బంద్ విఫలానికి విషయత్నం
బంద్ విఫలానికి విషయత్నం
Published Sat, Sep 10 2016 6:21 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
హైదరాబాద్: ఏపీలో గతంలో జరిగిన అనేక బంద్‌లు.. ఆందోళనలు.. పతాక స్థాయికి చేరితే తప్ప పట్టించుకోని పోలీసులు 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా బంద్‌పై మాత్రం ఎన్నడూ లేని విధంగా ఉక్కుపాదం మోపారు. ఆందోళనకారులపై ఖాకీ క్రౌర్యం చూపించారు. ఇంట్లోంచి బయటకు కదిలితే కేసులు పెడతామని రౌడీలు, గుండాల్లా బెదిరింపులకు దిగారు. ప్రత్యేక హోదా బంద్ విజయవంతం కాకూడదని, బంద్ విఫలం చేసేందుకు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలని శుక్రవారమే డీజీపీ సాంబశివరావు నుంచి ఆయా జిల్లాల ఎస్పీలు, ఐజీలకు ఆదేశాలందాయి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు పోలీస్‌బాస్ ప్రత్యేక హోదా బంద్‌ను తీవ్రంగా పరిగణించాలని ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఆదేశాలు అందుకున్న ఐజీలు, ఎస్పీలు కలిసి మీడియా సమావేశాలు నిర్వహించి మరీ బంద్‌లో పాల్గొనవద్దని, బంద్‌లో పాల్గొంటే షీట్లు తెరుస్తామని మరీ హెచ్చరికలు చేశారు.
బంద్‌కు సన్నాహాలు చేస్తున్న వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. బంద్ విజయవంతమైతే వైఎస్సార్ సీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందోనని, ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో కేంద్రానికి అర్ధం అవుతుందని ఉద్దేశ పూర్వకంగా సర్కారు సూచనల మేరకు బంద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పి తెల్లవారుజామున ఇళ్ల వద్దనే అరెస్ట్ చేశారు. వైఎస్సార్ సీపీ నేతల్ని గృహ నిర్బంధం చేశారు. ఎన్ని ఆంక్షలు విధించినా అరెస్ట్‌లకు భయపడకుండా వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీల నేతలు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేశారు. నెల్లూరు జిల్లాలో 1,500 మందిని అరెస్ట్ చేశారంటే బంద్ విఫలయత్నానికి ఖాకీలు ఎంతగా దృష్టి సారించారో అవగతమవుతుంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, అసోసియేషన్ల నేతలు మాత్రం బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ప్రత్యేక హోదా కోరుతూ విపక్షాలు నిర్వహించిన బంద్‌ను విఫలం చేసేందుకు సర్కారు ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు విజయవంతమైంది. ప్రత్యేక హోదా ఆవశ్యకతను గుర్తెరిగిన ప్రజలు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నారు. అయితే పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్టు 30 పేరిట నిషేధాజ్ఞలు విధించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరీ పోలీసుల సాయంతో బస్సుల్ని తిప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా బంద్ ప్రశాంతంగా జరిగింది.
Advertisement
Advertisement