టీ.కాంగ్రెస్ నేతల్లో కలవరం!
టీ.కాంగ్రెస్ నేతల్లో కలవరం!
Published Thu, Oct 24 2013 2:46 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనివార్యమవుతున్నందున ఇక వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరుపై నడకే అని ప్రత్యేక రాష్ట్రంలో అధికారం తమదే అని నేతలు భావించారు. అయితే తాజాగా విలీనం అంశంపై టిఆర్‌ఎస్ దాటవేత వైఖరిని ప్రదర్శించడం టి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కలవర పరుస్తోంది. టిఆర్‌ఎస్ విలీనం కాకపోతే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు అంత సులువు కాదని వారే అంగీకరిస్తున్నారు.
టిఆర్‌ఎస్ విలీనం కాకపోతే ఆ పార్టీతో పొత్తు కూడా ఉండదనేది నేతల అంచనా. తెలంగాణలో ఉన్న మిగిలిన ప్రధాన పార్టీలు బిజెపి, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, వామపక్షాలు విడివిడిగా పోటీ చేస్తాయని... ఆ పార్టీల మధ్య కూడా పొత్తులు సాధ్యం కాకపోవచ్చనేది కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయం. అదే జరిగితే తెలంగాణలో దాదాపుగా పంచముఖ పోటీ నెలకొననుంది. టీడీపీ అధ్యక్షుడు రెండు కళ్ల ధోరణితో ఆపార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు త్వరలో 'చేయి'అందుకోనున్నట్లు సమాచారం.
టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు 15 మందితో పాటు ఆ పార్టీ కీలక నేతలు మరికొందరు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నారని,ఈ మేరకు వారు తమ హై కమాండ్ పెద్దలతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్వయంగా చెబుతున్నారు. ఇలా టిడిపి నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే తమ పరిస్ధితి ఏంటంటూ వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఇటీవల పిసిసి చీఫ్ బొత్సను ప్రశ్నించారట కూడా. దాంతో ముందస్తు ఒప్పందం మేరకు టిడిపి ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ నేతలంటున్నారు. దాంతో టిడిపిలో మిగిలిన నేతలు కొందరు టిఆర్‌ఎస్‌లో మరికొందరు బిజెపిలో చేరుతారనేది వారి అంచనా. ఇలాంటి పరిణామాలను పసిగట్టే తమ హై కమాండ్ పెద్దలు టిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే అంశంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.
ఇక విలీనంపై టీఆర్ఎస్ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్న మాటకు కట్టుబడతానని రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా ప్రకటించడం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆ తర్వాత రెండు నెలలకు పైగా టీఆర్‌ఎస్ దాదాపుగా స్తబ్ధుగా ఉండిపోయింది కూడా. అయితే కేంద్రం జీవోఎం వేసిన అనంతరం టీఆర్ఎస్ స్వరం పెంచింది. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం పార్టీ కచ్చితంగా మనుగడలో ఉండి తీరాల్సిందేనని పలువురు టీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్‌లో పూర్తిగా విలీనం కాకుండా, ఎన్నికల పొత్తు మాత్రమే పెట్టుకునే దిశగా టీఆర్‌ఎస్ నాయకత్వంలో ఆలోచనలు సాగుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement