
గొంతెమ్మ కోర్కెలు కుదరవని చెప్పండి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘371(డి) పై రోజుకో మాట మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంత మంటారు, సంయుక్త రాజధాని అని, ప్రత్యేక అధికారాలు ఇస్తామని చెప్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. జటిలమైన ఈ సమస్యను వివాదాస్పదం చేయకుండా ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. ఏ ఇద్దరి మధ్యనైనా వివాదం వస్తే ఇద్దరినీ కూర్చోబెట్టి గొంతెమ్మ కోర్కెలు కోరిన వారికి అవి సాధ్యం కావని చెప్పాలి. అసెంబ్లీ తీర్మానం చేయకుండా రాష్ట్ర విభజన సరికాదు’’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఎవరివి గొంతెమ్మ కోర్కెలో మాత్రం ఆయన వెల్లడించలేదు. గురువారం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. గవర్నర్, స్పీకర్‌లు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన విధులను సరిగా నిర్వర్తించటం లేద ని విమర్శించారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాల్సిందిగా సీఎం లేఖ రాసిన వెంటనే స్పీకర్ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపాలని.. సీఎం నుంచి లేఖ వచ్చినా స్పీకర్ ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు.
యథావిధిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బాబు తన అక్కసును వెళ్లగక్కారు. జగన్ కోల్‌కతా వెళ్లేందుకు సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతిని తప్పుపట్టారు. ‘జగన్ దేశవ్యాప్తంగా పర్యటించేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును కోరతారు. అనుమతించలేమని కోర్టు చెప్తుంది. ఆ వెంటనే ఆయన కోల్‌కతా వెళ్లేందుకు అనుమతి కోరతారు. సీబీఐ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తుంది..’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సినీ నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ ప్రచారం చేస్తారని వస్తున్న వార్తల గురించి ఒక విలేకరి ప్రశ్నించగా.. ఎవరికైనా ఏమైనా చేసుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. మరో విలేక రి జగన్ కుప్పం నుంచి సమైక్య శంఖారావం చేపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. వెంటనే మరో విలేకరి ఎన్‌టీఆర్‌కు వర్తించిన సూత్రమే జగన్‌కు వర్తిస్తుంది కదా అని అన్నారు. తనకు ఒక వైపున కూర్చున్న విలేకరులకు కనుసైగ చేసిన తర్వాత మాట్లాడిన చంద్రబాబు.. జగన్‌ను కుప్పంకు రానీయవద్దని, ఆయన వస్తే అపవిత్రం అవుతుందని చెప్పానంటూ జవాబిచ్చారు.
చంద్రబాబు విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇవ్వటం జరిగింది. ఒకవేళ సాక్షిని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు కోరేది.
1. గొంతెమ్మ కోర్కెలు సాధ్యం కావని చెప్పాలంటున్నారు. సీమాంధ్రులకు చెప్పాలంటారా? లేక తెలంగాణ వారికా?
2. రాజకీయ పార్టీల నేతలు పలు అంశాల్లో మద్దతు కోసం ఇతర పార్టీల నేతలను కలవడం సర్వసాధారణం. మీరు ఇతర రాజకీయ పార్టీల నాయకులను కలిస్తే తప్పు లేదు కానీ.. జగన్ పశ్చిమ బెంగాల్ సీఎం భేటీ అయితే తప్పవుతుందా?
3. మీరెంతసేపూ ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు చేయడం తప్ప మీ వైఖరి, విధానాలేంటో మాత్రం చెప్పడం లేదెందుకు?