ఇక నా రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్‌ | Cm Revanth Commets In Meet The Press On 100 Days Governance | Sakshi
Sakshi News home page

ఇన్ని రోజులు సీఎంగా నిబద్ధతతో పనిచేశా.. ఇక రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్‌

Published Sun, Mar 17 2024 12:12 PM | Last Updated on Sun, Mar 17 2024 2:04 PM

Cm Revanth Commets In Meet The Press On 100 Days Governance - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: గత ఏడాది డిసెంబర్‌ 3న  తెలంగాణలో ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని, స్వేచ్ఛకు మించింది ఏదీ లేదని నిరూపించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంబించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో రేవంత్‌ మాట్లాడారు. 

‘మా ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. నిన్నటిదాకా సీఎంగా నిబద్ధతతో పనిచేశా. ఇక పార్టీ అధ్యక్షునిగా నన్ను చూస్తారు. ఎన్నికల నగారా మోగినందున ఎన్నికల్లో నా రాజకీయ రూపం చూస్తారు.  సీఎంగా వందవ రోజు ఒక గేట్ ఓపెన్‌ చేశా. అవతల వర్గం ఖాళీ అయితే గేట్లు మూసినా తెరచినా ఒక్కటే.  ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటానా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు పెద్దలు కొట్టకుండా ఊరుకుంటామా.

యువకుల ఆత్మబలిదానాలతో సమైక్య పాలన నుంచి విముక్తి పొంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్‌ రాజరికపోకడలను మళ్లీ తీసుకువచ్చారు. తన వారసులే ఆధిపత్యం చెలాయించాలని కోరుకున్నారు. కేసీఆర్‌ నిజాం నకలునే మళ్లీ చూపించాడు. ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు. తిరుగుబాటు చేసినవారందరినీ అణచివేశాడు. దీంతో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌ పరిపాలనను తీసుకువచ్చారు.

ధర్నాచౌక్‌ వద్దు అన్న వారిని కూడా ధర్నా చేసుకోనిచ్చిన  ప్రభుత్వం మాది. ప్రగతిభవన్‌ కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. సామంతులలాగా అధికారం కొద్ది మంది అధికారుల చేతిలో పెట్టకుండా అధికారులందరికీ పాలనలో స్వేచ్ఛను కల్పించి పారదర్శకతను తీసుకువచ్చాం. ఉద్యమంలో మాట్లాడిన మాటలను మర్చిపోయి కేసీఆర్‌ తెలంగాణ సంస్కృతిని చెరిపే ప్రయత్నం చేశారు. మేం వచ్చిన తర్వాత జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశాం. 

ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు తీసుకువచ్చి, ఆరోగ్య శ్రీ పరిమితి పెంచాం. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చాం. తెలంగాణ విద్యుత్‌ రెగ్యులేటరి కమిషన్‌(ఈఆర్సీ)లో కేసీఆర్‌ నాటిన గంజాయి మొక్క ఒకటి గృహజ్యోతి డబ్బులు ముందే డిస్కంలకు ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఇచ్చిన వ్యక్తి ఇంటి పేరు కూడా తన్నీరు. ఈ తన్నీరుకు గతంలో రైతులకు ఉచిత విద్యుత్‌ డబ్బులు కేసీఆర్‌ ముందే ఇచ్చాడో లేదా తెల్వదా. ఈ గంజాయి మొక్కలన్నింటిని సమూలంగా పీకేస్తాం’ అని రేవంత్‌ హెచ్చరించారు. 

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌..ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement