బాల్క సుమన్ జాక్‌పాట్!
విద్యార్థి నుంచి ఏకంగా ఎంపీ అయిన సుమన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోరాడిన విద్యార్థి నేత బాల్కసుమన్ జాక్‌పాట్ కొట్టారు. ఆయనను తొలుత కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ స్థానంలో బరి లోకి దించాలని యోచిం చారు. కానీ, అక్కడ టీఆర్‌ఎస్ తరఫున స్థానికురాలు శోభ టికెట్ ఆశించడంతో... సుమన్‌ను పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో పోటీకి దింపారు. అయితే అక్కడ ఆర్థికంగా బలవంతుడైన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వివేక్ రంగంలో ఉండడంతో... సుమన్‌కు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమైంది.
కానీ, వివేక్‌పై సుమన్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళదామనుకుని.. ఏకంగా ఎంపీగా జాక్‌పాట్ కొట్టారు. ఇక టీఆర్‌ఎస్ తరఫునే డాక్టర్ల జేఏసీ నేత బూర నర్సయ్యగౌడ్ భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ సీనియర్‌నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై గెలుపొందడం గమనార్హం. మొత్తంగా తెలంగాణ ఉద్యమ వీరుల్లో కొందరికి గెలుపు లభించగా... మరికొందరు ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు పోటీచేయగా నలుగురు గెలిచారు. ఇందులో ఇద్దరు ఎంపీలుగా విజయం సాధించడం విశేషం.
గెలుపోటములు వీరివే..
- ఓయూ జేఏసీ నేత గాదారి కిషోర్ నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టీజేఏసీ నేత అద్దంకి దయాకర్‌పై గెలుపొందారు.
- తెలంగాణ ధూం ధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ కరీంనగర్ జిల్లా మానకొండూరులో కాంగ్రెస్ నేత ఆరెపల్లి మోహన్‌పై విజయం సాధించారు.
- ఓయూ విద్యార్థి నేత బాల్క సుమన్ పెద్దపల్లి ఎంపీగా, టీ డాక్టర్ల జేఏసీ నేత నర్సయ్య గౌడ్ భువనగిరి ఎంపీగా గెలుపొందారు.
- మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీజీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ టీఆర్‌ఎస్ తరఫున విజయుం సాధించారు.
ఓడిన వారు : టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఓటమి చెందారు.
- సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రజా సంఘాల నేత గజ్జెల కాంతం టీడీపీ నేత సాయన్న చేతిలో ఓడిపోయారు.
- టీ జేఏసీ నేత కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ తరఫున వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓడిపోయారు. తొలుత కాంగ్రెస్ టికెట్ వచ్చి, చేజారడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దొంతి మాధవరెడ్డి చేతిలో ఆయన ఓడిపోవడం గమనార్హం.
- ఇక టీడీపీ నుంచి పోటీచేసిన ఓయూ జేఏసీ నేత మేడిపల్లి సత్యం, రాజారాంయాదవ్ విజయం సాధించలేకపోయారు.