మేము తప్పు చేస్తే దిద్దుకుంటాం: వట్టి
హైదరాబాద్: రాష్ట్ర విజభన జరిగితే కోస్తాంధ్ర 50 ఏళ్లు వెనక్కి పోతుందని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టినట్టినట్లు కనబడుతుందన్నారు. సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రానికి గౌరవం ఉన్నట్టు లేదన్నారు. శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజనపై కేంద్రం అత్యుత్సాహం ఎందుకు కనబరుస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఏళ్ల తరబడి విదర్భ డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదని తెలిపారు.
తాము, తమ పూర్వీకులు తప్పు చేసినట్టు నిరూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. హైదరాబాద్తో సమానమైన రాజధానికి నిర్మాణానికి నిధులెవరిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతాన్ని బలవంతంగా తెలంగాణలో కలిపారనడం సబబు కాదన్నారు. ఈ బిల్లును చూస్తే కొత్త రాష్ట్రం ఎలా బతికి బట్టకడుతుందో అర్థం కావడం లేదన్నారు.
తమపై దోపిడీ ఆరోపణలు తప్పని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని తెలిపారు. తీర్మానం తప్పనిసరి అని సర్కారియా కమిషన్ కూడా చెప్పిందన్నారు. శాసనసభ తీర్మానాన్ని కేంద్రం పొందలేదు కాబట్టి బిల్లును వ్యతిరేకిస్తున్నామని వట్టి వసంతకుమార్ చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సరైన ప్రాతిపదిక, విధానం అవలంభించాలని సూచించారు.