నేటి కాంగ్రెస్ నాయకత్వానికి ఇవేమీ పట్టవు. విభజనపై శాసనసభ ముందుకు బిల్లు వస్తుందా, తీర్మానం వస్తుందా, లేదా వీటిపైన అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే తీసుకుంటారా, లేక ఓటింగ్ పెడతారా లేక తోకముడవ వలసివస్తుందా అన్న అంశాలపై తలోదారీ తొక్కుతున్నారు! రాష్ట్రానికి చెందిన సొంత ఎంపీలకు, మంత్రులకు కూడా ఏ విషయం చెప్పకుండా కప్పెట్టడమే కాక, ప్రజల్ని వెర్రిబాగుల వాళ్లుగా భావిస్తున్నారు!
‘‘అసెంబ్లీ ఆమోదం లేకుండా విభజన ప్రమాదకరం’’. (సోనియాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించినట్లు వార్త.) ఘోరమైన విషయమేమంటే - పార్లమెంటు, శాసనసభలలోని లెజిస్లేటర్లు భారత రాజ్యాంగం క్షుణ్ణంగా తెలిసిన వారై ఉంటారన్న భావనలో మనం ఉండిపో వటం! దాని ఫలితమేమైందంటే - ఇదిగో, అదిగో ‘విభ జన’ సమస్యల పరిష్కారానికి అదేదో ‘ఆంటోనీ కమిటీ’ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తుందనీ, అన్ని విషయాలూ పరిశీలిస్తుందని ప్రజల్ని మురిపించడానికి ప్రయత్నించ డం. కానీ, అలాంటి కమిటీ ఏదీ ఇంతవరకూ రాకుండానే ‘నిద్రావస్త’లోకి జారుకుంది. ఆంటోనీ కమిటీ అడ్రస్ గల్లంతైన సమయంలో, అదీ ఇదీ కూడా కాదు, సీమాం ధ్రుల సమస్యల పరిష్కారానికి కేంద్రస్థాయి మంత్రుల కమిటీ సిద్ధమవుతుందనీ, ఫిర్యాదులు ఏమైనా ఉంటే విభ జన బాధిత ప్రాంతాల వారు చెప్పుకోవచ్చునని ముక్తా యింపు విసిరి ‘నత్త’లాగా కేంద్రం ముడుచుపోయి కూర్చోవడం మరో మలుపు! ఇంత వరకూ సమస్యను కొలిక్కి తేవడంలో అడుగుముందుకు వేయలేని అసమర్థ నాయకులు, 3 వేల ఏళ్ల చరిత్ర గలిగిన తెలుగుజాతి ఏక భాషా సంస్కృతులతో పరిచయం లేని వారు, తెలుగుకు శిష్టభాషా ప్రతిపత్తిని రానివ్వకుండా మోకాలడ్డిన వారు సహా ఇతరేతర మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు!
మెడలు వంచాలనే...
విభజన ప్రతిపాదనను ముందుగానే నిర్ణయించుకుని జాతివ్యతిరేక ప్రకటనకు సాహసించిన అధిష్టానం, ఆ తరువాత తెలుగుజాతి మెడలు వంచాలనే దుస్సాహసా నికే ఒడిగట్టింది. 1920ల నుంచీ పలు పార్టీ మహాసభలలో ప్రజావాంఛకు అనుగుణంగా జాతీయ సమైక్యతను పటి ష్టం చేయటం కోసం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అనేక తీర్మానాలు చేసింది. అందుకనుగుణంగా స్వాతం త్య్రానంతరం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు తొలి కమి షన్‌ను (ఫజల్ అలీ కమిషన్) ఏర్పాటు చేసి, ‘ఆంధ్ర ప్రదేశ్’ (విశాలాంధ్ర) అవతరణను సుసాధ్యం చేసింది! ఇప్పుడీ రాష్ట్రాన్ని ఎన్నికలలో రాజకీయ స్వార్థ ప్రయోజ నాల కోసం తెలుగుజాతిని చీల్చే కార్యక్ర మానికి గజ్జెకట్టింది. ఇందుకు మూల్యాన్ని చెల్లించుకోబోతున్నది.
వైరుధ్యాల మధ్య...
ఈ ‘విభజన’ మంత్రానికి కాంగ్రెస్ అధిష్టానం ఆధార పడింది దేని మీద? రాజ్యాంగంలోని 3వ అధికరణలోని ‘ఎ’ క్లాజుపైన. కాని ఆ క్లాజు భాషాప్రయుక్త ప్రాతిపదిక పైన ఏర్పడిన రాష్ట్రాల్ని ఉద్దేశించి చొప్పించినది కాదు. పైగా 3వ అధికరణలోని ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకు ఉన్న క్లాజు ల మధ్య కూడా వైరుధ్యం ఉంది! ఎందుకంటే, సువ్యవస్థి తమైన తెలుగు జాతి సాధించుకున్న ‘ఆంధ్రప్రదేశ్’ నుంచి ఒక భూభాగాన్ని చీల్చి మరొక రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలన్నా, లేదా ఏదేని రాష్ట్రానికి ఈ భూభాగాన్ని తీసు కుపోయి కలిపేయాలన్నా అలాంటి అధికారాన్ని ఈ 3వ అధికరణ కల్పించింది. కాని అదే సమయంలో ఆ అధి కారంతోపాటు ఏ రాష్ట్రపు ‘సరిహద్దులనైనా మార్చేసే అధి కారాన్ని కూడా’ ఆ అధికరణ కేంద్రానికి సంక్రమింప చేసింది.
అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈ అంశం పలుమార్లు వాదోపవాదాలకు గురికావలసి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ చర్చ కూచ్-బీహార్ భూభాగాల విషయంలోనూ, బెరుబరి యూనియన్ విభ జన సందర్భంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య తలెత్తింది. స్వాతంత్య్రానంతరం కూడా ఈ పద్ధతిన ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలను విభజించడానికి దీనినే ఆశ్రయిస్తే దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లుతుందని అప్పుడు పలువురు రాజ్యాంగ నిపుణులు, రాజనీతి శాస్త్రజ్ఞులు అభిప్రాయప డ్డారు (బెరుబరి ఒపీనియన్ కేసు: 1960 ఎస్‌ఆర్ రికార్డు). ఈ పూర్వరంగంలోనే సుప్రీంకోర్టు నాటి గౌరవ న్యాయ మూర్తి గజేంద్ర గడ్కర్ రాజ్యాంగంలోని 1వ అధికరణ (3)(సి) ఎలా ఒక భూభాగాన్ని స్వాధీనపరుచుకునే అధి కారాన్ని పార్లమెంటుకు కల్పించలేదో వివరిస్తూ, 3వ అధిక రణ కూడా స్థిరపడిన రాష్ట్ర భూభాగాన్ని చీల్చి మరొక భాగానికి ధారాదత్తం చేసే అధికారాన్ని పాలనా వ్యవస్థకు దఖలు పరచలేదని స్పష్టం చేశారు. (హెచ్‌ఎం సీరవాయ: ‘కాన్‌స్టిట్యూషనల్ లా ఆఫ్ ఇండియా’ వాల్యూమ్-1, పేజీ:308)! అంతేగాదు, ఒక రాష్ట్రపు భూభాగాన్ని కోత పెట్టే అధికారాన్ని చట్టం ద్వారా పార్లమెంటుకు సంక్రమిం పజేసే 3వ అధికరణ ‘ఎ’, 3 (సి) క్లాజు సహితం ఒక రాష్ట్ర భూభాగాన్ని విడగొట్టేసి మరొక రాష్ట్రానికి ధారాదత్తం చేయడాన్ని ప్రస్తావించలేదు!
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
3వ అధికరణ, ఇండియన్ యూనియన్ లక్ష్యంతోనే గాక, ఫెడరల్ (సమాఖ్య) స్వభావంతో కూడిన రాజ్యాంగం తోనూ సంఘర్షిస్తుందని, సమాఖ్య (ఫెడరల్) స్వభావా నికే విరుద్ధమని న్యాయమూర్తి చెప్పారు! చివరికి బెరుబరి ప్రాంతాన్ని భారత్-పాకిస్థాన్ ఒప్పందం ప్రకారం 3వ అధికరణ ప్రకారం ధారాదత్తం చేయడానికి చట్టం అంగీ కరించదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అంతేగాక రాజ్యాం గాన్ని సవరించిన తరువాతే ఆ ఒప్పందాన్ని అమలు చేసుకోవచ్చునని వివరణ ఇచ్చింది.
ఒక పొరుగు దేశంతో కుదిరిన ఒప్పందానికే అత్యున్నత న్యాయస్థానం ఎదురు తిరిగింది. అలాగే రాష్ట్ర పునర్విభజన కమిషన్ సిఫారసు లపై భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడానికి కూడా ఉద్యోగ, సద్యోగాల సమస్యపై తలె త్తిన అనుమానాలకు, వివాదాలకు పరిష్కారంగా 371వ అధికరణ (డి) క్లాజు ద్వారా వచ్చిన రాజ్యాంగ సవరణ చట్టానికి మళ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో సవరణ తెస్తే తప్ప రాష్ట్ర సరిహద్దులను 3వ అధికరణ ద్వారా ముట్టుకోవడానికి వీలులేదు! పైగా 371(డి) సవ రణాధికరణను 1974లో ఇందిరాగాంధీ అమలులోకి తెచ్చి తెలుగు రాష్ట్ర సమైక్యతను, సమగ్రతను సుస్థిరం చేసింది! సరిగ్గా సవరించిన ఈ అధికరణే ఎన్టీఆర్ ప్రభుత్వం అమ లులోకి తెచ్చిన 610 జీఓ! ఈ ఊసు, ఈ ప్రస్తావనలు లేకుండా కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం తన ఉనికి కోసం జాతిని విచ్ఛిన్నం చేసే కార్యక్రమానికి సాహసించింది.
నాడే మంత్రాంగం...
రాష్ట్ర విభజనకు 1955 డిసెంబర్ 24 నాటికే కాంగ్రెస్‌లో ఒకవర్గం కుట్ర నడిపింది. ఎలా? సమైక్య రాష్ట్రావతరణకు ముందు 1953-1955 మధ్య కాలంలో ‘హైదరాబాద్ స్టేట్’ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నాయక త్వంలో అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు విశాలాంధ్ర ఏర్పా టుకు అనుకూలంగా తీర్మానం ఆమోదించబోతున్న సమ యంలో ‘ఆంధ్ర మహాసభ’లోని మితవాదవర్గానికి నాయ కులుగా ఉన్న ‘పిడికెడు’ భూస్వామ్య, జాగీర్దారీ వర్గ ప్రతి నిధులు హుటాహుటిన ఢిల్లీకి పరుగుపెట్టి హోంమంత్రి గోవింద వల్లభపంత్‌తో మంతనాలాడి, ఆ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించకుండా వాయిదా వేయించడం జరి గింది!
దీనితో వచ్చిందే రాజ్యంగంలోని 3వ అధికరణకు (1955 డిసెంబర్ 24న) వచ్చిన 5వ సవరణ చట్టం. అంత కుముందు రాష్ట్ర సమస్యలపై కేంద్రం రూపొందించే బిల్లు లను శాసనసభకు రాష్ర్టపతి నివేదించి, అభిప్రాయాలను తెలుసుకోవడమేగాక, బిల్లుపై ఓటింగ్ హక్కును కూడా వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడమూ ఉం డేది. కానీ, కొందరి ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం సవరణ ద్వారా అసెంబ్లీలలో సభ్యుల అభిప్రాయం తెలు సుకోగలిగిన ఓటింగ్ హక్కును హరించివేస్తూ, 1955లో 3వ అధికరణకు నర్మగర్భంగా పాత ‘ప్రొవిజో’ను తొలగిం చి సవరణ తెచ్చారు. ఈ తప్పుడు సవరణ చాటునే పం జాబ్ అసెంబ్లీని దాటవేసి ఆ రాష్ట్రాన్ని విభజించారు! అయినా, స్థిరపడిన రాష్ట్రాల భూభాగాలను చెదరగొ ట్టడం, విడగొట్టే రాష్ట్రాల పేర్లను మార్చడం విషయంలో ఆయా రాష్ట్రాలతో విధిగా సంప్రదించాలని కూడా 1955 డిసెంబర్ 24 నాటి 5వ రాజ్యాంగ చట్టం (సెక్షన్-2) శాసిస్తోందని గుర్తించాలి!
మళ్లీ అంబేద్కర్ మాటల్లోనే...
కానీ, నేటి కాంగ్రెస్ నాయకత్వానికి ఇవేమీ పట్టవు. విభ జనపై శాసనసభ ముందుకు బిల్లు వస్తుందా, తీర్మానం వస్తుందా, లేదా వీటిపైన అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే తీసుకుంటారా, లేక ఓటింగ్ పెడతారా లేక తోకముడవ వలసివస్తుందా అన్న అంశాలపై తలోదారీ తొక్కుతున్నా రు! రాష్ట్రానికి చెందిన సొంత ఎంపీలకు, మంత్రులకు కూడా ఏ విషయం చెప్పకుండా కప్పెట్టడమే కాక, ప్రజల్ని వెర్రిబాగుల వాళ్లుగా భావిస్తున్నారు! రాజ్యాంగ సవర ణలు లేదా ఫెడరల్ స్వభావానికి విరుద్ధమైన అంశాలు చట్టాలలో చేరడం వల్ల ఒకే జాతికి చెందిన ప్రజల మధ్య అంతఃకలహాలు ఎలా వ్యాపిస్తాయో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఇలా హెచ్చరించారు. ‘‘అమెరికన్లు అం తర్యుద్ధానికి ఎందుకు దిగవలసివచ్చింది? రాష్ట్రాలు ఫెడ రేషన్ నుంచి ఎక్కడికక్కడ వేరుపడిపోవడానికి కాదు. అం దుకనే వాళ్ల ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థ అవిచ్ఛిన్నంగా ఉండిపోగలిగింది. కనుకనే భారత ముసాయిదా రాజ్యాం గ రచన బాధ్యతలు చేపట్టిన ఉన్నతస్థాయి సంఘం కూడా ఉత్తరోత్తరా ఊహాగానాలకు (స్పెక్యులేషన్) అవకాశం కల్పించడం కంటే మొదట్లోనే ఈ విషయాన్ని స్పష్టం చేయదలచింది’’ (డిబేట్స్: వాల్యూం-7)
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు