ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయింది: కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని తాను భావిస్తున్నట్టు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేదని అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఉద్యమం విజయం సాధించడంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేశారని ప్రశ్నించారు.
తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఈ ఉద్యమస్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అసమానతలు, అంతరాలు తగ్గాలని అన్నారు. తెలంగాణలో అద్భుత వనరులున్నాయని చెప్పారు. ప్రకృతి వరంగా ఇచ్చిన సింగరేణి గనులు తమ ప్రాంతంలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణకు భవిష్యత్లో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని పారిశ్రామికవేత్తలు చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాతావరణం కూడా బాగా అనుకూలమని తెలిపారు. ప్రపంచంలో పెట్టుబడులకు అనుకూల నగరం హైదరాబాద్ అని చెప్పారు. నిజాం కాలంలోనే హైదరాబాద్లో వందకుపైగా పరిశ్రమలున్నాయని వెల్లడించారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు కృషి చేస్తానని కేసీఆర్ హామీయిచ్చారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర విభజన జరుగుతుందన్నారు.