
టీఆర్‌ఎస్ బలం నామమాత్రమే
* మేయర్ పదవి కోసం అడ్డదారులు
* ‘కారు’ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో
* మా కూటమికే మేయర్ పీఠం
* మీట్ ద ప్రెస్‌లో బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భావోద్వేగాలతో అధికారంలోకి రావడం మినహా టీఆర్‌ఎస్‌కు హైదరాబాద్‌లో బలం లేదని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ఉద్యమం చేయడం వల్ల వచ్చిన మద్దతుతోపాటు ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజలను బుట్టలోవేసుకొని బొటాబొటి మెజారిటీతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలను నిర్వహించకుండా జాప్యం చేసిందని, కోర్టు ఉత్తర్వులతో అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే టీఆర్‌ఎస్ కేవలం రెండు మాత్రమే గెలిచిందని, దీంతో ఇక్కడ బలం లేనందున అడ్డదారుల్లో మేయర్ స్థానాన్ని గెల్చుకోవడానికి కుట్రలకు దిగుతోందన్నారు. ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను గ్రేటర్ పరిధిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదుచేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు.
టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిపై విశ్వాసం ఉంటే ప్రత్యక్ష ఎన్నికకు సిద్ధం కావాలని సవాల్‌చేశారు. గ్రేటర్ పరిధిలో 14 అసెంబ్లీ స్థానాలను, 2 లోక్‌సభ సీట్లను గెల్చుకున్న టీడీపీ-బీజేపీ కూటమికే మేయర్ పీఠం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీని ఒవైసీ కుటుంబం, కొత్త సిటీని కేసీఆర్ కుటుంబం పంచుకోవాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని, సాక్షాత్తు మజ్లిస్ నేతలే ఈ విషయం చెబుతున్నారని గుర్తుచేశారు.
మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లింల ఓట్లు పొందడం తప్ప, పాతబస్తీలో అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మెట్రోరైలు నిర్మాణాన్ని అడ్డుకున్న ఎంఐఎంకు టీఆర్‌ఎస్ వంతపాడుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నలుగురు మంత్రులున్నా పాతబస్తీలో పర్యటించారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లాగా బీజేపీ ఒక కుటుంబానికి పరిమితమైన పార్టీ కాదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని, దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు. కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వకుండా వారిని అవమానించారని దుయ్యబట్టారు.
హైదరాబాద్‌లో కనీసం మూ డు రోజులకు ఒకసారి తాగునీరు రాకున్నా, ప్రత్యామ్నాయాలను అన్వేషించకుండా వట్టి మాటలతో టీఆర్‌ఎస్ సర్కారు మోసం చేస్తోందన్నారు. బీజేపీపాలిత రాష్ట్రా ల్లో, నగరాల్లో అనుసరించిన మార్గాలే దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా ఉన్నాయని లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ని దులిస్తున్నా రాజకీయ లబ్ధి కోసం మంత్రులు బీజేపీపై, ప్రధాని మోదీపై అనుచితంగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈస్ట్‌మన్ కలర్లలో హోర్డింగులు మినహా ఆచరణలో టీఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్నారు.