ఎక్కడ దెబ్బతిన్నాం?
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల్లో నిర్వేదం
క్షేత్రస్థాయిలో విజయావకాశాలపై సమీక్షలు
గెలుపు అవకాశాలు తగ్గాయనే అంచనాలు
సొంత కేడరే సహకరించలేదంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు
కాంగ్రెస్‌కు 40 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి లేదని డీసీసీల నివేదికల్లో వెల్లడి?
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీ కేడరే తమకు సహకరించకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడకున్నా, క్షేత్రస్థాయిలో చేసిన సమీక్షల్లో గెలుపు అవకాశాలు కనిపించకపోవడంతో.. వారు నిర్వేదంలో మునిగి పోయారు. చాలా చోట్ల పార్టీ అభ్యర్థులు కూడా ప్రత్యర్థులతో చేతులు కలిపారని, సొంత పార్టీ కేడర్ కూడా ఓడించడానికి ప్రయత్నించిందనే అంచనాలతో ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సహకరించని నేతలు, ప్రత్యర్థులతో చేతులు కలిపినవారి వివరాలతో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఫిర్యాదులు చేస్తున్నారు.
సమీక్షలు మొదలు...
ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడకముందే.. కాంగ్రెస్ పార్టీలో సమీక్షలు మొదలయ్యాయి. పార్టీ అభ్యర్థులు గెలవగలిగే స్థానాలెన్ని? ఏయే నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు తగ్గిపోయాయి? ఈ పరిస్థితికి కారణమేమిటనేదానిపై క్షేత్రస్థాయిలో విశ్లేషణ జరుపుతున్నారు. లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులు ఇప్పటికే సమీక్ష జరిపి తాము గెలుస్తామా.. లేదా? అనే విషయంలో దాదాపు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లు కూడా ఏయే నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిచే అవకాశముంది? అభ్యర్థులకు సహకరించని నేతలెవరు?... తదితర అంశాలపై పరిశీలన జరిపి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ల క్ష్మయ్యకు నివేదికలు పంపాయి.
40 స్థానాలు దాటవా..?
ఆయా నివేదికల సారాంశాన్ని బట్టి 40 స్థానాలకు మించి కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలే కొన్నిచోట్ల టీఆర్‌ఎస్, మరికొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారని డీసీసీల నివేదికల్లో వెల్లడైనట్లు తె లిసింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమకు సహకరించని నాయకుల పేర్లతో కూడిన జాబితాను టీ పీసీసీకి అందజేసి, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు అభ్యర్థులైతే బాహాటంగానే అలాంటి వారి పేర్లను మీడియాకు వెల్లడిస్తున్నారు. తాము గెలిచే అవకాశాలు తగ్గిపోయాయనే అంచనాకు వచ్చిన అభ్యర్థుల్లో సగం మంది.. పార్టీలోని కోవర్టులు, వ్యతిరేకులే దానికి కారణమంటూ ఇప్పటికే టీ పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. మరికొందరు నేతలు మాత్రం ఎన్నికల ఫలితాల తరువాత టీ పీసీసీకి ఫిర్యాదు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ఏకంగా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిపైనే ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పార్టీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ తనకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని నిలబెట్టడం వల్ల ఓడిపోయే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చినప్పుడు వంశీచంద్‌రెడ్డి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు కూడా. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న జైపాల్‌రెడ్డి వంశీని పిలిచి బరిలో నుంచి నారాయణరెడ్డి తప్పుకునేలా చేస్తానంటూ బుజ్జగించేం దుకు ప్రయత్నించారు. చివరికి పోలింగ్ సరళిని విశ్లేషించి తనకు గెలుపుదక్కే అవకాశాలు తగ్గిపోయాయని అంచనాకు వచ్చిన వంశీచంద్‌రెడ్డి దీనిపై పొన్నాలకు ఫిర్యాదు చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట అభ్యర్థి కత్తి వెంకటస్వామి తనకు స్థానిక కేడర్ ఎవరూ సహకరించలేదనే అంచనాకు వచ్చారు. ఇక్కడ రెబెల్‌గా బరిలో దిగిన దొంతి మాధవరెడ్డిని గెలిపించేందుకు వారంతా ప్రయత్నించారని, స్థానిక ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ దీనికి ప్రధాన కారణమని వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. దీనిపై పొన్నాలకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు బలరాంనాయక్ కూడా తనను ఓడించేం దుకు వెంకటస్వామి యత్నించారని పేర్కొంటున్నారు.
భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పి.వెంకటేశ్వర్లు సైతం స్థానిక నేతలు గూడూరు నారాయణరెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి తనకు సహకరించలేదని, వారివల్లే తాను ఓడిపోయే పరిస్థితి నెలకొందని పొన్నాల ఎదుట వాపోయారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయులంతా తనకు వ్యతిరేకంగా పనిచేశారని పాలేరు అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. జిల్లాలోని పలు చోట్ల ఆమె వర్గీయులు పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు యత్నించారని ఆరోపించారు.
ఇక క్షేత్రస్థాయిలో పార్టీ నేతల నుంచి పూర్తిస్థాయి సహకారం అందలేదని అంబర్‌పేట, జూబ్లీహిల్స్ అభ్యర్థులు వి.హనుమంతరావు, పి.విష్ణువర్ధన్‌రెడ్డి సైతం ఆరోపించారు. జహీరాబాద్ అభ్యర్థి జె.గీతారెడ్డి సైతం తనను ఓడించేందుకు పార్టీ జిల్లా నేతలు ప్రత్యర్థులతో చేతులు కలిపారని వాపోయారు.
మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వర్గీయులు తనకు సహకరించలేదని ఇబ్రహీంపట్నం అభ్యర్థి మల్లేష్ పేర్కొన్నారు.
మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తన పరిధిలోని శాసనసభ అభ్యర్థులెవరూ తనకు సహకరించలేదని, క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగిందని పేర్కొన్నారు.
సర్దిచెప్పే నాయకత్వమేది?
పలువురు నేతలతో పాటు అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచార సమయంలోనే ఆయా అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకువచ్చారు. కొందరు నేతలు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకునేవారే లేకపోయారు. 2004, 2009 ఎన్నికల్లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో పాటు 2004లో సీఎల్పీ నేతగా, ఆ తర్వాత సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి.. అసమ్మతి నేతలందరినీ పిలిచి మాట్లాడి, పార్టీపరంగా ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేవారు. ప్రస్తుతం పార్టీలో ఆ పరిస్థితి లేదని, సమస్యలను టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దృష్టికి తీసుకొచ్చినా.. ఆయన చొరవ చూపలేదని కొందరు అభ్యర్థులు వాపోయారు. మరికొందరు అభ్యర్థులైతే పొన్నాల చెప్పినా ఎవరూ వినే పరిస్థితి లేదని గ్రహించి ఆయన దృష్టికి తమ ఇబ్బందులను తీసుకెళ్లలేదని చెబుతున్నారు.