
మంత్రి కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలపై సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ వేదికగా టీఆర్‌ఎస్ నేత, మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..భవిష్యత్ తరాల పిల్లలకు నీటి కష్టాలు లేకుండా చేయడమే మిషన్ భగీరథ లక్ష్యమని చెప్పారు. విద్యుత్ కోతలు అనేది తెలియకుండా భవిష్యత్ తరాల వారికి కరెంటు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా రూ. 39.4 కోట్లు వస్తే.. టీఆర్‌ఎస్ హయాంలో ఇసుక ద్వారా రూ.2 వేల కోట్లు వచ్చాయని తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చపోయినా మనం ముందుకు దూసుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకువచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం వచ్చిందని, కంటి వెలుగు ద్వారా 80 శాతం ప్రజలకు పరీక్షలు పూర్తి అయ్యాయని వెల్లడించారు. శాంతి భద్రతల విషయంలో క్రైమ్ రేటు తగ్గిందని చెప్పారు. 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 8 వేల పరిశ్రమలకు టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చామని తెలిపారు. గతంలో జలమండలి ముందు బిందెలతో బారులు తీరేవారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి బాధలు లేవని అన్నారు. కారు ఆగవద్దు..డ్రైవర్ మారొద్దని పరోక్షంగా టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేయాలని అడిగారు.
నాలుగు సంవత్సరాల 3 నెలల పాలనలో ఒక మంత్రిగా మీ ముందుకు వచ్చానని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీయే స్వయంగా కేసీఆర్ దేశంలో ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. గతంలో తెలంగాణాలో ప్రభుత్వాన్ని నడిపే సమర్ధుడైన నాయకుడు లేరని కొంత మంది విమర్శించారని, ఆ మాటలు తప్పని కేసీఆర్ నిరూపించారని అన్నారు. ఆదాయం పెంచుకుంటూ పేదలకు పంచుతూ సమాజంలో అందరినీ కలుపుకుని పోయామని వ్యాఖ్యానించారు. దేశంలో దాదాపు 16 రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉండటానికి టీఆర్‌ఎస్ పార్టీయే కారణమన్నారు. తెలంగాణ వచ్చాక పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, అలాగే కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కూడా జరిగిందని తెలిపారు.
చంద్రబాబులాగా నేను కంప్యూటర్‌ను కనిపెట్టలేదు
ఈ సందర్బంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబులా హైదరాబాద్ నేనే కట్టాను.. హైకోర్టు భవనం నేనే కట్టాను..కంప్యూటర్‌ను నేనే కనిపెట్టాను.. అంటే ప్రజలు నవ్వుతారని వ్యాఖ్యానించారు. బీజేపీ మాకు రాజకీయ ప్రత్యర్థి అని తెలిపారు. 100 పైగా సీట్లలో బీజేపీ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. తాను మంత్రిని అవుతానని జీవితంలో అనుకోలేదని, ఈ మంత్రి పదవే తనకు ఎక్కువ అని, కేసీఆర్ లాంటి నాయకులు రాష్ట్రాన్ని నడపాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరో 15 సంవత్సరాలు కేసీఆర్‌యే సీఎంగా ఉండాలనేదే తన కోరికన్నారు.
బాబు పొత్తుపెట్టుకోని పార్టీ లేదు..ఒక్క వైఎస్సార్‌సీపీ తప్ప
టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఒక్క వైఎస్సార్‌సీపీతో మాత్రమే పొత్తు పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. అవసరం అయితే వైఎస్సార్‌సీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా వెనకాడరని అన్నారు. గాంధీ భవన్ తలుపులు మూస్తున్నారని, ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడానికే సమయమిచ్చారని ఎద్దేవా చేశారు. చిన్న చిన్న సమస్యలకు ముఖ్యమంత్రి కార్యాలయం ముందు లైన్‌లో నిలబడితే ముఖ్యమంత్రికి పని చేతకాదు అని ఒప్పుకున్నట్లా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలతో తెలంగాణాను అగ్రపథంలో నిలిపిన టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment