ఎందుకు ఓడిపోయారంటే తలదించుకుంటున్నాం
హైదరాబాద్ : కాంగ్రెస్ హైకమాండ్పై ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు వీ హనమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎందుకు ఓడిపోయిరని ఢిల్లీలో అడుగుతుంటే తలదించుకుంటున్నామని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఢిల్లీలో కూర్చుని నాయకుడిని ఎంపిక చేస్తే కుదరదని వీహెచ్ అన్నారు. కొత్త పీపీసీ అధ్యక్షుడిని హైకమాండ్ ఎంపిక చేయకుండా...నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక చేయాలన్నారు. ఇందుకోసం హైకమాండ్ పెద్దలు హైదరాబాద్ వచ్చి సమీక్షలు నిర్వహించాలని వీహెచ్ సూచించారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి?, వైఫల్యం ఎవరిదనేది తేలాల్సి ఉందన్నారు. అయిదేళ్లలో పార్టీని బతికుంచకుంటే, తెలంగాణ మరో తమిళనాడు అవుతుందని వీహెచ్ అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆంధ్రా నాయకత్వ జోక్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇంకా ఆంధ్రా పెత్తనం కొనసాగుతుందని, అలా అయితే కార్యకర్తలు తిరగబడటం ఖాయమన్నారు. టీఆర్ఎస్ను థీటుగా ఎదుర్కొనే నాయకుడు కావాలని వీహెచ్ అన్నారు. పొన్నాలను తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు.