తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం: డీఎస్
హైకమాండ్ ఆదేశిస్తే తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధమేనని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్‌పై తెలంగాణ జేఏసీ నేతలకు గౌరవం ఉందని, జేఏసీ నేతలకు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్నా వారికి కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడానికి సిద్ధమేనని అన్నారు. ఒకవేళ యూపీఏకు మద్దతిస్తామంటే టీఆర్ఎస్తో పొత్తుకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అయితే ఆ పొత్తులను నిర్ణయించాల్సింది హైకమాండేనని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పడుతుందని, తెలంగాణ, సీమాంధ్రలో ప్రత్యేక పీసీసీలు రెండు మేనిఫెస్టోలు ఉంటాయని డీఎస్ చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కేసీఆర్‌కు దీటైన నేతలకు కొదవ లేదని, టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉన్నా లేకున్నా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 16 లోక్‌సభ, 80 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.