
సిద్ధాంతం, కార్యకర్తలే మా బలం
♦ టీఆర్‌ఎస్ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా గ్రామాల్లోకి విస్తరిస్తాం
♦ ‘మీట్ ది ప్రెస్’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: సైద్ధాంతిక విధానం, రాజీపడకుండా పోరాడే కార్యకర్తలే తమ పార్టీకి బలమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. అన్ని వర్గాలు, ప్రాం తాల్లో బలమైన నిర్మాణమున్న, సామాన్యులకు అత్యున్నతస్థాయి అవకాశాలు కల్పించే పార్టీ తమదన్నారు. రాష్ట్ర ప్రజల్లో ఎన్నో ఆశలను కల్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా గ్రామాల్లోకి విస్తరిస్తామన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో లక్ష్మణ్ మాట్లాడారు.
హామీల అమల్లో అధికార పార్టీ విఫలమవడం, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడటంతో ఏర్పడిన రాజకీయ శూన్యతలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ మనవడు చదివే స్కూల్లోనే అతని డ్రైవర్ కుమారుడు చదివే అవకాశం వస్తుందంటూ చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిం ది. దానికి అతీగతీ లేదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు ఏ కులమైనా, ఏ మతమైనా రిజర్వేషన్లతో అవకాశాలు కల్పిం చాలనేది మా విధానం. కానీ కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం కులమతాల పేరిట ప్రజ లను విభజించే కుట్రలకు టీఆర్‌ఎస్ పాల్పడుతోంది’’ అని లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
సీఎం సచివాలయానికి పోతేనే గొప్ప...
ఉపాధ్యాయుడు రోజూ బడికి వెళ్లడం సహజం. డాక్టర్ ప్రతీరోజూ ఆసుపత్రికి పోవడం సాధారణం. కానీ సీఎం కేసీఆర్ సచివాలయానికి పోతే చాలా పెద్ద వార్త. కేసీఆర్ ఈ రోజు సచివాలయానికి వెళ్లారు, ప్రజలకు సంబంధించిన ఫైళ్లు చూశారు అని గొప్పగా ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది. అదీ కేసీఆర్ పనితీరు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఏర్పా టైంది. కానీ కేసీఆర్ అస్తవ్యస్త విధానాలతో ఇప్పటికే రూ. 1.23 వేల కోట్ల అప్పులు చేశా రు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ల వల్ల పెరిగిన వ్యయానికి అనుగుణంగా ఆయకట్టు పెరగాలి. కేవలం కమీషన్లు, అవినీతి, రాజకీయ ప్రయోజనాల కోసమే రీ డిజైన్లు అయితే అడ్డుకుంటాం.
టీడీపీతో పొత్తు లేదు...
టీడీపీతో ఇప్పుడు పొత్తులేదు. 2019లో రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఒంటరిగానే ఎదుగుతాం. యువత, మహిళ, దళితులకు సముచిత ప్రాధాన్యమిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం. బీజేపీ అంటే పట్టణ ప్రాంతాల పార్టీ అని, మైనారిటీలకు వ్యతిరేకమని, అగ్రవర్ణాలకే పరిమితమనే అపోహలను తొలగిస్తాం. పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు, సమష్టి నాయకత్వానికి లోబడి పనిచేసేవారెవరైనా బీజేపీలో ఇమిడిపోతారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు వెళ్లడానికి కారణాలు, వారికి బీజేపీలో ఉన్న ఇబ్బందులేమిటో వచ్చిపోయేవారికే తెలియాలి. పార్టీలో ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని పెంచుకుంటున్నాం.
ఫిరాయింపులతో గాలిబుడగలా టీఆర్‌ఎస్....
తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ అనే నమ్మకంతో టీఆర్‌ఎస్‌కు ప్రజలు అధికారం అప్పగించారు. ఈ అధికారంతో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల మన్నన పొందకుండా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాం గ్రెస్ వంటి ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ స్వయంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. ఫిరాయింపులతో శాసనసభలో సంఖ్యను పెంచుకుని బలం పెరిగిందనుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన గాలితో టీఆర్‌ఎస్ గాలిబుడగలా అవుతోంది. అదెప్పుడైనా పేలిపోవచ్చు. లోక్‌సభలో గతంలో కేవలం రెండు సీట్ల బలమున్న బీజేపీకి ప్రజలిప్పుడు సంపూర్ణ మెజారిటీతో దేశాన్ని అప్పగించారు. ఈ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ, ఏపీలోనూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. దీనికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను వాడుకోవాలనుకుంటున్నారు.