సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) పూర్తి మెజారిటీ సాధించి మూడోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి సందిగ్ధత లేదని, ఎటువంటి అనుమానాలు అక్కరలేదని వ్యాఖ్యానించారు. ఎవరిని ఎన్నుకోవాలో క్షేత్ర స్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ‘హంగ్’కు అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ ఆధిక్యత లభించదనేది కాంగ్రెస్ ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టి పారేశారు. హైదరాబాద్ దేశోద్ధారక భవన్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే– ఐజేయూ) ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
కాంగ్రెస్‌ది అంతా గోబెల్స్ ప్రచారం
‘గతంలో ప్రత్యక్షంగా మహాకూటమి పేరిట బీఆర్‌ఎస్ గొంతు నులమాలని చూసినా విజు్ఞలైన ఓటర్లు కేసీఆర్‌కు మద్దతు పలికారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు, వ్యక్తులతో అంటకాగుతున్న వ్యక్తి రేవంత్. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ రాహుల్ గాంధీ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ఇక్కడ ఉద్యోగాల కల్పన విషయంలో గోబెల్స్ ప్రచారం చేస్తోంది. మా మేనిఫెస్టోను కాపీ కొట్టి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటోంది. మేనిఫెస్టో హామీల అమలులో కాంగ్రెస్‌ది ఎగవేసిన చరిత్ర అయితే బీఆర్‌ఎస్‌ది నెరవేర్చిన చరిత్ర’
అందరినీ సంతృప్తిపరచలేము
‘‘వరుసగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు అందరినీ సంతృప్తి పరచలేరు. నాణేనికి రెండువైపులా అన్నట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయి. మేనిఫెస్టోను అమలు చేయగలిగే వారికే మెజారిటీ ఓట్లు పడతాయి. కేసీఆర్‌కు సరితూగే నాయకులు రాష్ట్రంలో లేరు. ఓటమి ఎరుగని నాయకుడు కేసీఆర్ మీద పోటీ చేయడం ద్వారా రేవంత్, ఈటల పెద్దవాళ్లు కావాలనుకుంటున్నారు. బీజేపీ గుజరాత్, కాంగ్రెస్ కర్ణాటక మోడల్ అంటున్నా తెలంగాణ మోడల్‌కు ఏదీ సాటిరాదు. కర్ణాటక మోడల్ అట్టర్ ఫెయిల్. నెత్తీ కత్తీ లేని బీజేపీ ఇచ్చే హామీలకు విలువ లేదు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాతో పనిచేయడం లేదు. కాంగ్రెస్ చెప్తున్నంతగా క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి కేడర్ బలం లేదు. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని బదనాం చేసి ప్రయోజనం పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోంది.’’
సోషల్ మీడియాలో నాపై విష ప్రచారం
తెలంగాణ ఉద్యమంలో రెండు వందలకు పైగా కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన నాపై విమర్శించేందుకు ఏమీ లేకనే సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులను తృణప్రాయంగా వదిలేశా. తెలంగాణ ప్రజలపై రైఫిల్ ఎక్కు పెట్టిన రేవంత్‌కు విమర్శించే హక్కు లేదు. ఎన్నో బ్యారేజీలు, రిజర్వాయర్లు, టన్నెళ్లు, కాలువల సముదాయం కాళేశ్వరంపై విమర్శలు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదే. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల కూటమి దేశంలో గణనీయ పాత్ర పోషిస్తుంది.
మళ్లీ అవకాశం వస్తే ఆరోగ్య శాఖ మంత్రిగానే..
‘తెలంగాణలో గంగా జమునా తహజీబ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతాం. రాబోయే రోజుల్లో విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేస్తాం. హైదరాబాద్‌లో మౌలిక వసతుల మీద ఫోకస్ పెంచుతాం. కరోనా, పెద్దనోట్ల రద్దు మూలంగా ఉద్యోగుల వేతనాల చెల్లింపులో కొంత ఆలస్యం జరిగినా చెల్లింపులు ఆగలేదు. మాకు ఏ పార్టీతోనూ అవగాహన లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. నేను కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే కార్యకర్తను. పార్టీ అప్పగించే బాధ్యతను నెరవేర్చే వ్యక్తిని మాత్రమే. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం కత్తిమీద సాము అయినా ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం అనే సంతృప్తి ఉంటుంది. అందుకే మళ్లీ అవకాశం వస్తే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయాలనుకుంటా.
Comments
Please login to add a commentAdd a comment