వంద కోట్లపై... వంద కేసులదే విజయం
వంద కోట్లపై... వంద కేసులదే విజయం
Published Fri, May 16 2014 11:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ సృష్టిస్తున్న ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు ఘోర పరాజయాన్ని చవిచూశారు. పార్లమెంట్ లోని సంపన్న ఎంపీల్లో ఒకరైన జి. వివేక్ గులాబీ దళం ధాటికి చిత్తయ్యారు. పెద్దపల్లి పార్లమెంట్ లో అనామకుడిగా బరిలొ దూకిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత బాల్క సుమన్ .. ఎంపీ జి. వివేక్ ను మట్టికరిపించారు. తెలంగాణ ఉద్యమ వనంలో మొలచిన గులాబీ మొక్క బాల్క సుమన్ రూపంలో తొలిసారి పార్లమెంట్ అడుగుపెట్టనుంది.
పెద్దపల్లి పార్లమెంటరీ స్థానంలో బాల్క సుమన్ ప్రచారంలోనే ఆకట్టుకున్నారు. వంద కోట్ల ఆస్తులతో వివేక్.. వందలాది కేసులతో తాను పెద్దపల్లి బరిలోకి దూకామనే వ్యాఖ్యలతో బాల్క సుమన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రచారంలో భాగంగా పూరి గుడిసెల్లో, తండాల్లో తిండి, నిద్రతో ఓటర్లకు చేరువయ్యారు. బాల్క సుమన్ ప్రచారంలో వందలాది ఓయూ విద్యార్ధులు, స్థానిక యువత పాలుపంచుకున్నారు.
బాల్క సుమన్ ప్రచారాన్ని చూసి పెద్దపల్లి నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన జి.వివేక్ కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ప్రచారంలో ఆకట్టుకోవడానికి వివేక్ చేసిన ప్రయత్నాలు.. సుమన్ ప్రచారం ముందు వెలవెలపోయాయి. సామాన్య ప్రజల్లో తాను ఒక్కడిననే అంశాన్ని ఓటర్లలో సుమన్ కలిగించిన తీరే ఆయనకు విజయం సాధించిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎదురించి టీఆర్ఎస్ పార్టీలో వివేక్ చేరారు. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న వివేక్ .. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర ఏర్పాటులో తన పాత్రతో ఓటర్లపై ప్రభావం చూపలేకపోవడం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎదురుగాలి వీయడం లాంటి అంశాలు వివేక్ ప్రతికూలంగా మారాయనే వాదన వినిపిస్తోంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో వందలాది కేసులు, జైలు జీవితాన్ని అనుభవించిన బాల్క సుమన్ ను ఓటర్లు అక్కున చేర్చుకున్నారనే వాదన పెద్దపల్లిలో బలంగా వినిపిస్తోంది. ప్రజల, ఆదరాభిమానాల ముందు వంద కోట్లు, మీడియా ప్రచారం కూడా దిగదుడుపేనని బాల్క సుమన్ విజయం నిరూపించిదని చెప్పవచ్చు.
Advertisement
Advertisement