్వయంగా టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు. ఫిరాయింపులతో శాసనసభలో సంఖ్యను పెంచుకుని బలం పెరిగిందనుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన గాలితో టీఆర్ఎస్ గాలిబుడగలా అవుతోంది. అదెప్పుడైనా పేలిపోవచ్చు. లోక్‌సభలో గతంలో కేవలం రెండు సీట్ల బలమున్న బీజేపీకి ప్రజలిప్పుడు సంపూర్ణ మెజారిటీతో దేశాన్ని అప్పగించారు. ఈ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ, ఏపీలోనూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. దీనికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను వాడుకోవాలనుకుంటున్నారు. -
ఇజ్జత్ కాపాడిన
♦ మార్కెట్ లేకపోతే తెచ్చిన.. ‘ఖేడ్’ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా ♦ బడీడు పిల్లలు నీళ్లు మోస్తుంటే కాంగ్రెసోళ్లకు కనిపించలేదా? ♦ ఒక్క అంబులెన్సును కూడా తీసుకురాని దద్దమ్మలు ♦ కాంగ్రెస్ నేతలను నిలదీసిన మంత్రి హరీశ్‌రావు ♦ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ‘మీట్ ది ప్రెస్’ ♦ పలు అంశాలపై ఘాటుగా స్పందించిన మంత్రి సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇప్పటివరకు వ్యవసాయ మార్కెట్ లేకపోతే మీకు ఇజ్జత్ అనిపించలేదా..?, కంగ్టి మండలంలో మూడంటే మూడే ఉన్నత పాఠశాలలు ఉన్నప్పుడు మీకేం బాధకలగలేదా..?, చిన్న పిల్లలు బడి మానేసి నీళ్లు మోస్తుంటే మీ గౌరవం తగ్గలేదా..?, ఖేడ్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక్క ఆసుపత్రి, అంబులెన్స్ తెచ్చుకోలేక పోయినప్పుడు మీ ఆత్మగౌరవం దెబ్బతినలేదా..?’ అని రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మంగళవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఖేడ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానమిచ్చారు. నారాయణఖేడ్ చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు కనీసం డిపాజిట్లు కూడా రావని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డి... ‘మన ప్రాంతం- మన పాలన’ ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. ‘150 పడకల ఆసుపత్రికి కోట్లాది రూపాయలు మంజూరు చేయించి మీ ఇజ్జత్ నిలబెట్టిననా.. తీసేసిననా చెప్పండి..?. ఖేడ్ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ లేకపోతే రూ.14 కోట్లు ఇచ్చి అధునాతన మార్కెట్‌ను మంజూరు చేసి మీ గౌరవం కాపాడలేదా.? అంటూ కాంగ్రెస్ నేతలపై ఎదురు దాడి చేశారు. కేవలం మూడు శాతమే ఉన్న జాతీయ రహదారి రోడ్లను రూ.170 కోట్లు ఖర్చు చేసి 38 శాతానికి పెంచలేదా? ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సునీతారెడ్డి ఇక్కడి వాళ్లేనా?, రేపొద్దున ఎన్నికలు ముగిసిన తరువాత వాళ్ల మొఖం మళ్లీ చూపెడతారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘జిల్లా మంత్రిగా నేను మీమధ్యే ఉంటా. ఖేడ్‌ను దత్తత తీసుకున్నా. ముఖ్యమంత్రి కాళ్లుమొక్కైనా దుబ్బాక తరహా ప్యాకేజీ తీసుకొస్తా. నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తా. ఏళ్లకేళ్లుగా మీరు తీసుకు రాలేని ఆసుపత్రిని నారాయణఖేడ్‌లో ప్రజలకు నీళ్లు, రోడ్డు, విద్య, వైద్యం ప్రధాన సమస్యలను తీర్చిన. ఈ మౌలిక అవసరాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నా’ని తెలిపారు. నీళ్లు లేక తన కొడుకుకు పిల్లను కూడా ఇవ్వడం లేదని కంగ్టి మండలం సర్దార్ తండాకు వెళ్లినప్పుడు చిమ్నిబాయి అనే మహిళ చెప్పిన మాటలు తనను తీవ్ర ఆవేదనకు, ఆలోచనకు గురిచేశాయన్నారు. తాను సింగూరు జలాలను ఘణపురం వైపునకు తీసుకపోవడం వలనే మంజీర ఎండిపోయిందని కొంత మంది, కాంగ్రెస్, టీడీపీ నాయకులుచెబుతున్నారు. వీళ్లకు తెలివి ఉందో? లేదో అర్థం కావడం లేదు. ఈ ఏడాది వర్షాలు లేక సింగూరుకు నీళ్లే చేరలేదు. ఇలాంటి పరిస్థితిలో ఇంకా నీళ్లు ఎలా వదులుతాం?. ఇరిగేషన్ రికార్డులు చూసుకుంటే తెలుస్తుంది కదా..?. ఓట్ల కోసం అబద్ధాలు చెప్తే జనం నమ్మె పరిస్థితిలో లేరు అని మంత్రి విమర్శించారు. చరిత్రలో మొదటి సారి హైదరాబాద్‌కు సింగూరు జలాలను నిలిపివేసి జిల్లాకే వినియోగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మిషన్ భగీరథ పథకం కింద 9 నెలల నుంచి ఏడాది కాలం లోపు నారాయణఖేడ్‌లో ప్రతి ఇంటికి తాగు నీళ్లు అందిస్తామని ప్రకటించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజినీరింగ్ ద్వారా పెద్దశంకరంపేట, నారాయణఖేడ్ ప్రాంతాలకు సాగునీటిని అందిస్తామన్నారు. గట్టు లింగంపల్లి వద్ద మరో బ్యారేజ్ కట్టడం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వ్యాస్కోప్ అనే కేంద్ర పాలన సంస్థ దీని డిజైన్‌పై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ బ్యారేజ్ ద్వారా నారాయణఖేడ్ ప్రాంతానికి 77 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, మనూరు, కంగ్టి, కల్హేర్ మండలాలు లబ్ధిపొందుతాయని చెప్పారు. కరెంటు సరఫరా, సంక్షేమ పథకాల అమలు, రోడ్ల నిర్మాణం తదితర పనులు ఎలా ఉన్నాయో..? పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న కర్ణాటకతో పోల్చుకొని ప్రజలే చెబుతున్నారన్నారు. ఇంతకాలం నారాయణఖేడ్ ప్రాంతంలో ఫ్యాక్షన్, కక్షలు, పోలీసు కేసులు, రాత్రి పూట ప్రచారాలతో ఎన్నికలు నడిపించేవారు. జర్నలిస్టులు పత్రికల్లో రాస్తే వారిపై దాడులు చేసేవాళ్లని, ఇక అలాంటి వాటికి కాలం చెల్లిందన్నారు. తండ్రి చనిపోయాడని తల్లిని ప్రజల్లోకి తీసుకొచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, కానీ రాష్ర్టంలో ఎక్కడలేని విధంగా నారాయణఖేడ్‌లో సాగిన ఫ్యాక్షన్ రాజకీయలతో ఎన్ని కుటుంబాలు కన్నీళ్లు పెట్టాయో కూడా ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇంతకాలం ప్రజలను పస్తులుంచిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఆస్తులు సంపాదించుకున్నారన్నారు. ఇక మీదట ప్రజలు 2016 ఉప ఎన్నికలకు ముందు నారాయణఖేడ్ అభివృద్ధి, తరువాత నారాయణఖేడ్ అభివృద్ధి అని చరిత్రలో చెప్పుకుంటారని మంత్రి అన్నారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతజరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షులు పల్లె రవి, పీవీ శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్రె డ్డి, యూనియన్ జిల్లా నేతలు పరుశురాం, శ్రీనివాస్, యోగానందరెడ్డి, సునిల్, వెంకటేశ్, రాజు, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడిగే రాజకీయ పార్టీలను ప్రజలు బహిష్కరించాలని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ మత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. బుధవారం ఆమె 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో మాట్లాడుతూ... హైదరాబాద్ లో నివసిస్తున్నవారందరూ తమవాళ్లేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ సమదృష్టితో చూస్తున్నారని, ఎటువంటి వివక్ష చూపించడం లేదని తెలిపారు. 'మన నగరం.. మన పార్టీ' తమ నినాదం అన్నారు. టీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజల పార్టీయేనని స్పష్టం చేశారు. లోకం తెలియని నారా లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 'కారు'లో ప్లేస్ ఉన్న కారణంగానే చాలా మంది నాయకులు 'సైకిల్' వదిలి తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కవిత దీమా వ్యక్తం చేశారు. -
'ఏపీలో 600 మంది వైద్యులకు చార్జి మెమో'
గుంటూరు : పభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సిన సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 600మంది వైద్యులకు చార్జి మెమో జారీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం గుంటూరులో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం (ఏపీజేఎఫ్) నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చార్జిమెమోతోపాటు మూడు ఇంక్రిమెంట్ల కోత విధించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో మిస్‌మ్యాచింగ్ పోస్టులు లేకుండా సరిచేశామని, డిప్యూటేషన్లు ప్రభుత్వానికి అవసరమైతే తప్ప వ్యక్తులకు అవసరమైతే ఇవ్వబోమని స్పష్టం చేశారు. బదిలీలపై నూతన పాలసీని రూపొందించామని, త్వరలోనే అమలు చేస్తామన్నారు. అనధికారికంగా విధులకు డుమ్మా కొడితే సహించేది లేదని, గైర్హాజరు ఏడాది కాలం దాటితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. వైద్యులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. నర్సింగ్ హోమ్‌లు పెట్టుకుని ప్రభుత్వ హాస్పిటల్‌కు రాకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు ముగిశాక క్లినిక్‌కు వెళ్లవచ్చని, ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఆరోగ్య మిత్రలను ఏడాదికోసారి అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకుని ఏడాది పూర్తయిన పిదప రెన్యూవల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నవారి కాంట్రాక్టు 2015 డిసెంబర్‌తో ముగిసిందన్నారు. గతంలో మెడికల్ నాలెడ్జి లేకుండా డిగ్రీ అర్హతతో ఆరోగ్య మిత్రల నియామకాలు చేశారని, కనీస పరిజ్ఞానం లేకుండా ఉంటే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్ అర్హత ఉన్న ఆరోగ్యమిత్రలను తిరిగి కొనసాగిస్తామని మంత్రి కామినేని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది నర్సులు, 500 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటున్నామని, వారం రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలకు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులను క్లినికల్ అటాచ్మెంట్ కోసమే ఇస్తున్నామని తెలిపారు. ప్రైవేటు కళాశాలలవారు ఒక్క రూపాయి కూడా రోగుల నుంచి వసూలు చేయరని, ఐదేళ్లు క్లినికల్ పీరియడ్ పూర్తికాగానే వైద్య పరికరాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రికి ఇచ్చి వెళ్లిపోతారని వెల్లడించారు. వారి కళాశాలల్లో ప్రభుత్వ కోటా కింద 50 శాతం సీట్లు కూడా వస్తాయని మంత్రి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం.వంశీకృష్ణ, కోశాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పథకాలకు టీఆర్ఎస్ లేబుల్స్
♦ మీట్ ది ప్రెస్‌లో వీహెచ్ ♦ రాష్ట్రంలో మంత్రులకేదీ విలువ ♦ సీఎం కేసీఆరా, కేటీఆరా? ♦ టీఆర్ఎస్కు అభ్యర్థులు ♦ కరువై అరువు తెచ్చుకుంది సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెచ్చిన పథకాలకు, చేసిన అభివృద్ధికి టీఆర్ఎస్ లేబుల్స్ వేసుకుని ప్రచారం చేసుకుంటోందని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పునాదులు వేసిందన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీయూడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ జర్నలిస్టు యూనియన్ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో నలుగురు మంత్రులున్నా కేటీఆర్ పెత్తనం చెలాయిస్తున్నారని, మంత్రులకు విలువ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరా, కేటీఆరా అని వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నదని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ఆనాడు ప్రతిపక్షనేతతో సహా కాంగ్రెస్‌లోనూ కొందరు నేతలు వ్యతిరేకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా, సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలర్ల ఓట్లు చాలా కీలకమని, అందుకే టీఆర్ఎస్ కూడా మరోసారి మోసం చేయడానికి కల్లబొల్లి మాటలను చెబుతోందని విమర్శించారు. లంకలో పుట్టినవారంతా రాక్షసులేనని, సెటిలర్లు ద్రోహులని ఆంధ్ర వారి గౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షపాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతిపక్షపాత్రలో పీజేఆర్, జానారెడ్డిని పోల్చిచూడలేమన్నారు. ఎవరిశైలిలో వారు వ్యవహరిస్తారని, ఒకరితో మరొకరిని పోల్చిచూడకూడదన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటుందని, వ్యూహాత్మకంగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా మేయర్ పీఠం కాంగ్రెస్‌కే దక్కుతుందని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువైనారని ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎక్కువగా కాంగ్రెస్ నేతలే ఉన్నారని వీహెచ్ చెప్పారు. టీఆర్ఎస్కు అభ్యర్థులు లేక కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి నేతలను అరువు తెచ్చుకుంటోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి ఫెడరేషన్ అధ్యక్షుడు సోమయ్య అధ్యక్షత వహించగా, బసవపున్నయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. -
స్వచ్ఛ రాజకీయాలకు పట్టం కట్టండి
* అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి * ‘మీట్ ది ప్రెస్’లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని * ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం * సెటిలర్లపై టీఆర్ఎస్ పార్టీకి స్థిరత్వం లేదు * టీఆర్ఎస్ నేతలు సెటిలర్లపై ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు సాక్షి, హైదరాబాద్: ‘‘అధికార, ప్రతిపక్ష పార్టీ లు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఓడిపోయిన పార్టీల వాళ్లు.. గెలిచిన పార్టీల్లో చేరుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న వారు.. ఐదేళ్లు కూడా ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. జనాన్ని దోచుకున్నా పర్వాలేదుగానీ.. విమర్శించే ప్రతిపక్షం ఉండకూడదని అధికార పక్షం భావిస్తోంది. ఈ ధోరణులు పరోక్షంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇలాంటి పార్టీలను ప్రోత్సహించటం సరికాదు. అందుకే ‘గ్రేటర్’ ఎన్నికల్లో స్వచ్ఛ రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టాలి. అవినీతికి వ్యతిరేకంగా ‘వన్ హైదరాబాద్’ కూటమితో లోక్‌సత్తా, వామపక్షాలు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌గా పోటీ చేస్తున్నాయి’’ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో తమ్మినేని ప్రసంగించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో బూర్జువా పార్టీల అజెండా అంతా ఒక్కటిగా మారిందని, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో.. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అవే చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. ఇంకో పార్టీలో మంత్రిగా పనిచేస్తున్నారని.. ఈ భ్రష్టు విధానాలను రాజకీయ వ్యభిచారం అనకుండా ఏమనగలమని ప్రశ్నించారు. దీనికి ప్రత్యామ్నాయం చూపటమనేది.. నిజమైన రాజకీ యవాదులపై ఉన్న బాధ్యత అని చెప్పారు. వామపక్షాలకు ప్రత్యామ్నాయ విధానాలు ఉండటం వల్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన లోక్‌సత్తాతో కలసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు స్వచ్ఛ రాజకీయాలవైపు మళ్లాలని ఈ సందర్భంగా తమ్మినేని పిలుపునిచ్చారు. వన్ హైదరాబాద్ కూటమి 90 స్థానాల్లో పోటీ చేస్తోందని, మిగతా 60 స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. ఈ కూటమికి మేయ ర్ పీఠం దక్కక పోయినా.. ఎక్కువ స్థానాలను సాధించటానికి కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోందని, టీడీపీ-బీజేపీ కూటమికి ఆ సత్తా లేదని తమ్మినేని విమర్శించారు. సెటిలర్లపై స్థిరత్వం లేదు... సెటిలర్లపై టీఆర్ఎస్కు స్థిరత్వం లేదని తమ్మినేని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు సెటిలర్లపై ఎప్పుడేం మాట్లాడతారో.. వారికే తెలియదన్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల జీతాల పెంపు కోసం తాము ఉద్యమిస్తే.. ఆంధ్ర కుక్కలని సీఎం కేసీఆర్ నిందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నుతానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై నోటుకు ఓటుకు సంబంధించి ఎన్నో విమర్శలు చేసిన కేసీఆర్ అమరావతి సభలో ఆయన గురించి గొప్పలు చెప్పారని దుయ్యపట్టారు. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కాదు.. ప్రజాసేవ.. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, రోడ్లు, కులానికో భవనం, ఎతైన భవనాలు కట్టటం కాదని, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వాస్తవమైన అభివృద్ధిని చూపాల్సిన అవసరం ఉందని తమ్మినేని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్నికల వరకు మాత్రమే పరిమితమన్నారు. టీడీపీ-బీజేపీ కూటమి నగరాన్నిగానీ, తెలంగాణనుగానీ అభివృద్ధి చేస్తుందం టే.. అది భ్రమే అవుతుందని తమ్మినేని ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వ పోకడలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్పై ఇంకా భ్రమలున్నాయి టీఆర్ఎస్పై ప్రజల్లో ఇంకా భ్రమలున్నాయని తమ్మినేని అభిప్రాయపడ్డారు. సెంటిమెంట్ అభిమానం కొనసాగుతోందని, ఈ సానుకూలతతో పాలనా వైఫల్యాలను సరి చేసుకుంటే మంచిదన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కారణంగానే ప్రజలు తమ వైపు ఉన్నారని టీఆర్ఎస్ భావిస్తే పప్పులో కాలేసినట్టే అని చెప్పారు. ఈ కార్యక్రమం లో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు సోమ య్య, బసవపున్నయ్య, పద్మరాజు, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, సీపీఎం నేతలు డీజీ నర్సింహారావు, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ బలం నామమాత్రమే
* మేయర్ పదవి కోసం అడ్డదారులు * ‘కారు’ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో * మా కూటమికే మేయర్ పీఠం * మీట్ ద ప్రెస్‌లో బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భావోద్వేగాలతో అధికారంలోకి రావడం మినహా టీఆర్ఎస్కు హైదరాబాద్‌లో బలం లేదని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ఉద్యమం చేయడం వల్ల వచ్చిన మద్దతుతోపాటు ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజలను బుట్టలోవేసుకొని బొటాబొటి మెజారిటీతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలను నిర్వహించకుండా జాప్యం చేసిందని, కోర్టు ఉత్తర్వులతో అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే టీఆర్ఎస్ కేవలం రెండు మాత్రమే గెలిచిందని, దీంతో ఇక్కడ బలం లేనందున అడ్డదారుల్లో మేయర్ స్థానాన్ని గెల్చుకోవడానికి కుట్రలకు దిగుతోందన్నారు. ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను గ్రేటర్ పరిధిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదుచేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై విశ్వాసం ఉంటే ప్రత్యక్ష ఎన్నికకు సిద్ధం కావాలని సవాల్‌చేశారు. గ్రేటర్ పరిధిలో 14 అసెంబ్లీ స్థానాలను, 2 లోక్‌సభ సీట్లను గెల్చుకున్న టీడీపీ-బీజేపీ కూటమికే మేయర్ పీఠం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీని ఒవైసీ కుటుంబం, కొత్త సిటీని కేసీఆర్ కుటుంబం పంచుకోవాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని, సాక్షాత్తు మజ్లిస్ నేతలే ఈ విషయం చెబుతున్నారని గుర్తుచేశారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లింల ఓట్లు పొందడం తప్ప, పాతబస్తీలో అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మెట్రోరైలు నిర్మాణాన్ని అడ్డుకున్న ఎంఐఎంకు టీఆర్ఎస్ వంతపాడుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నలుగురు మంత్రులున్నా పాతబస్తీలో పర్యటించారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లాగా బీజేపీ ఒక కుటుంబానికి పరిమితమైన పార్టీ కాదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని, దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు. కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వకుండా వారిని అవమానించారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో కనీసం మూ డు రోజులకు ఒకసారి తాగునీరు రాకున్నా, ప్రత్యామ్నాయాలను అన్వేషించకుండా వట్టి మాటలతో టీఆర్ఎస్ సర్కారు మోసం చేస్తోందన్నారు. బీజేపీపాలిత రాష్ట్రా ల్లో, నగరాల్లో అనుసరించిన మార్గాలే దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా ఉన్నాయని లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ని దులిస్తున్నా రాజకీయ లబ్ధి కోసం మంత్రులు బీజేపీపై, ప్రధాని మోదీపై అనుచితంగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈస్ట్‌మన్ కలర్లలో హోర్డింగులు మినహా ఆచరణలో టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. -
టీఆర్ఎస్కు హైదరాబాద్‌లో బలమేదీ?
♦ ఫిరాయింపులపైనే అది ఆధారపడుతోంది ♦ ఎంఐఎం మెప్పు కోసమే అబద్ధపు ప్రచారం ♦ మీట్ ద ప్రెస్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్కు బలమెక్కడిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ చాలా బలహీనంగా ఉందని, ఆ పార్టీకి ఎక్కడా నిర్మాణమే లేదన్నారు. దేశంలోనే బీజేపీ కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ, నగరాల్లోనూ బీజేపీ అధికారంలో ఉందన్నారు. హైదరాబాద్‌కు, బీజేపీకి అవినాభావ సంబంధముందన్నారు. గ్రేటర్ పగ్గాలను బీజేపీకి అప్పగిస్తే, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం నిధులు భారీగా తెస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. గ్రేటర్లో బీజేపీకి, టీడీపీకి స్థానికంగా కార్యకర్తలు, నేతలు ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు . కేవలం ఇతర పార్టీల నుంచి ప్రజా ప్రతినిధులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడమే 18 నెలల నుంచి టీఆర్ఎస్ పనిగా పెట్టుకుందన్నారు. హైదరాబాద్ మినీ ఇండియా అని, విభిన్న సంస్కృతులకు నిలయమని అన్నారు. ఐసిస్ వంటి తీవ్రవాద సంస్థలకు హైదరాబాద్‌లో సానుభూతిపరులు ఉన్నట్టుగా తేలుతోందని, దీనిపై భద్రతా, నిఘా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతల బోగస్ ప్రచారం హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు తెస్తున్నామంటూ టీఆర్ఎస్ నేతలు బోగస్ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రెండు బెడ్రూముల ఇళ్లను ఇస్తామంటూ టీఆర్ఎస్ బస్తీ ప్రజలను మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నా ప్రచారం చేయడం లేదన్నారు. కేజీ టు పీజీ ఉచితవిద్య, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కాడన్నారు. ఎంఐఎం మెప్పు కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నదని, బీజేపీపై అబద్ధాలతో ప్రచారం చేస్తున్నదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని ఇటు కేసీఆర్ కుటుంబం, అటు ఒవైసీ కుటుంబాలు పంచుకోవడానికి కుట్రలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అకారణంగా కేసీఆర్, కేసీఆర్ కుటుంబసభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీని గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. 100 సీట్లు లక్ష్యంగా గ్రేటర్ ఎన్నికల్లో పనిచేస్తామన్నారు. మీడియా స్వేచ్ఛను ముఖ్యమంత్రి కేసీఆర్ హరిస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో సవాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తే బాగుంటుందని కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రా ప్రజలంతా రాక్షసులు అంటూ మాట్లాడిన కేసీఆర్ మాటలను ప్రజలు మర్చిపోలేదన్నారు. హిందూ దేవుళ్లను అవమానించిన అక్బరుద్దీన్‌పై ఎందుకు కేసులు పెట్టలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎన్.రామచందర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, యూనియన్ నేతలు క్రాంతి కిరణ్, పల్లె రవికుమార్, పి.వి.శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం
‘మీట్ ద ప్రెస్’లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి బెదిరింపులు, కేసులు, ప్రలోభాలకు గురిచేస్తూ సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇంట్లో మాట్లాడుకుని టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని... కేబినెట్ మీటింగైనా, పార్టీ సమావేశమైనా ప్రజాస్వామ్యమే ఉండదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా చర్చించి నిర్ణయాలు చేస్తుందన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ‘టీయూడబ్ల్యూజే’ ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకుంటామనే విశ్వాసముంటే ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్యను టీఆర్ఎస్ ఎందుకు పెంచుకుంటోందని ఉత్తమ్ ప్రశ్నించారు. కేవలం ప్రత్యక్షంగా ఎన్నికయ్యే కార్పొరేటర్లతోనే టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే.. తాము దేనికైనా సిద్ధమేనని ఉత్తమ్ సవాల్ చేశారు. అధికార దుర్వినియో గం చేసి, అడ్డదారిలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టుగా సవాళ్లు చేస్తున్నారన్నారు. ‘‘హైదరాబాద్‌లో కేటీఆర్‌కు ఏ గల్లీ తెలుసు, ఆ గల్లీల్లో కష్టాలేం తెలుసు? ఒక సీఎం కుమారుడిగా కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందా? సీఎం కేసీఆర్ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది’’ అని ఉత్తమ్ అన్నారు. ప్రచారానికి చిరంజీవి... టీఆర్ఎస్ పార్టీతో కాకుండా ప్రభుత్వంతోనే పోటీలా ఎన్నికలున్నాయని ఉత్తమ్ అన్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఎన్నికల సంఘం తటస్థ వైఖరిపైనా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మెట్రో రైలుకు అడ్డంకులు కల్పించడం, సెటిలర్లపై అనుచితంగా మాట్లాడటం వంటివాటితో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కేసీఆర్ దెబ్బకొట్టారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని చెప్పి 19 నెలలుగా ఏం చేశారని నిలదీశారు. రియల్టర్ల కొమ్ముకాయడానికే భవనాల చట్టానికి సవరణలు తెచ్చారన్నారు. 2014 ఎన్నికల్లో తాము సరైన పనితీరు చూపించలేకపోయామని, గ్రేటర్ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ నేతలతో పాటు చిరంజీవి కూడా ప్రచారానికి వస్తారన్నారు. ఎంఐఎంతో బీజేపీ చీకటి ఒప్పందం బీజేపీతో ఎంఐఎం చీకటి ఒప్పందం చేసుకున్నదని ఉత్తమ్ ఆరోపించారు. పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎంఐఎం పనిచేసిందన్నారు. హైదరాబాద్‌లోని కొన్ని డివిజన్ల లో ఎంఐఎంతో, మరికొన్ని డివిజన్లలో టీఆర్ఎస్తో మాత్రమే తమకు పోటీ ఉందన్నారు. టీడీపీ తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి అదృశ్యమవుతోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, మజ్లిస్ మినహా మిగతా పార్టీలతో మద్దతుకోసం చర్చలు జరుగుతున్నాయని... కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందనే విశ్వాసం ఓటర్లలో పెరిగిందని, మేయర్ పీఠం తమకే వస్తుందని పేర్కొన్నారు. -
తొలి అడుగు పడింది...: కేటీఆర్
హైదరాబాద్ : ఏడాది కాలంలో ఎన్నో సవాళ్లను తెలంగాణ ప్రభుత్వం అధిగమించిందని ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'అమెరికా పర్యటన'పై ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించామని, అన్ని రంగాల సమన్వయంతో ముందుకు వెళుతున్నామన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నట్లు ఆయన అన్నారు. సంవత్సరం కిందట ఎన్నో రకాలు అనుమానాలు, అపోహలు, ఉత్సాహం, రకరకాల భావోద్వేగాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అసాధారణ పరిస్థితుల మధ్య ఏర్పడ్డ రాష్ట్రమని, కొత్త రాష్ట్రం మీద తెలంగాణ ప్రజలకు కోటి ఆశలు, మరోవైపు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారికి కోటి అనుమానాలు ఉన్నాయన్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తొలి ఏడాదిలో ఎలా నిలదొక్కుకుంటుందనే అనేక సంశయాల మధ్య తాము మొదటి అడుగు వేయటంలో విజయం సాధించామన్నారు. ఇక తన శాఖకు సంబంధిస్తే ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల విషయంలో రెండు శాఖలను మేళవించుకుని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు పోయామన్నారు. దేశంలోనే ఓ మోడల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్, ఐటీ ఇండస్ట్రీపై ఎన్నో ప్రచారాలు జరిగినా, అవన్నీ ఒట్టి అపోహలే అని తేలిపోయిందన్నారు. సంవత్సర కాలంలో హైదరాబాద్ నగరంలో ఒక చిన్న అవాంఛనీయ ఘటనలు లేకుండా శాంతిభద్రతలను పరరక్షించామన్నారు. ఐటీ రంగంలోకి వస్తే నాలుగు లక్ష్యాలతో ముందుకు వెళ్లామని, హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని విస్తరించటంతో పాటు, రాబోయే అయిదేళ్లలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశంలోనే అతిపెద్ద టెక్నాలజీని ప్రారంభిస్తామన్నారు. అలాగే వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూసామన్నారు. అలాగే ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ రంగంలోనే తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. -
మూడేళ్లు నేనే సీఎం
రెండేళ్లలో 100 హామీలను నెరవేర్చాం కబ్జాకోరులపై క్రిమినల్ చర్యలు గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మంత్రి వర్గం విస్తరణ ‘మీట్ ది ప్రెస్’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు: ‘మిగిలిన మూడేళ్లు నేనే సీఎం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. రానున్న ఎన్నికల్లోనూ నేను పోటీచేస్తాను. కర్ణాటకను కాంగ్రెస్ రహిత రాష్ట్రంగా చేస్తామంటూ కలలుకంటున్న బీజేపీ నేతలకు వాస్తవాలను తెలియజెప్పడం కోసమే రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి బుధవారంతో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రెస్‌క్లబ్ ఆఫ్ బెంగళూరు, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారమిక్కడి ప్రెస్‌క్లబ్ ఆవరణలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సిద్ధరామయ్య పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎన్నికలకు ముందు తాము ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రజలకు 165 హామీలను ఇచ్చామని, వీటిలో ఈ రెండేళ్లలోనూ 100 హామీలను పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక కోటి ఎనిమిది లక్షల కుటుంబాలకు బీపీఎల్ కార్డుల ద్వారా అన్నభాగ్య పథకాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు నాలుగు కోట్ల మంది పేదలు లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని కోటి మంది చిన్నారులకు ‘క్షీరభాగ్య’ ద్వారా ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. అయితే ఇవేవీ ప్రతిపక్షాలకు కనిపించక పోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ అసలు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో గుర్తు తెచ్చుకోవాలంటూ హితవు పలికారు. పాలనా అవృసరాల దష్ట్యా బీబీఎంపీని విభజిస్తామని బీజేపీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. ఇప్పుడు బీబీఎంపీని విభజిస్తామంటే బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములతో పాటు చెరువులను ఆక్రమించుకున్న కబ్జాదారులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కూడా నిర్దాక్షిణ్యంగా క్రిమినల్ కేసులను నమోదు చేయనున్నట్లు తేల్చి చెప్పారు. ఇళ్లను కోల్పోయిన పేదలకు పునర్వసతి కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించడం ద్వారా ఇప్పటి వరకు 4,052 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వం అనుసరించిన పారిశ్రామిక విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు సైతం పెరిగాయని పేర్కొన్నారు. హోరీ మోటార్స్ సంస్థ ఒక్కటి ఆంధ్రప్రదేశ్‌కు తరలి పోయినంత మాత్రాన అన్ని పరిశ్రమలు తరలిపోయాయనడం సరికాదని తెలిపారు. ఐఏఎస్ అధికారి డి.కె.రవి కేసు ప్రస్తుతం సీబీఐ పరిధిలో ఉన్నందున ఈ విషయం పై తానేమీ మాట్లాడలేనని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తై తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
స్పీకర్ పదవికి వన్నె తేవడమే లక్ష్యం
అసెంబ్లీ సమావేశాల పొడిగింపు నిర్ణయం ప్రభుత్వానిదే: కోడెల గుంటూరు : నిష్పక్షపాతంగా వ్యవహరించడం ద్వారా పదవికి వన్నె తేవడమే లక్ష్యమని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో ఆదివారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ మీట్ ద ప్రెస్’ కార్యక్రమానికి ఆయన హాజరై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో శాసనసభ సమావేశాల పొడిగింపుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నిరసన తెలుపుతున్నామనిగానీ, వాకౌట్ చేస్తామని గానీ అనకపోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షం సభకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పోలవరం పూర్తికి నాలుగైదేళ్లు పడుతుందని, అందువల్ల ఎత్తిపోతల ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సత్తెనపల్లిలో ఇప్పటికే 22 వేల మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించామన్నారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, ట్రెజరర్ శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలు బాధాకరం
భవిష్యత్తులో అలా జరుగకుండా చూస్తాం ⇒ వాటితో టీఆర్ఎస్ సర్కారుకు సంబంధం లేదు ⇒ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే కరెంటు కొరత, కోత ⇒ విద్యుత్ ఉత్పాదన పెంచేందుకు త్వరలో కొత్త ప్రాజెక్టులు ⇒ చిన్న నీటి వనరులను అభివృద్ధి చేస్తాం ⇒ సాగు విస్తీర్ణాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు పెంచుతాం ⇒ ఈ సారి రైల్వే బడ్జెట్లో మనకు రూ.200 కోట్ల వరకు రావచ్చు ⇒ ‘మీట్ ది ప్రెస్’లో నిజామాబాద్ ఎంపీ కవిత నిజామాబాద్ అర్బన్: రైతుల ఆత్మహత్యలు వాస్తవమే అయినప్పటికీ, బాధాకరమ ని, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆత్మహత్యలు జరుగలేదన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంతో కరెంటు కొరత ఏర్పడిందన్నారు. చంద్రబాబు హైటెక్ పాలనలో అవకాశం ఉన్నా తెలంగాణలో కరెంటు ఉత్పత్తిని పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నల్గొండ, రామగుండం కేంద్రాలలో కరెంటు ఉత్పాదనకు తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. ఏపీ సీఎం నేటికీ రుణమాఫీ చేయలేదన్నారు. వేరే పార్టీలకు మనుగడ లేదు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా ఏ ఇతర పార్టీలకూ మనుగడ లేదని ఎంపీ కవిత పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందన్నారు. తన నియోజకవర్గ పరిధిలో పంటల సాగు విస్తీర్ణం ప్రస్తుతం ఐదు లక్షల ఎకరాలుందని, వచ్చే ఐదేళ్లలో పది లక్షల ఎకరాలకు పెంచుతామన్నారు. ఇందుకోసం చిన్న నీటి పారుదల సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రైల్వే బడ్జెట్లో పెద్దపల్లి,నిజామాబాద్ మార్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యే అవకాశముందన్నారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తనతో మాట్లాడినప్పుడు ఈ మేరకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. బాన్సువాడ, బోధన్ బీదర్ రైలు మార్గానికి ముందడుగు ఉంటుందన్నారు. గల్ఫ్ బాధితులకు ప్రత్యేక శాఖ గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారు లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారని, వీటి పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. ఇదివరకే జిల్లాలో స్పైసెస్ పార్కుకు అనుమతి ఇచ్చారని, ప్రభుత్వం కూడా దీనికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుం టున్నామన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రినీ అభివృద్ధి చేస్తా మన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించడానికి పో రాటం చేస్తామన్నారు. ఛాతీ ఆస్పత్రి తరలింపు ప్రజావసరాల కోసమేనని,ఈ విషయంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్న సమ్మతమేనన్నారు. ప్రతిపక్షాలు అనవసర రా ద్ధాంతం చేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిక ల ముందు ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే అమలు చేసి తీరుతుందన్నారు. ఏడాదిలోపు నేరాల రేటు సగానికి తగ్గిస్తామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, చైన్ స్నా చిం గ్,అత్యాచారాలు వంటి ఘటనలను తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, ఇళ్లస్థలాలు జర్నలిస్టులంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోం దన్నారు. అనువైన స్థలం ఎక్కడ ఉందో చూసుకో వాలని సూచించారు. ఆరోగ్య కార్డులు కూడా అందిస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎ మ్మెల్యే జీవన్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, మేయర్ ఆ కుల సుజాత,ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మంద కృష్టవి నిలకడలేని ప్రకటనలు
కేసీఆర్‌ను విమర్శించడమే ఆయన పని మీట్‌ది ప్రెస్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షి ప్రతినిధి, వరంగల్: మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలనే దండోర ఉద్యమ అజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మాదిగ ఉప కులాలకు ముందుగా న్యాయం జరగాలని దండోర ఉద్యమం ఆరంభంలో మంద కృష్ణ చెప్పారని... ఇప్పుడు అదే జరిగిందని అన్నారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన మీట్‌ది ప్రెస్‌లో కడియం శ్రీహరి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడమే మంద కృష్ణ పనిగా పెట్టుకొన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్‌ను విమర్శించారే తప్ప... తెలంగాణ సాధన కోసం మంద కృష్ణ ఏమీ చేయలేదని విమర్శించారు. మంద కృష్ణ నిలకడలేని ప్రకటనలతో ఎమ్మార్పీఎస్ చీలకలు, పేలికలు అయ్యిందని అన్నారు. ఎమ్మార్పీఎస్‌లో మొదట ఉన్న వారు ఎవరు ఇప్పుడు లేరని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలపై, నాయకులపై విమర్శలు చేసే ముందు మంద కృష్ణ తన గురించి వెనక్కి తిరిగి పరిశీలించుకోవాలని కడియం శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి కులంపై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలను ఓ విలేకరి గుర్తు చేయగా... ‘కొందరు ఆశ్చర్యకరంగా నా కులం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎన్నో పరిశోధనాత్మక కథనాలు రాస్తారు. నేను పుట్టిన పర్వతగిరికి వెళ్లి ఈ విషయంపై పరిశోధనాత్మక స్టోరీ రాయండి’ అన్నారు. వచ్చే ఏడాది కేజీ టు పీజీ ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరుస్తానని కడియం చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం మిగిల్చిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 862 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. రాష్ట్రంలో 289 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని ఇందులో 125 కాలేజీలకు మాత్రమే అఫ్లియేషన్ వచ్చిందని పేర్కొన్నారు. అఫిలియేషన్ రాని కాలేజీలను మరోసారి తనిఖీ చేసి నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పారు. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని
జపాన్: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం జపాన్‌లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వసతులు, వనరులను చంద్రబాబు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. రాజధాని నిర్మాణానికి సేవలందించాలని చంద్రబాబు ఈ సందర్భంగా మీడియాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో వివరించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన విశదీకరించారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు అందిస్తామని బాబు చెప్పారు. -
'నన్ను జాతివ్యతిరేకి అనే హక్కెవరికీ లేదు'
హైదరాబాద్: ‘నేను భారతీయుడిని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తా.. నన్ను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికి లేదు’అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం పెంపొందించేందుకే ఎన్నికల బరిలో దిగుతున్నామన్నారు. ఇటీవల శివసేన నేత ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణీతి షిండే తనపై చేసిన వాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రణీతి షిండేకు లీగల్ నోటీసు పంపించామని, క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రజలు తమ పార్టీపై పెట్టిన నమ్మకం, విశ్వాసాన్ని వమ్ము చేయబోమన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం: తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములం అవుతామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అఖిలపక్షంతో కలసి ప్రధాని మోదీని కలిసేందుకు వెనుకాడబోమనన్నారు. తాము బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకం తప్ప ప్రధానికి కాదన్నారు. తెలంగాణ బడ్జెట్లో మైనారిటీలకు తగిన నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో కృష్ణా జలాల మూడో దశ, గోదావరి నీరు, విద్యుత్ సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. తాము టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తున్నా.. ప్రజా సమస్యలపై తప్పకుండా నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో 120 స్థానాలకు పైగా తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, వివాదాలకు తావు లేకుండా నిర్మాణం జరగాలన్నదే తమ ధ్యేయమని వ్యాఖ్యానించారు. మెట్రో మార్గాన్ని బహదుర్ పూరా- కాలపత్తర్- ఫలక్‌నుమా మీదుగా నిర్మిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు. జీహెచ్ఎంసీ పునర్విభజన, ఎన్నికల పొత్తుపై పార్టీ వైఖరిని త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రభుత్వం హజ్ యాత్రికులకు అందించే సబ్సిడీ రద్దు చేసి ఆ మొత్తాన్ని ముస్లిం బాలికల ఉపకార వేతనాల పెంపులో వినియోగిస్తే బాగుంటుందన్నారు. -
రాష్ట్రానిదే తుది నిర్ణయం :వెంకయ్యనాయుడు
ఏపీ రాజధానిపై వెంకయ్యనాయుడు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, కేంద్రం ఇందులో జోక్యం చేసుకోజాలదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ‘విభిన్న వర్గాల అభిప్రాయాలు, విభిన్న అంశాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అంశమైనందున రాజధాని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేశాం..’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమయపాలన.. చాలా కీలకం.. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లో వంద అడుగులు వేసిందని వెంకయ్య వివరించారు. ‘వంద రోజులనేది పెద్ద విషయం కాకపోయినప్పటికీ ఈ స్వల్ప సమయంలో ప్రభుత్వ పనితీరును అంచనావేయవచ్చు. దేశంలో మళ్లీ పరిపాలన అనేది కనిపించడం పెద్ద అడుగు. అలాగే దేశానికి ఒక నాయకుడు లభించడం పెద్ద అడుగు. దేశంలో మళ్లీ అభివృద్ధి మొదలవడం ఒక పెద్ద అడుగు..’ అని పేర్కొన్నారు. ‘సమయ పాలన వంటి చిన్న చిన్న విషయాలను కూడా మోడీ పట్టించుకుంటున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. పరిపాలనలో అది కీలకమైన విషయమే..’ అని పేర్కొన్నారు. తొలి బడ్జెట్ సమావేశాలు పూర్తిగా అర్థవంతంగా సాగాయని వివరిస్తూ, అందుకు సంబంధించి వివిధ అంశాలతో ప్రచురితమైన ఒక బుక్‌లెట్‌ను ఆయన ఆవిష్కరించారు. స్మార్ట్ నగరాల పథకం విధివిధానాల కసరత్తు చివరి దశలో ఉందని, వాటిని ఖరారుచేసేందుకు రాష్ట్రాలతో త్వరలో సమావేశం ఏర్పాటుచేయనున్నామన్నారు. అన్ని రాష్ట్రాలనూ కేంద్రం సమదృష్టితో చూస్తుంది.. టీడీపీ భాగస్వామిగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై కేంద్రం వైఖరి ఏంటని ప్రశ్నించగా ‘అదొక అపోహ మాత్రమే. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమ దృష్టితో చూస్తుంది. నేను తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా చెప్పాను. ఏ అవసరాలపైనైనా ప్రతిపాదనలు పంపాలని చెప్పాను. నిబంధనలకు అనుగుణంగా తప్పనిసరిగా ఆమోదం తెలుపుతాం. మాపై ఆరోపణలు చేయడం తగదు..’ అని అన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
మీట్ ది ప్రెస్‌లో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం : జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శనివారం ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం జరిగింది. మంత్రి మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జిల్లాలో ఆయిల్ రిఫైనరీతోపాటు క్రాకర్ అనే సంస్థ ద్వారా పలు పరిశ్రమలు స్థాపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. కోస్తా తీరం వెంబడి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 216వ నంబరు జాతీయ రహదారి విస్తరణకు, మచిలీపట్నం నుంచి రేపల్లె రైలు లింకు మార్గం నిర్మాణానికి ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి కృషి చేస్తానని చెప్పారు. మంగినపూడి బీచ్‌లో తొలి విడతగా రూ.20 లక్షలతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. చెన్నై బీచ్‌ల తరహాలో మంగినపూడి బీచ్లోనూ పార్కు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. బందరుపోర్టు నిర్మిస్తాం... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బందరుపోర్టు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారని మంత్రి తెలిపారు. బందరు పోర్టు అభివృద్ధి చేస్తే దానికి అనుబంధంగా జిల్లాలో 27 రకాల పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందన్నారు. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కంపెనీని మచిలీపట్నంలోనే విస్తరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బందరు పోర్టును గోగిలేరు ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రశ్నపై ఆయన సమాధానమిస్తూ బందరు పోర్టును బందరులోనే నిర్మిస్తామని తేల్చి చెప్పారు. బందరులో ఓపెన్ డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉందనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పనులను పూర్తి చేయించేందుకు రూ. 22 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు. మచిలీపట్నంను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ఆగస్టు7వ తేదీ నుంచి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల పేదలకు ఇళ్లస్థలాలుగా ఇచ్చిన భూములు కోర్టు కేసుల్లో ఉండి గృహనిర్మాణం జరగడం లేదన్నారు. దీని నుంచి బయటపడేందుకు జీ+1, జీ+2, జీ+3 తరహా గృహాలు నిర్మించి ఇంటిగ్రేటెడ్ గ్రామాలను అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రకృతి సహకరించాల్సిందే...! కృష్ణాడెల్టా రైతులకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని జూలై నెలాఖరు నాటికి కూడా నారుమడులు పోసుకోలేని పరిస్థితి ఉందని సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తాగునీటి అవసరాల నిమిత్తం డెల్టాకు నీటిని విడుదల చేశారన్నారు. ఆగస్టు నెలలో ప్రకృతి సహకరించి వర్షాలు కురిస్తే ఎగువ నుంచి సాగునీరు విడుదల అవుతుందని ఆశిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, బందరు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వెళ్లను: గడ్కారీ
నాగ్‌పూర్: తాను తిరిగి మహారాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉందని వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కొట్టిపడేశారు. తొలుత తాను ఢిల్లీ రాజకీయాల పట్ల మక్కువ చూపేవాడిని కాదని, ప్రస్తుతం తనకు ఢిల్లీ వదిలి వెళ్లే ఉద్దేశం లేదని ఇక్కడ ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నేతృత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మరో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే ఆకస్మికంగా మృతి చెందడంతో నితిన్ గడ్కారీ మహారాష్ట్రలో పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు వచ్చాయి. ప్రత్యేక విదర్భ డిమాండ్‌పై మాట్లాడిన గడ్కరీ.. తమ ఆకాంక్ష నెరవేరాలంటే పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలని, అందునా అన్ని రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం రావాలని అన్నారు. ఇక లక్ష కోట్ల రూపాయలు ఖర్చయ్యే గంగానది శుద్ధి కార్యక్రమాన్ని మరో నాలుగునెలల్లో ప్రారంభిస్తామన్నారు. అలహాబాద్ నుంచి హూగ్లీ వరకూ గంగానదిలో రవాణాను అభివృద్ధిపరిచే ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. -
వైఎస్సార్‌లాంటి గొప్ప నేతను తయారు చేసుకోలేకపోయాం: దిగ్విజయ్
విజయవాడ: వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాదంలో చనిపోయిన తర్వాత అంత గొప్ప నాయకుడిని తయారుచేసుకోలేకపోయామని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో ‘మీట్‌ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ... 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి పలు సంక్షేమ పథకాలను అమలుచేయడం ద్వారా కాంగ్రెస్‌ను బలోపేతం చేశారని కొనియాడారు. అయితే ఆయన ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ లోటు పూడ్చుకోలేకపోయామన్నారు. కిరణ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన పార్టీని ముంచివేయడమే కాకుండా పార్టీ నుంచి వెళ్లిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌లో లబ్ధి పొందినవారంతా పార్టీని వీడివెళ్లిపోయారని, కార్యకర్తలు మాత్రమే అండగా నిలబడ్డారని చెప్పారు. సీనియర్లను కాదని పదేళ్లపాటు కేంద్రమంత్రి పదవి ఇస్తే దగ్గుబాటి పురందేశ్వరి పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. -
సమస్యలపై గొంతెత్తుతా
హంద్రీ-నీవా పూర్తి చేసేందుకు చర్యలు మూడేళ్లుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నా గల్ఫ్‌లో ఉన్న రాజంపేట వాసుల సమస్యలు తీరుస్తా వలసలు పోకుండా పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక కృషి మీట్ ది ప్రెస్‌లో వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి వెల్లడి సాక్షి, తిరుపతి: రాజంపేట లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిష్టవేసిన ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపించి, పరిష్కరించేందుకు కృషిచేస్తామని వైఎస్సార్సీపీ రాజంపేట లోక్‌సభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. యువకుడినైన తనకు రాజంపేట నుంచి లోక్‌సభకు పోటీచేసే అవకాశం కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మిథున్‌రెడ్డి గురువారం తిరుపతిలో ఏపీడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రాజంపేట లోక్‌సభకు ఎన్నికైన వెంటనే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు స్థానిక కార్యాలయాలు పెట్టి ప్రజాసమస్యల పై అర్జీలు తీసుకునేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాం. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మూడేళ్లుగా రాజంపేట లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పనిచేస్తున్నా. రాజంపేట నియోజకవర్గంలో ప్రధాన సమస్య నీటి ఎద్దడి. వెయ్యి అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో డ్యామ్‌లు కట్టడం వల్ల తంబళ్లపల్లె, పుంగనూరు, మదనపల్లె తదితర నియోజకవర్గాలకు వర్షపు నీరు రావడం లేదు. ఈ సమస్య శాస్వతంగా పరిష్కారం కావాలంటే హంద్రీనీవా ప్రాజెక్టు రావాలి. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సీ.ఎం కాగానే ప్రాజెక్టు పనులు పూర్తి చేయించేందుకు కృషిచేస్తా. గాలేరు-నగరి ప్రాజెక్టునూ పూర్తి చేస్తాం. రాజంపేట లోక్‌సభ పరిధిలో చాలామంది ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తా. ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడి ప్రవాస భారతీయుల (రాజంపేట వాసులు) సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. తంబళ్లపల్లె, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలు కరువు ప్రాంతాలు. హంద్రీ నీవా నీళ్లను చెరువులకు అనుసంధానం చేసి సాగునీరు అందేలా చర్యలు చేపడతాం. రాజంపేటలో ఇద్దరు కేంద్ర మంత్రులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే జగన్మోహన్రెడ్డి ఓదార్పు, ఇతర పర్యటనల ద్వారా 14 లక్షల మంది ఓటర్లలో ఐదారు లక్షల మందిని ప్రత్యక్షంగా కలిశారు. ఈ రకంగా చూస్తే ఇక్కడ ప్రత్యర్థులు ఎవరూ గట్టిపోటీ ఇచ్చే పరిస్థితిలేదు. ప్రధాన ప్రత్యర్థి అంటే బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పురందేశ్వరినే. నాకు ఓటు పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. రాజంపేట నియోజకవర్గానికి నేను కొత్తకాదు. నేను లోకల్. మా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. మా కుటుంబానికి నియోజకవర్గంతో ఉన్న అనుబంధం, పరిచయాలు కూడా నా గెలుపునకు దోహదం చేస్తాయి. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. వలసల నివారణ, మహిళా భద్రత వంటి అంశాలకు ప్రాముఖ్యత ఇ చ్చారు. గ్రామాల్లో పదిమంది కానిస్టేబుళ్లతో మహి ళా పోలీస్టేషన్ ఏర్పాటుచేస్తారు. స్వయం ఉపాధి రు ణాలు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక ప్రకటించారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తే రాణించలేరు. ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష, సేవా భావం ఉంటేనే రాణిస్తారు. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది. పార్టీ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమనకరుణాకర రెడ్డి, ఎన్.అమరనాథరెడ్డిలతో కలిసి పార్టీ నాయకత్వం ఐక్యంగా ముందుకెళ్తోంది. ఓటమి భయంతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు పోటీ నుంచి విరమించుకున్నారు. గతంలో ఆయన వైఎస్.రాజశేఖర రెడ్డి అండవల్లే అక్కడ గెలుపొందారు. వైఎస్సార్ సీపీ జిల్లాలో మైనారిటీలకూ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. జెడ్పీ, మదనపల్లె, పుంగనూరు మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలను మైనారిటీలకు కేటాయించింది. రాజంపేట లోక్‌సభ పరిధిలో ఫుడ్‌ప్రాసెసింగ్, మ్యాంగో, టమాట పల్ప్, ప్రొసెసింగ్ యూనిట్లు స్థాపించి రైతులను ఆదుకుంటాం. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. చిత్తూరు విజయ డెయిరీ తరహాలో కొత్త డెయిరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. -
రెచ్చగొడితే చర్యలు తప్పవు: డీజీపీ
-
రెచ్చగొడితే చర్యలు తప్పవు: డీజీపీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ బి. ప్రసాదరావు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీజేఎఫ్ మీట్ ది ప్రెస్‌లో చెప్పారు. ఎన్నికలప్పుడు మావోలు బహిష్కరణ పిలుపివ్వడం సాధారణమేనని అన్నారు. మావోయిస్టులు ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. మావోల కదలికలపై నిఘా పెట్టామన్నారు. ఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో హెలికాప్టర్లను వినియోగిస్తామని వెల్లడించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని ప్రసాదరావు హెచ్చరించారు. -
ప్రజలు గౌరవించేలా నడచుకుంటా
మీట్ ది ప్రెస్‌లో భూమన కరుణాకర రెడ్డి తిరుపతి సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పా 70 వేల గడపలు తొక్కి ప్రజాసమస్యలు తెలుసుకున్నా టీటీడీ చైర్మన్‌గా మహిళా క్షురకులను నియమించా తాగునీటి ఎద్దడి పరిష్కారానికి రాజీలేని పోరాటం సాక్షి, తిరుపతి: ‘‘మా ఎమ్మెల్యే ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.. మా సమస్యలు పట్టించుకుని పరిష్కరిస్తారని, ప్రజలు నన్ను గౌరవించే విధంగా నడచుకుంటా’’ అని తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ హోటల్లో ఏపీడబ్యూయూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. ఆయన తో పాటు మీట్ ది ప్రెస్‌లో వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, నేతలు భూమన్, రామచంద్రారెడ్డి, ఎస్కే.బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ, తాను అధికారంలోకి రాగానే తిరుపతిని సాంస్కృతిక నగరం, సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. తిరుపతి నగరంలో అత్యవసర సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళతామని చెప్పారు. తిరుపతి నగరం అభివృద్ధికి రూ.450 కోట్లు ఇస్తామని ఉప ఎన్నికలప్పుడు చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ తరువాత రూపాయి కూడా విదిల్చలేదన్నారు. రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలు, అనర్థాలు ఏంటనేది నాలుగు నెలల పాటు ప్రజలకు విడమర్చి చెబుతూ, సమైక్యాంధ్ర కోసం ఉద్యమించానని గుర్తు చేశారు. తిరుపతి ప్రజలు మానవ విలువలు, తాత్విక చింతన ఉన్న తనలాంటి వారినే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని కోరారు. తిరుపతి సమస్యలపై అసెంబ్లీలో గళం తిరుపతి నుంచి ఎన్నికైన ఏ ఇతర ఎమ్మెల్యేలు గతంలో తిరుపతి సమస్యలపై అసెంబ్లీ లో గళమెత్తిన సందర్భం లేదు. ఆ ఘనత నాకే దక్కుతుంది. తిరుపతి నియోజకవర్గ సమస్యలపట్ల, నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం అనుసరించిన మోసపూరిత వైఖరి పట్ల అసెంబ్లీలో నాలుగుసార్లు గళం వినిపించా. అసెంబ్లీ సాక్షిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ అంశంపై ఎండగట్టా. రాష్ట్రం విడిపోతే వచ్చే నష్టాలపై అసెంబ్లీలో నాలుగున్నర గంటలు అనర్గళంగా ప్రసంగించి అందరి మన్ననలు అందుకున్నా తిరుపతి నగరంలోని వార్డుల్లో కాలినడకన పర్యటించి 625 రోజుల్లో 70 వేల గడపలు ఎక్కి ప్రజా సమస్యలు లోతుగా తెలుసుకున్నా. నగరంలో ఎక్కడ ఏవార్డులో ప్రజలు ఏ తరహా సమస్య ఎదుర్కొంటున్నారన్న దానిపై నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. తిరుపతి తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అనేకసార్లు ధ ర్నాలు చేసి, ప్రజల తరఫున పోరాటం చేశా. టీటీడీ చైర్మన్‌గా చాలా చేశా.. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆలయంలో తొలిసారిగా మహిళా క్షురకులను నియమించేందుకు చర్యలు తీసుకున్నా. 30 వేల పేద జంటలకు రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు ఉచితంగా జరిపించాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, కోట్లాదిమంది హిందువులు వీక్షిస్తున్న ఎస్వీ భక్తిచానల్ ఏర్పాటు నా ఆలోచనే. శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు శ్రీవారి కళ్యాణాలు ప్రారంభించాం. తిరుపతిలో వేదవిశ్వవిద్యాలయం స్థాపన కూడా నా కృషే. వేదం చదివే విద్యార్థులకు భవిష్యత్ లేదన్న ఆందోళనను పరిష్కరించి, వేదపాఠశాల విద్యార్థులకు రూ.3 లక్షల డిపాజిట్ స్కీం అమలు చేశాం. తిరుపతిని సాంస్కృతిక నగరంగా రూపొందించేందుకు గతంలో తెలుగుభాష బ్రహ్మోత్సవాలు, ఉగాది సంబరాలు, గ్రామీణ క్రీడలు ఇలా అనేక కార్యక్రమాలను జయప్రదం చేశాం. హిందువుల్లో అనైక్యత ఏర్పడిన సమయంలో అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పీఠాధిపతులతో తిరుమలలో సమ్మేళనం నిర్వహించా. -
శాంతిభద్రతలకు పూర్తి భరోసా
‘టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్’లో కిషన్‌రెడ్డి మోడీ ప్రధాని అయితే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ సీమాంధ్రులకు పూర్తి భద్రత టీడీపీ హాయాంలోనూ తెలంగాణకు అన్యాయం అభివృద్ధి కోసమే టీడీపీతో పొత్తు హైదరాబాద్: ‘మోడీ ప్రధాని అయితే మతవిద్వేషాలు పెరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదు. గుజరాత్లో ఎక్కువ మంది ముస్లింలు మోడీని ప్రధానిగా చూడాలని ఆశపడుతున్నారు. తెలంగాణలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. మోడీ ప్రధాని అయితే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తి నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే వచ్చే పదేళ్లపాటు హైదరాబాద్ పోలీసు వ్యవస్థ మోడీ (ప్రధాని హోదాలో) చేతిలో ఉంటుంది. నగరంలో ఉంటున్న సీమాంధ్రులకూ పూర్తి రక్షణ ఉంటుంది’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్’ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో కిషన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 2019లో సొంతకాళ్లపై... తెలంగాణలో పార్టీ బలం పెంచుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ఈసారి జాతీయనేతలు పొత్తులను ఖరారు చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ, తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నామన్నారు. 2019 ఎన్నికలను సొంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే అనుకూల పరిస్థితి తెలంగాణలోనే ఉందన్నారు. మోడీ ప్రధాని అయితే, తెలంగాణ అభివృద్ధికి అవకాశం కలుగుతుందని, అభివృద్ధి చేసిన పార్టీగా బీజేపీకి గుర్తింపు వస్తుందని చెప్పారు. బీజేపీలో వ్యక్తికి ప్రాధాన్యం ఉండదని, అన్నీ సమష్టి నిర్ణయాలే ఉంటాయని, అగ్రనేతగా ఎల్.కె.అద్వానీ ఉన్నప్పటికీ నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడమే దీనికి నిదర్శనమన్నారు. టీడీపీ హయాంలో అన్యాయం జరగలేదనలేను.. తెలంగాణ వెనకబాటులో ప్రథమ ముద్దాయి కాంగ్రెసేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అలా అని చంద్రబాబు హయాంలో అన్యాయం జరగలేదని చెప్పలేనన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో టీడీపీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసునని, అయితే ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర విభజన అంశం ఒకటే ఎజెండాగా ఉంటుందనుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధే ప్రధానాంశమని, ఇందుకోసమే తాము టీడీపీతో పెట్టుకున్న పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఎల్బీ స్టేడియుంలో సభకు అనువుతి నగరంలో సభ కోసం ప్రధాన మైదానాలన్నింటినీ నిబంధనల పేరుతో తిరస్కరించారని, ప్రధాని కాబోయో వ్యక్తి వస్తే మైదానం ఇవ్వమనడం సరికాదని గట్టిగా ఒత్తిడి చేస్తే శనివారం అర్ధరాత్రి దాటాక ఎల్బీ స్టేడియంలో అనుమతినిచ్చినట్టు చెప్పారు. -
లాభసాటి సేద్యం యువతకు ఉపాధి
తెలంగాణ బీజేపీ లక్ష్యం ‘మీట్ ది ప్రెస్’లో కిషన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్: ‘నవ తెలంగాణలో రెండు సవాళ్లున్నాయి. ఒకటి.. వలసలు నిరోధించేలా యువతకు భారీగా ఉపాధికల్పన, రెండవది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. ఈ రెండూ నెరవేరాలంటే నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిందే. అలాగే రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ కూటమి విజయం సాధించాలి’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మునుగుతున్న నావలాంటిదని, అందులో ఎక్కి నష్టపోయేందుకు ప్రజలు సిద్ధం కావద్దన్నారు. మోడీ హవాతో అది మరికొద్దిరోజుల్లో పూర్తిగా కుదేలవుతుందన్నారు. టీఆర్ఎస్ బలం ఎండమావిలాంటిదే అయినందున దాన్ని నమ్మొద్దని ఓటర్లకు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలని, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో అలాంటి ప్రగతి కావాలంటే బీజేపీకే అధికారం కట్టబెట్టాలని కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉన్నందున, వచ్చే ఎన్నికల్లో 300కుపైగా సీట్లు సాధించి కేంద్రంలో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మొదటినుంచీ మోసపూరితంగానే వ్యవహరిస్తోందని విమర్శించారు. విడివిడిగా ఉన్న రెండు రాష్ట్రాలను కలసి ఆంధ్రప్రదేశ్‌గా చేసిన పాపం కాంగ్రెస్‌దేనని, ఇప్పుడు 60 ఏళ్ల తెలంగాణ కల సాకారంలో తాత్సారం చేసి వేయిమంది ఆత్మహత్యలకు కారణమైందన్నారు. ముందునుంచి తెలంగాణ ప్రగతిని కాంక్షిస్తున్న బీజేపీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉండగా, ఆ క్రెడిట్‌ను సొంతం చేసుకునేందుకు ‘అవసరం’ కొద్దీ కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. బిల్లు పెట్టే సమయంలో బీజేపీ పూర్తి అనుకూలంగా ఉండగా, తమపై బురదజల్లే ఉద్దేశంతో బీజేపీ వెనకడుగు వేస్తోందని దుష్ర్పచారం చేసిందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం, అవినీతి కాంగ్రెస్‌ను ఓడించాలన్న లక్ష్యంతోనే టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని ఆయన చెప్పారు. ముఖ్యాంశాలు... బీజేపీ అధికారంలోకి వస్తే... విస్తీర్ణంలో పెద్దగా ఉన్న జిల్లాలను రెండుగా మారుస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. నదీజలాల సమస్యకు పరిష్కారంగా వాజ్‌పేయి ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానాన్ని కొనసాగిస్తాం. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిఏటా 13 లక్షల కుటుంబాలు వలసపోతున్నాయి. వాటిని నిరోధించేందుకు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు తీసుకుంటాం. చేతి వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా ప్రణాళిక రూపొందిస్తాం. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు. తెలంగాణను ఐదేళ్లలో కరెంటు కోతలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ప్రతి మండలంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. రాజధాని నుండి ప్రతి జిల్లా కేంద్రానికి రెండు గంటల్లో చేరుకునేలా ఎక్స్‌ప్రెస్ రహదారులు. హైదరాబాద్ సంస్థానం విలీనం నుంచి ఇటీవలి వరకు, తెలంగాణలో అసువులు బాసిన వీరుల త్యాగాలను ప్రతిబింబించేలా వరంగల్‌లో అద్భుత స్మారక కేంద్రాన్ని నిర్మిస్తాం. -
మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీలోనే ఏకాభిప్రాయం లేదు
‘మీట్ ది ప్రెస్’లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ సాక్షి, బెంగళూరు : మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీలోని సభ్యులకే ఏకాభిప్రాయం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ పేర్కొన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు హరిప్రసాద్ సమాధానమిచ్చారు. బీజేపీ వికాస పురుషుడని చెప్పుకుంటున్న వాజ్‌పేయి, లోహ పురుషుడని చెప్పుకుంటున్న అద్వానీలను ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీ పక్కకు పెట్టేసిందని, ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే నరేంద్రమోడీ పరిస్థితి కూడా అదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్లో 2003 వరకు బీజేపీ ఓడిపోతూనే వచ్చిందని, గోద్రా ఘటన తర్వాత మొదటి ఎన్నికలను మతవాదం పేరిట, రెండోసారి గుజరాత్ ఆత్మాభిమానం పేరిట, మూడోసారి అభివృద్ధి పేరు చెప్పుకొని మోడీ గెలిచారని అన్నారు. రెతుల దగ్గర నుంచి వేల ఎకరాలను బలవ ంతంగా లాక్కొని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచామని చెప్పుకుంటున్న మోడీకి అవినీతి, పాలనాలోపాల గురించి మాట్లాడే నైతికతే లేదని హరిప్రసాద్ విమర్శించారు. -
మోడీకి దేశ సమస్యలపై అవగాహన శూన్యం
దేవెగౌడ విమర్శ .. ఆయన కేవలం ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఆయనదంతా ప్రచార ఆర్భాటమే ఎవరి పవనాలు వీస్తున్నాయో మే 16న తెలుస్తుంది ప్రధానిగా ఉన్న స్వల్ప కాలంలోనే అనేకం చేశా ‘ఫలితాల’ తర్వాత తృతీయ ఫ్రంట్ ఆవిర్భావం మైసూరు, న్యూస్‌లైన్ : నరేంద్ర మోడీకి దేశ సమస్యలపై అవగాహన లేదని, ఆయన కేవలం గుజరాత్‌కు ముఖ్యమంత్రి మాత్రమేనని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు. శుక్రవారం ఆయనిక్కడ ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడుతూ.. దేశంలో ఎవరి పవనాలు వీస్తున్నాయో...మే 16న తెలుస్తుందన్నారు. అయితే గుజరాత్‌లోని ఓ సామాన్య సీఎంకు దేశ వ్యాప్తంగా ప్రచారం కల్పిస్తున్నది మీరేనంటూ విలేకరుల వైపు వేలెత్తి చూపారు. తాను స్వల్ప కాలం ప్రధానిగా ఉన్నప్పటికీ ఎన్నో పనులు చేశానంటూ, తన సాధనలతో కూడిన చిరు పుస్తకాన్ని ఆయన ప్రదర్శించారు. గత శాసన సభ ఎన్నికలు, మండ్య, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో జేడీఎస్ వెనుకబడిన మాట నిజమేనని అంగీకరించారు. అప్పట్లో తమ పార్టీ పనై పోయిందని చాలా మంది భావించారని అన్నారు. ఆ సమయంలో అనారోగ్యం వల్ల తాను నాలుగైదు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అనంతరం పార్టీ తరఫున పలు కార్యక్రమాలను నిర్వహించామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తృతీయ ఫ్రంట్ ఆవిర్భవిస్తుందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తృతీయ ఫ్రంట్ అస్తిత్వంలో ఉందన్నారు. మే 16 తర్వాత రాజకీయ పునరేకీకరణ జరుగుందని జోస్యం చెప్పారు. దేశంలో కాంగ్రెస్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని, దీని ద్వారా బీజేపీ లాభపడాలని చూస్తోందని అన్నారు. మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, నవీన్ పట్నాయక్ సహా ఎండీఎంకే, ఏఐఏడీఎంకే, జేడీఎస్, వామపక్షాలు, ముస్లిం లీగ్ సహా అనేక పార్టీలు తృతీయ ఫ్రంట్ వైపు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు 23 స్థానాలు చొప్పున గెలుస్తామంటూ బీరాలు పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ లెక్కన హాసన స్థానం కూడా తనకు దక్కేట్లు లేదని ఆయన చమత్కరించారు. -
లోక్‌సభ ఎన్నికల తర్వాతా నేనే ముఖ్యమంత్రి
సిద్ధరామయ్య వెల్లడి విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు మోడీకి ఓటమి భయం అందుకే రెండు స్థానాల్లో పోటీ మైసూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు ఆరోపించడంలో వాస్తవం లేదన్నారు. అలాగైతే లోక్‌సభ ఎన్నికలను ఒకే దశలో ఎలా నిర్వహించగలుగుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జేడీఎస్‌కు ఉనికే లేదని, బీజేపీలో అవినీతిపరులున్నారని విమర్శించారు. మైసూరులో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం ద్వారా తనకు అప్రతిష్ట తెచ్చేందుకు బీజేపీ, జేడీఎస్‌లు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆరోపించారు. మోడీకి భయం : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని చెప్పుకుంటున్న ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రెండు చోట్ల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ఒక స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలని సవాలు విసిరారు. గుజరాత్లో మోడీ అవినీతికి పాల్పడి రూ.కోట్లు వెనకేసుకున్నారని, ఆ ధనాన్ని లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్లో నరమేధానికి పాల్పడిన మోడీని శివునితో పోల్చడం హాస్యాస్పదమన్నారు. -
రానున్న పదేళ్లు దేశాభివృద్ధికి ఎంతో కీలకం
‘మీట్ ది ప్రెస్’లో ప్రధానమంత్రి సలహాదారు శ్యామ్ పిట్రోడా సాక్షి, బెంగళూరు: రానున్న పదేళ్లు భారతదేశ అభివృద్ధికి ఎంతో కీలకమైనవని ప్రధానమంత్రి సలహాదారు శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశ అభివృద్ధి ఒక కూడలి వరకు చేరుకుందని, కూడలి వద్ద కనిపిస్తున్న మార్గాల్లో ప్రజలు ఏ మార్గాన్ని ఎంచుకుంటారనే విషయంపై భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చిన బయోటెక్, నానోటెక్, స్టెమ్ టెక్నాలజీ వంటి ఎన్నో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఎన్నో సమస్యలకు సులువైన పరిష్కారాలను చూపుతున్నాయని, అయితే వాటిని మనం సరైన దారిలో ఉపయోగించుకోవడం లేదని అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఎప్పుడో రూపొందించిన విద్యా బోధనా విధానాలనే మనం అనుసరిస్తున్నామంటే మార్పును స్వాగ తించడానికి ఎంత మాత్రం ఇష్టపడుతున్నామనే విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. క్రికెట్, బాలీవుడ్ గాసిప్స్, రాజకీయాలు వంటి విషయాలపై చర్చించేందుకు తప్ప దేశంలో ఎలాంటి టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటి అనే విషయాలపై ప్రజలతో పాటు మీడియా కూడా చర్చించడం లేదని అన్నారు. అందుకే అసలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతోందనే విషయంపై ప్రజలు కనీస సమాచారం కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు సరైన అవకాశాలు కల్పిస్తేనే.... ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్‌లోనే ఎక్కువ సంఖ్యలో యువత ఉందని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. అయితే భారత్‌లోని యువతకు సరైన అవకాశాలు కల్పించినప్పుడే ప్రపంచ దేశాలకు భారత్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ఇక ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ శాతం యువతే ఉన్నా అన్ని రంగాల్లోనూ విధి విధానాలను రూపొందించే వారు మాత్రం 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారే ఉంటున్నారని అన్నారు. ఆ విధానాలను అనుభవించే వారు మాత్రం 20ఏళ్ల వారై ఉంటున్నారని తెలిపారు. అమెరికా మోడల్‌ను కాపీ కొట్టడం కాకుండా సొంత ఆలోచనలకు పదును పెట్టడం ద్వారా భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపేందుకు ఆస్కారం ఉంటుందని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. సూపర్ పవర్ అని ఎలా అంటారు.... భారతదేశంలో 300 మిలియన్ల మంది ప్రజలు కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంటే భారత్‌ను సూపర్ పవర్‌గా ఎలా అభివర్ణిస్తారని శ్యామ్ పిట్రోడా ప్రశ్నించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగాలు కల్పించిన తరువాత భారత్‌ను సూపర్ పవ ర్గా చెప్పుకోవచ్చని, అప్పటి దాకా సూపర్ పవర్‌గా ఎదిగేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఇక ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి అందుబాటులోకి తెచ్చిన పరిజ్ఞానాన్ని వాడుకోవడానికి కూడా భారత్‌లో చాలా మంది ఇష్టపడడం లేదని, ఐటీ శాఖలోని ఉద్యోగులే ఆ శాఖకు చెందిన వివిధ పత్రాలను ఇప్పటికీ కంప్యూటర్లో పొందుపరచకుండా ఫైల్స్ రూపంలోనే ఉంచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. -
ప్రాంతీయ చిత్రాలపై నిర్లక్ష్యం
= బాలీవుడ్ దర్శకుడు అమోల్ పాలేకర్.. = మంచి ప్రాంతీయ చిత్రాలూ ఫెయిల్ అవుతున్నాయి = చిన్న చిత్రాలకు వేదిక అవసరం = రాజకీయాలకు నేను దూరం = మోడీపై లతా మంగేష్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించను = అనేక విజయాలను చూశాననే ఆత్మ త ృప్తి చాలు = వన్డే మ్యాచ్‌ను తిలకించడానికి ఇక్కడికి వచ్చా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ప్రాంతీయ చిత్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారని బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ విచారం వ్యక్తం చేశారు. బెంగళూరు ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. విజయవంతమైన వాణిజ్య చిత్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రాంతీయ చిత్రాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ పరిణామాల మధ్య ప్రాంతీయ సినిమా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆగత్యం ఏర్పడిందన్నారు. జన జీవన స్రవంతిలో కలసిపోయే 90 శాతం సినిమాలు విజయాన్ని సాధించలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో చిన్న చిత్రాలకు వేదికను నిర్మిస్తే, ప్రేక్షకులు తమంతట తాముగా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో సంబరాలు భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహారాష్ర్టలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కె మహారాష్ట్ర వారు కావడంతో పాటు బాలీవుడ్‌కు ముంబై కేంద్రం కావడం దీనికి కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు తానెంతో దూరమని చెప్పారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. అయితే బాధ్యత కలిగిన పౌరుడుగా తానేం చేయాలో బాగా తెలుసునన్నారు. 45 ఏళ్ల రంగ స్థల, సినిమా జీవితంలో ఎన్నో విజయాలను చూశానని అన్నారు. ఆత్మ తృప్తి ఉందన్నారు. ఇప్పుడు తన మూల వృత్తి చిత్ర కళపై ఆసక్తి పెరిగిందని తెలిపారు. కాగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరిగిన చివరి వన్డేను తిలకించడానికి ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ప్రఖ్యాత క్రికెటర్ జీఆర్. విశ్వనాథ్‌తో కలసి మ్యాచ్‌ను చూడడాన్ని ఎప్పటికీ మరువలేనని చెప్పారు. తొలి నుంచీ తాను క్రికెట్ అభిమానిని, మ్యాచ్‌లను చూడడానికి షూటింగ్‌లకు కూడా ఆపేసే వాడినని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో పలు సార్లు తన భార్య చేత చీవాట్లు తిన్నానని గుర్తు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా కన్నడ నట దిగ్గజాలు అనంత్ నాగ్, అరుంధతీ నాగ్, గిరీశ్ కర్నాడ్‌లతో కలసి కాలక్షేపం చేసే అవకాశం రావడం తనకెంతో సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు. -
కేంద్రం అసెంబ్లీ తీర్మానం కోరదు: డీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రం నుంచి అసెంబ్లీ తీర్మానం లాంటివి అడగడం ఉండదని, రాష్టం నుంచే అలాంటివి చేసి పంపాల్సి ఉంటుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలచే తీర్మానం చేయించి ప్రక్రియను కొనసాగించారన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీకి చెందినవారు కానప్పటికీ అప్పటి ప్రధాని వాజ్‌పేయి వారిని పిలిపించుకుని ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో విభజనకనుకూలంగా తీర్మానాలు జరిగేలా ఒప్పించారన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో డీఎస్ మాట్లాడారు. విభజనకు సంబంధించి ఆర్టికల్ మూడు ప్రకారం రాష్ట్రపతి అసెంబ్లీకి పంపే విభజన బిల్లుపై ఓటింగ్ జరగదని, రాజ్యాంగంలో ఈ విషయం స్పష్టంగా ఉందని అన్నారు. రాష్ట్రపతి నుంచి విభజనకు సంబంధించి ముసాయిదా బిల్లు మాత్రమే అసెంబ్లీకి వస్తుందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చేసి ఎందుకు పంపడంలేదో సీఎంనే అడగాలని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. విభజన ప్రక్రియపై సీఎం... ప్రధాని, రాష్ట్రపతికి లేఖలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన చాలా సందర్భాల్లో వారిని క లుస్తుంటారని, అలాంటప్పుడు ఏమీ అడగకుండా, ఈ లేఖలు రాయడం ఏమిటన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చాంపియన్లుగా కచ్చితంగా కాంగ్రెస్, సోనియాగాంధీయే నిలుస్తారని డీఎస్ అన్నారు. ఎవరైనా తనకు బహుమతి ఇచ్చిన వారినే ఆదరిస్తారని, ఎవరు చెబితే ఆ బహుమతిని ఇచ్చారన్నది పట్టించుకోరని పరోక్షంగా టీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయమని తెలంగాణ నేతలెవరూ కేసీఆర్‌ను అడగలేదన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని కేసీఆరే ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడున్న సమస్యల్లా.. అందరి ఆందోళనలు, అన్ని ప్రాంతాల వారి సమస్యలు, అనుమానాలు, అపోహలు నివృత్తి చేస్తూ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు అడుగుతున్న సమన్యాయం అంటే ఎవరికీ ఏమీ చేయకుండా ఉండడమేనని ఆ పార్టీ నేతలే తనతో చెప్పారన్నారు. ‘ఈ విషయంలో జగన్మోహన్రెడ్డి పిల్లోడు, సీఎం కావాలన్న పట్టుదలతో ఉన్నాడు.. ఆయన్ను గురించి పెద్దగా మాట్లాడను’ అని అన్నారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ వార్తలపై తాను మాట్లాడనని, సీమాంధ్రలో కాంగ్రెస్ బలోపేతంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో సంఘం నేతలు కొమ్మినేని శ్రీనివాసరావు, కందుల రమేష్, వంశీకృష్ణ, సిరాజుద్దీన్, నరసింహారావు పాల్గొన్నారు. -
2014లోగా విభజన జరగదు!
సాక్షి, హైదరాబాద్: 2014 లోగా రాష్ట్ర విభజన జరగదని రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లును ప్రవేశపెట్టే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లును శాసనసభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తే విభజన బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటుకు పంపరనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర విభజనలో భాగస్వామి కాదల్చుకోకనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనుకోవడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఓ హోటల్లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఉండవల్లి పాల్గొన్నారు. ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెవుల కృష్ణాంజనేయులు, ఎం.వంశీకృష్ణ, సలహాదారులు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్ఎం బాషా, కందుల రమేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన నేపథ్యంలో 371 (డి) అధికరణను రద్దు చేయడం అనివార్యమా? కాదా? అనే దానిపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. విభజన ముసాయిదా బిల్లుపైఅసెంబ్లీ అభిప్రాయం తప్పనిసరి. మెజారిటీ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తే రాష్ట్రపతి పాత్ర కీలకమవుతుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఈ నెల 23న రాష్ర్టపతిని తనతోపాటు 40 మంది నాయకులు కలవబోతున్నామన్నారు. రాష్ట్రం విడిపోతే కోస్తాకు వచ్చిన నష్టమేమీ లేద ని, తెలంగాణకే వెయ్యి రెట్ల ఎక్కవ నష్టం జరుగుతుందని ఉండవల్లి అన్నారు. రాయలసీమ ఎడారైపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది. అయినా సీమాంధ్రోళ్లు దోపిడీదారులు అంటే ఒప్పుకునేది లేదన్నారు. కాంగ్రెస్‌కు దత్తపుత్రుడు దొరికినందు వల్లే పార్టీ తమను పట్టించుకోవడం లేదంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యలో స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తనకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన, ఇతర పార్టీల్లో చేరాలనే భావన లేదని, రాజకీయాలను వదిలేసే ప్రసక్తి కూడా లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. -
ఉప పోరు తర్వాతే
సాక్షి, బెంగళూరు : బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం నెలకొల్పదలచిన కమిటీ ఏర్పాటవుతుందని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేసినందువల్ల మంచి పదవిని ఆశిస్తున్నానన్నారు. తనకు కొంత మంది ఉప ముఖ్యమంత్రి పదవి, మరి కొందరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారని తెలిపారు. అయితే ఇందులో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరుతున్న ఇతర పార్టీల నాయకులకు తాము ఎటువంటి హామీలు ఇవ్వడం లేదన్నారు. బేషరతుగానే అందరూ చేరుతున్నారని వెల్లడించారు. దీనిపై పార్టీకి లిఖితపూర్వకంగా కూడా అందించారన్నారు. మాజీ డీజీపీ శంకర బిదరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది తానేనన్నారు. పార్టీ నియమావళిమేరకు ఆయనకు గత శాసన సభ ఎన్నికల సందర్భంగా టికెట్టు ఇవ్వలేకపోయామన్నారు. ఆయన మరి కొంత కాలం వేచి ఉంటే సముచిత స్థానం దక్కి ఉండేదని అభిప్రాయపడ్డారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొన్న వారిలో 450 మందికి నోటీసులు జారీ చేశామన్నారు. వీరి లో ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు సహా ఏడు మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడని వారిని ఎట్టి పరిస్థితులల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రి య దాదాపు పూర్తి కావస్తోందన్నా రు. ఎన్నికలకు రెండు, మూడు నెల ల ముందుగానే కాంగ్రెస్ అభ్య ర్థుల పేర్లను ప్రకటిస్తామన్నారు. కా గా బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయింది: కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని తాను భావిస్తున్నట్టు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేదని అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఉద్యమం విజయం సాధించడంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేశారని ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఈ ఉద్యమస్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అసమానతలు, అంతరాలు తగ్గాలని అన్నారు. తెలంగాణలో అద్భుత వనరులున్నాయని చెప్పారు. ప్రకృతి వరంగా ఇచ్చిన సింగరేణి గనులు తమ ప్రాంతంలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణకు భవిష్యత్‌లో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని పారిశ్రామికవేత్తలు చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాతావరణం కూడా బాగా అనుకూలమని తెలిపారు. ప్రపంచంలో పెట్టుబడులకు అనుకూల నగరం హైదరాబాద్ అని చెప్పారు. నిజాం కాలంలోనే హైదరాబాద్‌లో వందకుపైగా పరిశ్రమలున్నాయని వెల్లడించారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు కృషి చేస్తానని కేసీఆర్ హామీయిచ్చారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర విభజన జరుగుతుందన్నారు.