'నన్ను జాతివ్యతిరేకి అనే హక్కెవరికీ లేదు'
హైదరాబాద్: ‘నేను భారతీయుడిని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తా.. నన్ను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికి లేదు’అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం పెంపొందించేందుకే ఎన్నికల బరిలో దిగుతున్నామన్నారు. ఇటీవల శివసేన నేత ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణీతి షిండే తనపై చేసిన వాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రణీతి షిండేకు లీగల్ నోటీసు పంపించామని, క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రజలు తమ పార్టీపై పెట్టిన నమ్మకం, విశ్వాసాన్ని వమ్ము చేయబోమన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం: తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములం అవుతామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అఖిలపక్షంతో కలసి ప్రధాని మోదీని కలిసేందుకు వెనుకాడబోమనన్నారు. తాము బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకం తప్ప ప్రధానికి కాదన్నారు. తెలంగాణ బడ్జెట్‌లో మైనారిటీలకు తగిన నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో కృష్ణా జలాల మూడో దశ, గోదావరి నీరు, విద్యుత్ సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. తాము టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తున్నా.. ప్రజా సమస్యలపై తప్పకుండా నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో 120 స్థానాలకు పైగా తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, వివాదాలకు తావు లేకుండా నిర్మాణం జరగాలన్నదే తమ ధ్యేయమని వ్యాఖ్యానించారు. మెట్రో మార్గాన్ని బహదుర్ పూరా- కాలపత్తర్- ఫలక్‌నుమా మీదుగా నిర్మిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు. జీహెచ్‌ఎంసీ పునర్విభజన, ఎన్నికల పొత్తుపై పార్టీ వైఖరిని త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రభుత్వం హజ్ యాత్రికులకు అందించే సబ్సిడీ రద్దు చేసి ఆ మొత్తాన్ని ముస్లిం బాలికల ఉపకార వేతనాల పెంపులో వినియోగిస్తే బాగుంటుందన్నారు.