ఆ ప్రత్యే‘కథే’ వేరు.. | East godavari will be changed with getting ap special status | Sakshi
Sakshi News home page

ఆ ప్రత్యే‘కథే’ వేరు..

Published Tue, May 10 2016 12:25 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఆ ప్రత్యే‘కథే’ వేరు.. - Sakshi

ఆ ప్రత్యే‘కథే’ వేరు..

హోదాతోనే ‘తూర్పు’లో గణనీయ మార్పు  
ఆ దిశగా అడుగులు వేయడంలో సర్కారు విఫలం


రాష్ట్రంలో భూమి సారవంతమైంది! సహజ వనరులు పుష్కలం! శ్రమ, మేధోవనరులకూ లోటు లేదు! అరుుతేనేం.. గొడ్డలిపెట్టు తిన్న పచ్చనిచెట్టు వాడిపోరుునట్టు.. రాష్ర్ట విభజనతో ఈ గడ్డ సౌభాగ్యం కుంటుబడింది. ఆ దెబ్బ నుంచి కోలుకునేందుకు పరమౌషధం లాంటిది ప్రత్యేకహోదా అన్న టీడీపీ, బీజేపీలే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో  అధికారంలోకి వచ్చారుు. అరుుతే ఇప్పుడా సర్కార్లు జనాన్ని మోసగిస్తూ ఆ హామీకి నీళ్లు వదిలారుు. ఈ తరుణంలో జనం తరఫున కదనభేరి మోగించింది వైఎస్సార్ సీపీ. నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి. కాకినాడలో జరిగే ధర్నాలో స్వయంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పురోగతికి ప్రత్యేకహోదా ఆవశ్యకతను, హోదాపై  జిల్లావాసుల ఆశలు, ఆకాంక్షలపై ప్రత్యేక కథనాలు..
 
 చందమామ కథల్లో చదివాం.. రెక్కలగుర్రాలుంటాయని.. నమ్మడానికి ఎంత బాగుందో..  బాలమిత్ర కథల్లో చదివాం.. పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో..  ఇవన్నీ నిజమో.. కాదో తెలియదు కానీ.. ‘ప్రత్యే‘కథ’తోనే తూర్పులో పారిశ్రామిక, అభివృద్ధి మార్పులు సాధ్యమంటున్నారు జిల్లావాసులు. అపార సహజవనరులు, సాగరతీరం, గోదా‘వరి’.. సహజవాయువు, చమురు నిక్షేపాలు, ల్యాటరైట్ గనులు, సున్నపు రాళ్లు, రోడ్డు, రైల్వే, నౌకారవాణా వ్యవస్థలు, లక్షలాది ఎకరాల సారవంతమైన భూమి ఉన్న ఈ జిల్లాకు పరిశ్రమలు వెల్లువలా తరలివచ్చి.. స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందని, జిల్లా ఆర్థిక స్వరూపమే మారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 - అమలాపురం
 
 రాష్ట్ర విభజన తర్వాతే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనే తూర్పు గోదావరిజిల్లా ప్రత్యేకతను సంతరించుకుంది. అధిక జనాభా, రాష్ట్రంలోనే అత్యధిక నియోజకవర్గాలు, వ్యవసాయ పరంగా వరి, కొబ్బరి, ఆక్వా సాగుల్లో ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాజకీయంగా ఎంతో కీలకమైన ఈ జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా మారింది. చివరకు విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో సైతం ఇదే సెంటిమెంట్ నిజమైంది. ఇక్కడ 14 స్థానాలు (స్వతంత్ర, మిత్రపక్ష బీజేపీ)తో కలిసి సాధించడం వల్లే టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
 
 విభజన తరువాత నాలుగు విలీన మండలాలు కలవడంతో జిల్లా విస్తీర్ణం మరింత పెరిగింది. మూడు రాష్ట్రాలు (తెలంగాణ , ఛత్తీస్‌ఘడ్, ఒడిశా)ల సరిహద్దు కలిగిన కీలక జిల్లాగా మారింది. అయినా ఆశించిన స్థాయిలో జిల్లా అభివృద్ధి సాధించలేదనే చెప్పాలి. ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో జిల్లా అన్నివిధాలా వెనకబడి పోయింది. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై చంద్రబాబు సర్కారు మాటలకే పరిమితమైంది తప్ప, చేతల్లో చూపించకపోవడంతో జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. పరిశ్రమల ప్రోత్సహానికి ప్రభుత్వాలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
 
 నిరుద్యోగానికి చెక్

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే జిల్లాను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు తెరపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎంప్లాయిమెంట్ విభాగంలో నమోదైన వివరాల మేరకు జిల్లా వ్యాప్తంగా 79,776 మందికి పైగా నిరుద్యోగులు ఉండగా, నమోదుకాని వారు మరెందరో ఉన్నారు. సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, డిప్లమో, ఐటీఐ, మెకానికల్ విభాగాల వారికి ఉద్యోగాలు వచ్చేది పరిశ్రమల్లోనే. డిగ్రీ, పీజీలకు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు పెద్దగా లేనందున వారు ప్రైవేటు పరిశ్రమలపైనే ఆధారపడుతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన వారిలో 30 శాతం మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది.                        
- మండపేట
 
 జిల్లాలో 28 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా ఏటా 9,500 మంది క్వాలిఫైడ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. అలాగే 80 వరకు ఎలక్ట్రికల్, ఫిట్టర్, ల్యాబ్ టెక్నీషియన్స్, మెకానికల్ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చే ఒకేషనల్ కళాశాలలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 10,500 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. అయితే జిల్లాలో పారిశ్రామికవృద్ధి లేకపోవడంతో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్లోను కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో ఉపాధి కల్పిస్తుండడంతో ఉద్యోగ భరోసా కరువవుతోంది. మరోపక్క ఆంధ్రా, నన్నయ్య, నాగార్జున, ఓపెన్ యూనివర్శిటీల్లో డిగ్రీ, పీజీలు చేస్తున్న వేలాది మంది విద్యార్థులు సరైన ఉద్యోగ అవకాశాలు లేక ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో అరకొర జీతాలకు పనిచేస్తున్నారు.
 
 ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, జీఎస్‌పీసీ వంటి సంస్థలు రూ.వందల కోట్లలో జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్నా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. ఆ స్థాయి శిక్షణ ఇచ్చేటటువంటి పెట్రోవర్సిటీ, లాజిస్టిక్ వర్సిటీలు ఈ ప్రాంతంలో లేకపోవడం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇప్పటికే పెట్రోవర్సిటీ విశాఖపట్నం తరలిపోగా, ద్వారపూడిలో ఏర్పాటు చేయతలపెట్టిన లాజిస్టిక్ వర్సిటీ ప్రతిపాదనల దశలోనే ఉంది. స్థానికంగా పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగులు ప్రత్యక్షంగా ఉద్యోగాలు పొందితే అంతకు నాలుగు రెట్లు మంది పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.   
 
 శరవేగంగా.. హిమా‘చల్’..
 ఒకప్పుడు అభివృద్ధిలో అట్టడుగున ఉన్న హిమాచల్‌ప్రదేశ్ ప్రత్యేకహోదాతో శరవేగంగా అభివృద్ధి సాధించింది. 2003లో అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వడంతో 90 శాతం గ్రాంటుతో కేంద్ర నిధులు వెల్లువెత్తాయి. పారిశ్రామిక ప్యాకేజీలు, రాయితీలు రావడంతో పరిశ్రమలు పోటెత్తాయి. సుమారు 40 వేలకు పైగా పరిశ్రమలతో పారిశ్రామికంగా ముందుకు దూసుకుపోతోంది ఈ రాష్ట్రం. ప్రత్యక్షంగా సుమారు ఆరు లక్షల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు దక్కాయి. పరోక్షంగా మరెన్నో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో వాటి అవసరాలకు తగిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నో విద్యాసంస్థలను నెలకొల్పింది. స్థానిక విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ప్రత్యేకహోదాతో పారిశ్రామికంగా, ఉద్యోగ, ఉపాది అవకాశాల్లో రాష్ట్రం సాధించే ప్రగతికి హిమాచల్‌ప్రదేశ్ ఒక ఉదాహరణ.
 
 కాకినాడ సెజ్‌లో పరిశ్రమలేవీ?
 కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలం (కేఎస్‌ఈజెడ్)ను ప్రభుత్వం 2008లో ఏర్పాటు చేసింది. కొత్తపల్లి మండలం నుంచి తొండంగి మండలం వరకు తీరాన్ని ఆనుకుని సుమారు 20 కి.మీల మేర కేఎస్‌ఈజెడ్‌ను ఏర్పాటు చేశారు. రైతుల వద్ద నుంచి ఏడు వేల ఎకరాల భూములు సేకరించారు. దీంతో జిల్లాలో పారిశ్రామికంగా పెనుమార్పులు చోటు చేసుకుంటాయని జిల్లా వాసులు భావించారు.
 -    ఇక్కడ రూ.రెండు వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపన జరుగుతుందని అంచనా వేశారు. స్థానికంగా సుమారు ఐదు వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని, పదిహేను వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని ఆశించారు.
 -    ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. చైనాకు చెందిన ఒక సాధారణ సంస్థ బొమ్మల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు.
 
 ఖాళీగానే పారిశ్రామిక వాడలు
జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు పెద్దాపురం, సామర్లకోట, రాజానగరం వంటి ప్రాంతాల్లో పారిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పారిశ్రామిక వాడలు (ఇండస్ట్రీయల్ పార్కులు) ఏర్పాటు చేసింది. చాలాచోట్ల ఇవి ఏర్పాటు చేసి దశాబ్దాలు గడిచిపోతున్నా ఆశించిన స్థాయిలో పరిశ్రమలు ఏర్పడలేదు.
 -    కాకినాడ సర్పవరం వద్ద ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడలో ఇప్పటికీ పలు పరిశ్రమల ఏర్పాటుకు స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి 20 ఏళ్లు దాటింది.
 -    సామర్లకోటలో పారిశ్రామికవాడలో రాక్ సిరామిక్స్, రిలయన్స్ పవర్‌ప్లాంట్, జీవీకే పవర్‌ప్లాంట్‌లున్నాయి. రిలయన్స్, జీవీకేలు గ్యాస్ కొరత వల్ల ఆరంభం కాలేదు. మిగిలినవి చిన్న పరిశ్రమలే.
 -    సామర్లకోట ఏపీఐఐసీ 2004 పాలిస్టర్ కంపెనీ పెట్టేందుకు 1,200 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.20వేలు చొప్పున చెల్లించారు. దీనిని రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసి పరిశ్రమ ఏర్పాటు చేయపోవడం గమనార్హం.
 -    పెద్దాపురంలోనూ ఇదే పరిస్థితి. వాలు తిమ్మాపురంలో గిరిజా పవర్‌ప్లాంట్, రెండు రైస్ ఫ్యాక్టరీలున్నాయి. ఇవి అంత పెద్ద పరిశ్రమలు లేవు.
 -    కాకినాడ -రాజమండ్రి కెనాల్ రోడ్డు కడియంలో జీవీకే పవర్‌ప్లాంట్, వేమగిరి (జీఎంఆర్)పవర్ ప్రాజెక్టులు పనిచేస్తుండగా, యువరాజ్ పవర్‌ప్రాజెక్టు, ఆర్‌వీకే పవర్‌ప్లాంట్ నిలిచిపోయాయి. కొత్తగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాలేదు.
 -    రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరం ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో హార్లీక్స్ ఫ్యాక్టరీ తప్ప చెప్పుకునే స్థాయిలో పరిశ్రమలు రాలేదు.
 
వ్యవ‘సాయం’ నిల్..
 వ్యవసాయ రంగ అభివృద్ధికి.. ఆ రంగానికి సాంకేతిక దన్ను అందించేందుకు వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొడుతోంది. రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రకటించే సమయంలో నిండు సభలో అన్ని జిల్లాల్లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిశ్రమలపై చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి, ఉద్యాన పంటలకు మేలు చేసేలా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. విదేశాలకు ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులకు సైతం పరిశ్రమలు పెడతామన్నారు. గడిచిన రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
 
-    రాజమండ్రి సమీపంలో రూ.300 కోట్లతో కొబ్బరి పార్కు ఏర్పాటుకు కార్పొరేట్ కంపెనీ ముందుకు వచ్చింది. ప్రభుత్వంతో ఎంఓయూ కూడా చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఆ కంపెనీ పరిశ్రమ ఏర్పాటు దిశగా ముందడుగు వేయలేదు.
 -    కొబ్బరి సంఘాల ద్వారా కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు (సీడీబీ) రాయితీలతో రుణాలిచ్చి పరిశ్రమల ఏర్పాటుకు ముందకు వచ్చింది. ప్రత్యేక హోదా ఉంటే మరిన్ని రాయితీలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పడేవి. నిరుద్యోగ యువతకు ఉపాధి కలగడంతోపాటు జిల్లాలో దాదాపు 50 వేల మంది కొబ్బరి రైతులకు, వేలాది మంది కార్మికులకు ఉపాధికి ఢోకా ఉండేది కాదు. హోదా లేక, రాయితీలందక రైతు కంపెనీలు వెనకంజ వేస్తున్నాయి.
 -    కొబ్బరి సంఘాల ద్వారా కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు (సీడీబీ) రాయితీలతో రుణాలిచ్చి పరిశ్రమల ఏర్పాటుకు ముందకు వచ్చింది. ప్రత్యేక హోదా ఉంటే మరిన్ని రాయితీలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పడేవి. నిరుద్యోగ యువతకు ఉపాధి కలగడంతోపాటు జిల్లాలో దాదాపు 50 వేల మంది కొబ్బరి రైతులకు, వేలాది మంది కార్మికులకు ఉపాధికి ఢోకా ఉండేది కాదు.
 -    జిల్లాలో క్వాయర్ మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. కొబ్బరి ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలేవీ లేవు. కొబ్బరి నీటిని మార్కెట్ చేసేందుకు పెప్సీకో ముందుకు వచ్చిందని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత  ఆ ఊసే లే దు.        ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి ప్రైవేట్ కంపెనీలు తాళ్లరేవు, అమలాపురం, కాకినాడ శివారు, తొండంగి మండలాల్లో చిన్నచిన్న కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేశాయి. పెద్ద ఎత్తున ఇటువంటివి ఏర్పాటు చేయాలంటే రాయితీలు అవసరం. హోదా వస్తే ఇవి సాధ్యమవుతాయి.
 
 ఆ ‘బడా’యి లేదు?
 మూడు దశాబ్దాల క్రితం కాకినాడ తీరాన కోరమండల్, నాగార్జున ఫెర్టిలైజర్స్ ఏర్పాటు చేశారు. తరువాత ఈ ప్రాంతంలో పెద్ద పరిశ్రమలేవీ లేవు. వాకలపూడిని ఆనుకుని పరిశ్రమలున్నా అవి అంతపెద్దవికావు కాకినాడ రూరల్‌లో 18 ఫ్యాక్టరీలుండగా, వీటిలో 10 ఆయిల్ ఫ్యాక్టరీలున్నాయి. ఓఎన్జీసీ స్టెంబర్గ్, సిల్క్‌రోడ్డు షుగర్స్, స్పెక్ట్రమ్ విద్యుత్ ప్లాంట్ ఒక్కటే చెప్పుకునేది. కేజీ బేసిన్‌లో చమురు నిక్షేపాలున్నందున ఇక్కడ పెట్రోలియం అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశముంది.
 
 కాకినాడ సర్పవరం ఆటో నగర్‌లో చిన్నపరిశ్రమలు 154 వచ్చాయి. దీనిలో ఐటీపార్కు ఏర్పాటు చేయగా, ఇన్‌ఫోటెక్ సంస్థ మాత్రమే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పెద్ద సంస్థలు వచ్చిన దాఖలాలు లేవు. రాజమహేంద్రిలో పేపరుమిల్లు తప్ప పెద్ద పరిశ్రమలేవీ లేవు.
 
 ఉపాధికి మరింత స‘పోర్టు’
 కాకినాడ సిటీ : జిల్లా కేంద్రం కాకినాడ తీరంలో యాంకరేజ్, డీప్‌వాటర్ పోర్టులు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా వస్తే జిల్లాలో ఎక్కువగా పారిశ్రామిక సంస్థలు వచ్చే అవకాశం ఉంది. పోర్టులో కార్గో హ్యాండ్లింగ్ 2014-15 సంవత్సరంలో సుమారు 18 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా 2015-16లో 15 వేల మిలియన్ టన్నులు చేశారు. అయితే పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తే కార్గో హ్యండ్లింగ్ మూడు రెట్లు పెరగడంతో పాటు కార్మికులకు ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయి.
 
 తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని మరింత ఆర్జించే అవకాశాలు ఏర్పడడమే కాకుండా తూర్పుతీరంలో ఎగుమతులు దిగుమతుల రవాణాలోనూ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇక్కడి తీరంలో పెట్రో కారిడార్, హోర్డ్‌వేర్ హబ్, హార్టీకల్చర్‌ప్రొడక్ట్స్, కోకోనట్ పీచు పరిశ్రమలు వంటి వాటితో కోస్టల్ కారిడార్ చేస్తామని పాలకులు చెబుతున్నా, ఒక్కఅడుగు ముందుకు పడడంలేదు. రాష్ట్రానికి హోదా వస్తే విదేశీ పారిశ్రామిక సంస్థలు రావడంతో బాటుగా స్వదేశీ పారిశ్రామిక ఉత్వత్తుల ద్వారా విదేశీ మరక ద్రవ్యాన్ని పెంచుకునే అవకాశం పుష్కలంగా ఉంది.  
 
 పారిశ్రామిక ప్రగతి పెరుగుతుంది
 ప్రత్యేక హోదా వస్తే జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పెరుగుతుంది. 30 శాతం భారాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే 10 శాతం పెట్టుబడికి 90శాతం గ్రాంట్లు వచ్చే వెసులుబాటు కలుగుతాయి. పెట్రోలియం, గ్యాస్, ఎడిబుల్ ఆయిల్, కొబ్బరి వంటివి ఆదాయ వనరుగా ఉన్నా ప్రాజెక్టులు ఏర్పాటు కావడంలేదు.
 - దూసర్లపూడి రమణరాజు, సామాజికవేత్త, కాకినాడ
 
 ఉపాధి అవకాశాలు మెరుగు
  ప్రత్యేక హోదా వస్తే వచ్చే పన్నుల మినహాయింపులతో జిల్లాలో ఎక్కువగా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది. తద్వారా మహిళలు, కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో జిల్లా అభివృద్ధే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.
 - జి.బేబిరాణి, శ్రామిక మహిళా కన్వీనర్,కాకినాడ
 
 ప్రయోజనాలకు భంగం కల్గిస్తోంది
 రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో రాజీధోరణిలో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తోంది. విభజన హామీలను సాధించుకోలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణం అన్ని పార్టీలతో కలిపి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెల్లి కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చి ప్రత్యేక హోదా సాధించాలి
 - దడాల సుబ్బారావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు
 
ఉద్యోగావకాశాలు పెరుగుతాయి
 ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగావకాశాలొస్తాయి. హోదాను సాధించకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. హోదా సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
 - గుత్తుల రుద్రమూర్తి, అంగర, కపిలేశ్వరపురం మండలం.
 
హోదాతోనే ఉపాధి అవకాశాలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేక హోదాతో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
 - వి. కల్పన, బీఎస్సీ బీఈడీ, పెదపూడి
 
చిత్తూరు జిల్లాలో ఇటీవల కోకో ఉత్పత్తులతో చాక్లెట్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇటువంటివి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో కోకో పంట సుమారు 60 వేల ఎకరాల్లో సాగవుతోంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ధర పెరుగుతోంది. కోకో లాభదాయం కావడంతోపాటు కొబ్బరి రైతులు ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేసి ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement