
కేంద్రం అసెంబ్లీ తీర్మానం కోరదు: డీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రం నుంచి అసెంబ్లీ తీర్మానం లాంటివి అడగడం ఉండదని, రాష్టం నుంచే అలాంటివి చేసి పంపాల్సి ఉంటుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలచే తీర్మానం చేయించి ప్రక్రియను కొనసాగించారన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీకి చెందినవారు కానప్పటికీ అప్పటి ప్రధాని వాజ్‌పేయి వారిని పిలిపించుకుని ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో విభజనకనుకూలంగా తీర్మానాలు జరిగేలా ఒప్పించారన్నారు.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో డీఎస్ మాట్లాడారు. విభజనకు సంబంధించి ఆర్టికల్ మూడు ప్రకారం రాష్ట్రపతి అసెంబ్లీకి పంపే విభజన బిల్లుపై ఓటింగ్ జరగదని, రాజ్యాంగంలో ఈ విషయం స్పష్టంగా ఉందని అన్నారు. రాష్ట్రపతి నుంచి విభజనకు సంబంధించి ముసాయిదా బిల్లు మాత్రమే అసెంబ్లీకి వస్తుందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చేసి ఎందుకు పంపడంలేదో సీఎంనే అడగాలని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
విభజన ప్రక్రియపై సీఎం... ప్రధాని, రాష్ట్రపతికి లేఖలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన చాలా సందర్భాల్లో వారిని క లుస్తుంటారని, అలాంటప్పుడు ఏమీ అడగకుండా, ఈ లేఖలు రాయడం ఏమిటన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చాంపియన్లుగా కచ్చితంగా కాంగ్రెస్, సోనియాగాంధీయే నిలుస్తారని డీఎస్ అన్నారు. ఎవరైనా తనకు బహుమతి ఇచ్చిన వారినే ఆదరిస్తారని, ఎవరు చెబితే ఆ బహుమతిని ఇచ్చారన్నది పట్టించుకోరని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయమని తెలంగాణ నేతలెవరూ కేసీఆర్‌ను అడగలేదన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని కేసీఆరే ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడున్న సమస్యల్లా.. అందరి ఆందోళనలు, అన్ని ప్రాంతాల వారి సమస్యలు, అనుమానాలు, అపోహలు నివృత్తి చేస్తూ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు.
చంద్రబాబు అడుగుతున్న సమన్యాయం అంటే ఎవరికీ ఏమీ చేయకుండా ఉండడమేనని ఆ పార్టీ నేతలే తనతో చెప్పారన్నారు. ‘ఈ విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి పిల్లోడు, సీఎం కావాలన్న పట్టుదలతో ఉన్నాడు.. ఆయన్ను గురించి పెద్దగా మాట్లాడను’ అని అన్నారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ వార్తలపై తాను మాట్లాడనని, సీమాంధ్రలో కాంగ్రెస్ బలోపేతంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో సంఘం నేతలు కొమ్మినేని శ్రీనివాసరావు, కందుల రమేష్, వంశీకృష్ణ, సిరాజుద్దీన్, నరసింహారావు పాల్గొన్నారు.