'కాంగ్రెస్‌కున్న శక్తి, ధైర్యం వేరేవాళ్లకి లేదు'
హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శనివారం జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం జానారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే తప్ప విలీనం, పొత్తులు తమకు అవసరం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కున్న శక్తి, ధైర్యం వేరేవాళ్లకి లేదని, పొత్తులు, విలీనం అవసరమని తాము భావించటం లేదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని జానారెడ్డి తెలిపారు. ప్రజల మనోభావాలను గుర్తించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు కృతజ్ఞత చూపించాలని ఆయన అన్నారు.
ఒకటి, రెండు ఎంపీలున్న టీఆర్ఎస్, టీడీపీల వల్ల తెలంగాణ రాలేదని జానారెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత, వివిధ ప్రజా సంఘాలు తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడాయన్నారు. వారికి అండగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కేంద్రంపై ఉద్యమించారన్నారు. అందువల్లే తెలంగాణ ఏర్పడిందని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ పునర్ నిర్మాణం, సామాజిక తెలంగాణ కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ను గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల మధ్య జానారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.