విభజించే హక్కు మీకెక్కడిది? | YS Jaganmohan Reddy demands make Assembly resolution on state bifurcation issue | Sakshi
Sakshi News home page

విభజించే హక్కు మీకెక్కడిది?

Published Wed, Jan 8 2014 1:51 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

విభజించే హక్కు మీకెక్కడిది? - Sakshi

విభజించే హక్కు మీకెక్కడిది?

రాష్ట్రంలో ప్రతి పిల్లాడూ ఇదే ప్రశ్న వేస్తున్నాడు: జగన్
విభజించాలో వద్దో ముందు అసెంబ్లీలో తీర్మానం చేయండి.. తర్వాత ప్రజల్ని అడగండి
ప్రజలంతా విడిపోతాం అని చెబితే అప్పుడు విభజన బిల్లుపై చర్చ చేపట్టండి
దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది

 
 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా? విడగొట్టాలా? అనేది ముందు అసెంబ్లీలో తీర్మానం చేయండి.. ఆ తరువాత ప్రజల వద్దకు వెళ్లి వారిని అడగండి. ప్రజలంతా విడిపోతాం అని చెప్పిన తరువాతనే విభజన బిల్లుపై చర్చ చేపట్టండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముందు రాష్ట్రాన్ని విడగొట్టి, ఆ తరువాత అసెంబ్లీకి బిల్లు పంపిస్తామని చెప్పడం సాంప్రదాయమే కాదని మండిపడ్డారు. అందరం కలిసి ఒక్కతాటి మీద ఉండాల్సిన సమయంలో.. సోనియా గాంధీ గీసిన గీత కిరణ్‌కుమార్‌రెడ్డి దాటరని, చంద్రబాబేమో.. ప్యాకేజీల కోసం సోనియా గాంధీతో కుమ్మక్కయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నిజంగా రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు ఇవాళ నడి రోడ్డు మీదకు వచ్చారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రతి పిల్లాడు ప్రశ్నిస్తున్నాడు, ప్రతి రైతన్నా అడుగుతున్నాడు. అయినా వీళ్లకు పట్టదు’’ అని విమర్శించారు. దేశంలోనే మూడో అతిపెద్ద బడ్జెట్‌ను కలిగిన రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేయొద్దని కోరారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, మూడో రోజు మంగళవారం పీలేరు నియోజకవర్గంలో కొనసాగింది. వాయల్పాడు(వాల్మీకిపురం), కలికిరిలో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 విభజన నిర్ణయం తీసేసుకుని బిల్లు పంపారు..
 
 ‘‘దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా కనీవినీ ఎరుగని విధంగా ఇవాళ మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. దేశంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా ఒక రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చినప్పుడు మొదట ఏం చేస్తారంటే.. రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి మొత్తంగా శాసనసభ అంతా కలిసి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్రం దానిమీద యాక్షన్ తీసుకొని ప్రతిని రాష్ట్రపతికి పంపుతుంది. ఆయన ఆ డ్రాఫ్టును మనకు పంపిస్తే దాని మీద తరువాత చర్చ అనేది జరిగితే అప్పుడు ‘ఇలా కాదు, అలా చేయండి’ అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అది అసలు సంప్రదాయం. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయంలో.. ఏకంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసేసుకుని ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గర నుంచి మనకు పంపించి ఇక మీరు చర్చించుకోండి అని చెప్తున్నారు. చర్చించడం అంటే దాని అర్థం విభజనకు మనం ఒప్పుకున్నట్టే కదా..! అంటే మాకు డబ్బులు కాస్త ఎక్కువో.. తక్కువో ఇవ్వండి, నీళ్లు కాస్త మాకు అటూ ఇటుగా ఇవ్వండి, మాకు మంచి చెయ్యండి అని చెప్పి మనం బతిమలాడుకోవాలట. దాని పేరు చర్చట.
 
 కుమ్మక్కై కేసులు వేసి.. కుమ్మక్కయ్యానంటున్నారు..
 
 అసెంబ్లీ జరుగుతోంది.. కానీ సమావేశాల్లో చంద్రబాబు కనపడరు, కిరణ్‌కుమార్‌రెడ్డి కనిపించరు. చంద్రబాబు గారైతే మరీ అన్యాయం. అసెంబ్లీలోనే.. తన ఏసీ గదిలో కూర్చొని.. సమైక్యానికి అనుకూలంగా వెళ్లి సీమాంధ్ర ఎమ్మెల్యేలను గొడవ చేయమంటారు. తెలంగాణ ఎమ్మెల్యేలను పిలిపించుకొని విభజించాలని గొడవ చేయమంటారు.. కానీ అసెంబ్లీలోకి రారు. ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డి, ఇంకొకరూ.. ఇంకొకరూ కుమ్మక్కయ్యారని వేలెత్తి చూపిస్తారు.

వాళ్లంతా కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేసుకుంటారు. కానీ నింద మాత్రం జగన్‌మోహన్‌రెడ్డి మీద వెయ్యాలని ఆరాటపడుతున్నారు. ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి.. సోనియాగాంధీ దగ్గర నుంచి మొదలు అటు కాంగ్రెస్ పార్టీతో, ఇటు చంద్రబాబు నాయుడితో పోరాటం చేస్తున్నాడు.. మరోవైపు ‘ఈనాడు’తో, ఆంధ్రజ్యోతి, టీవీ-9లతో కూడా పోరాటం చేస్తున్నాడు. కానీ చంద్రబాబేమో కుమ్మక్కు.. కుమ్మక్కు అని అంటారు. వైఎస్సార్ చనిపోయి 18 నెలలు గడిచిన తరువాత, ఆయన కుమారుడు జగన్.. కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టిన 2 నెలల తరువాత కాంగ్రెస్‌తో కుమ్మక్కై కోర్టుల దాకా వెళ్లి కేసులు వేసింది మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదా? అని చంద్రబాబును అడుగుతున్నా.
 
 ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మ గౌరవానికి మధ్య ఎన్నికలు..
 
 ఇవాళ చంద్రబాబుకు చెప్తున్నా.. మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్తున్నా, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సోనియాగాంధీకి చెప్తున్నా. వీళ్లంతా ఎన్ని కుమ్మక్కులు పన్నినా, ఎన్ని కుయుక్తులు వేసినా మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరగబోయే ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మనందరం కలుద్దా.. ఒక్కటవుదాం.. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. 30 ఎంపీ స్థానాలు తెచ్చుకున్న తరువాత ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం అని చెప్తున్నాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీ కోటను మనమే పునర్నిర్మిద్దాం.’’
 
 సీఎం ఇలాకాలో జగన్‌కు బ్రహ్మరథం
 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గమైన పీలేరులో జనం జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గం పరిధిలోని వాల్మీకిపురం, కలికిరి మండలాల్లో మంగళవారం నిర్వహించిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రకు అనూహ్య స్పందన లభించింది. వాల్మీకిపురంతో పాటు సీఎం కిరణ్ సొంత మండలమైన కలికిరిలో రహదారులకు ఇరువైపులా జనం బారులుతీరి జననేతకు స్వాగతం పలికారు. ఉదయం వాల్మీకిపురం గంగాదొడ్డిలో ఒలిపి రామచంద్ర కుటుంబాన్ని, తోటవీధిలో ఎస్ రెడ్డిగౌస్ కుటుంబాన్ని జగన్ ఓదార్చారు.

వాల్మీకిపురం బస్టాండ్ సర్కిల్‌లో మధ్యాహ్నం జరిగిన సభలో సమైక్య గళాన్ని బలంగా వినిపించారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్, జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విభజన దోషులని విమర్శించినప్పుడు జనం నుంచి మంచి స్పందన లభించింది. తర్వాత చింతపర్తి, గండబోయినపల్లెలలో జగన్ వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. తర్వాత కలికిరి నాలుగురోడ్ల జంక్షన్‌లో జరిగిన భారీ సభలో ప్రసంగించారు. అనంతరం అక్కడకు దగ్గరలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి పది గంటల సమయానికి సోమల మండల ంలోని కందూరుకు చేరుకున్నారు. చలి బాగా ఉన్నా, రాత్రి పది గంటల వరకూ దారిపొడవునా జనం వేచి ఉన్నారు. జగన్ కందూరులోని రవీంద్రనాథరెడ్డి ఇంట రాత్రి బసచేశారు.
 జగన్‌మోహన్‌రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి తదితరులున్నారు.

 వంగపండు ఉష బస్సు అద్దం ధ్వంసం

 కలికిరి, న్యూస్‌లైన్: ఈ యాత్ర నిమిత్తం కలికిరి వచ్చిన వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష బస్సు అద్దాన్ని ఓ యువకుడు పగులగొట్టాడు. రాత్రి కలికిరి క్రాస్ రోడ్డులో సమైక్య శంఖారావం సభ జరగడానికి ముందు ఉష పాటలు పాడుతుండగా, శరత్‌కుమార్‌రెడ్డి అనే యువకుడు బస్సుపై దాడి చేశాడు. ఇతను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి అన్న కుమారుడు. ఎస్‌ఐ అతడిని అరెస్టు చేయకపోగా సముదాయించి పక్కకు తీసుకెళ్లడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement