కాంగ్రెస్ పథకాలకు టీఆర్ఎస్ లేబుల్స్
♦ మీట్ ది ప్రెస్‌లో వీహెచ్
♦ రాష్ట్రంలో మంత్రులకేదీ విలువ
♦ సీఎం కేసీఆరా, కేటీఆరా?
♦ టీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు
♦ కరువై అరువు తెచ్చుకుంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెచ్చిన పథకాలకు, చేసిన అభివృద్ధికి టీఆర్‌ఎస్ లేబుల్స్ వేసుకుని ప్రచారం చేసుకుంటోందని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పునాదులు వేసిందన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీయూడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ జర్నలిస్టు యూనియన్ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో నలుగురు మంత్రులున్నా కేటీఆర్ పెత్తనం చెలాయిస్తున్నారని, మంత్రులకు విలువ లేకుండా పోయిందన్నారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరా, కేటీఆరా అని వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నదని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ఆనాడు ప్రతిపక్షనేతతో సహా కాంగ్రెస్‌లోనూ కొందరు నేతలు వ్యతిరేకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా, సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ గుర్తుచేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలర్ల ఓట్లు చాలా కీలకమని, అందుకే టీఆర్‌ఎస్ కూడా మరోసారి మోసం చేయడానికి కల్లబొల్లి మాటలను చెబుతోందని విమర్శించారు. లంకలో పుట్టినవారంతా రాక్షసులేనని, సెటిలర్లు ద్రోహులని ఆంధ్ర వారి గౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షపాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతిపక్షపాత్రలో పీజేఆర్, జానారెడ్డిని పోల్చిచూడలేమన్నారు. ఎవరిశైలిలో వారు వ్యవహరిస్తారని, ఒకరితో మరొకరిని పోల్చిచూడకూడదన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటుందని, వ్యూహాత్మకంగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. టీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినా మేయర్ పీఠం కాంగ్రెస్‌కే దక్కుతుందని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువైనారని ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఎక్కువగా కాంగ్రెస్ నేతలే ఉన్నారని వీహెచ్ చెప్పారు. టీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు లేక కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి నేతలను అరువు తెచ్చుకుంటోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి ఫెడరేషన్ అధ్యక్షుడు సోమయ్య అధ్యక్షత వహించగా, బసవపున్నయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు.