ఇక లాంఛనమే..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మెతుకు సీమ బిడ్డ, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. శనివారం సమావేశమైన టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం తమ పార్టీ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం ఆ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. దీంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్ 2న ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ఆవిర్భావం వెంటనే కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేలా టీఆర్‌ఎస్ నేతలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గం కూర్పుపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోని అన్నీ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించేందుకు కేసీఆర్ తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లా నుంచి ముగ్గురు
మంత్రివర్గం రేసులో జిల్లా నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్‌లు ఉన్నారు. గరిష్టంగా 18 మందితోనే కేబినెట్ ఏర్పాటుకు అవకాశముండడం.. కాబోయే సీఎం కేసీఆర్ సైతం ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మంత్రివర్గంలో జిల్లా నుంచి ఒకరిద్దరికి మించి అవకాశం రాకపోవచ్చు. అయినా సామాజిక సమీకరణాలు కలిసివస్తే మంత్రివర్గంలో చోటు లభించవచ్చని జిల్లా నుంచి కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం..మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహను మట్టికరిపించడం ద్వారా మాజీ మంత్రి బాబూమోహన్ మంత్రివర్గ రేసులో ముందుంజలో ఉన్నారు. మహిళా కోటా కింద పద్మా దేవేందర్ రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది. పార్టీ వ్యవహారాల్లో కేసీఆర్‌కు అండదండగా ఉండే హరీష్ రావుకు మంత్రివర్గంలో తీసుకుంటే పాలన వ్యవహారాల్లో సహకారం లభించే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురిలో ఎంత మందికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందన్నది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది.