ఏపీలో ఎందుకు పర్యటించరు?
హైదరాబాద్:రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో భరోసా యాత్ర చేపడుతున్నారని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. రాహుల్ తెలంగాణ భరోసా యాత్రపై బాల్క సుమన్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. రాహుల్ యాత్ర తెలంగాణకు మాత్రమే పరిమితం కావడానికి కారణమేమిటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏపీలో రాహుల్ ఎందుకు పర్యటించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అవసరం లేకున్నా వేలాది ఎకరాలు రైతుల నుంచి చంద్రబాబు రైతులను రాహుల్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.
రాహుల్ శైలిని చూస్తుంటే టీడీపీ-కాంగ్రెస్ లు కుమ్మక్కైనట్లు కనబడుతోందని ఎద్దేవా చేశారు. అసలు ఆందోళన చేసిన రైతులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ దేనని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం అమేథీలో వడగళ్ల వర్షం వల్ల రైతులు నష్టపోతే రాహుల్ పర్యటించలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు.