Praniti Shinde
-
సీనియర్లకు చోటేది.. భగ్గుమన్న అసంతృప్తులు!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ అసంతృప్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది. మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలో మంత్రలుగా అవకాశం లభిస్తుందనుకున్న పలువురు సీనియర్లకు మొండిచేయి ఎదురైంది. మంత్రివర్గ విస్తరణ జరిగి నాలుగు రోజులైన తరువాత అసంతృప్తుల ఒక్కొకరూ బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణతీ షిండేకు స్థానం కల్పించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె మద్దతుదారుల గురువారం షోలాపూర్ కాంగ్రెస్ భవనం ఎదుట ధర్నా, ఆందోళన నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ రీజియన్లకు చెందిన పదాధికారులు పాల్గొన్నారు. (కీలక భేటీకి సీనియర్ నేత డుమ్మా.. కారణం అదేనా!) సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండే షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. దీంతో కేబినెట్లో చోటు దక్కడం ఖాయమని ఆమె భావించారు. ఈ మేరకు మద్దతుదారులకూ భరోసా ఇచ్చారు. మహా వికాస్ ఆఘాడి మంత్రి వర్గ విస్తరణలో తనను చిన్న చూపు చూశారని, ఇప్పటికైనా నాయకులు మనసు మార్చుకుని స్థానం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్తగా ఎన్నికైన వారికి పదవులు కట్టబెట్టారని, సీనియర్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రణతీకి మంత్రివర్గంలో స్థానం కల్పించని పక్షంలో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మల్లిఖార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేస్తామని ఆమె మద్దతుదారులు హెచ్చరించారు. కాగా ప్రణతీతో పాటు మరికొందరు నేతలు కూడా మంత్రివర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోదరుడు సేన ఎమ్మెల్యే సునీల్ రౌత్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో రౌత్ కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ సందర్భంగా విధానభవన్‌లో నిర్వహించిన మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంజయ్ హాజరుకాలేదు. మంత్రివర్గ విస్తరణకు ముందు మూడు పార్టీల నేతల మధ్య జరిగిన కీలక భేటీకి కూడా రౌత్ గైర్హాజరు అయ్యారు. ఈ విషయం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేన శాసన సభ్యుడిగా ఉన్న రౌత్ సోదరుడు సునీల్ రౌత్‌కు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం అని సమాచారం. సునీల్‌కు మంత్రిపదవి కోసం సంజయ్ తొలి నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు. దీంతో రౌత్ తీవ్ర అసంతృప్తికి గురియ్యారని సమాచారం. అయితే ఈ వార్తలను రౌట్ కొట్టిపారేశారు. కాగా డిసెంబర్ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. -
‘కొత్త డెంగ్యూ దోమ వచ్చింది.. పేరు మోదీ బాబా’
షోలాపూర్ : రాజకీయాల్లో తమ ప్రత్యర్థి నాయకులను, పార్టీ నేతలను పంచ్ డైలాగ్స్‌లో విమర్శించడం సాధారణమే. అలాంటి డైలాగ్స్ వల్ల ఆ విమర్శలు ప్రజల్లోకి త్వరగా చేరుకుంటాయి. అందుకే రాజకీయ నాయకులు కొత్త కొత్త డైలాగులతో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుంటారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఓ కొత్త డైలాగ్‌తో విమర్శించారు మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణితి షిండే. షోలాపూర్ సౌత్ ఎమ్మెల్యే ప్రణితి షిండే శనివారం ఓ ర్యాలిలో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీని డెంగ్యూ దోమతో పోల్చారు. ‘ మన దేశంలోకి కొత్త డెంగ్యూ దోమ వచ్చింది. దాని పేరు మోదీ బాబా. ఆ దోమ దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు మనం ఏంచెయ్యాలంటే పురుగుల మందు స్ప్రే చేసి దోమను చంపినట్లుగా మోదీని పవర్ నుంచి తొలగించి మనల్ని మనం రక్షించుకోవాలి’ అని వ్యంగ్యంగా విమర్శించారు. -
'నన్ను జాతివ్యతిరేకి అనే హక్కెవరికీ లేదు'
హైదరాబాద్: ‘నేను భారతీయుడిని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తా.. నన్ను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికి లేదు’అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం పెంపొందించేందుకే ఎన్నికల బరిలో దిగుతున్నామన్నారు. ఇటీవల శివసేన నేత ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణీతి షిండే తనపై చేసిన వాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రణీతి షిండేకు లీగల్ నోటీసు పంపించామని, క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రజలు తమ పార్టీపై పెట్టిన నమ్మకం, విశ్వాసాన్ని వమ్ము చేయబోమన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం: తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములం అవుతామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అఖిలపక్షంతో కలసి ప్రధాని మోదీని కలిసేందుకు వెనుకాడబోమనన్నారు. తాము బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకం తప్ప ప్రధానికి కాదన్నారు. తెలంగాణ బడ్జెట్లో మైనారిటీలకు తగిన నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో కృష్ణా జలాల మూడో దశ, గోదావరి నీరు, విద్యుత్ సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. తాము టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తున్నా.. ప్రజా సమస్యలపై తప్పకుండా నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో 120 స్థానాలకు పైగా తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, వివాదాలకు తావు లేకుండా నిర్మాణం జరగాలన్నదే తమ ధ్యేయమని వ్యాఖ్యానించారు. మెట్రో మార్గాన్ని బహదుర్ పూరా- కాలపత్తర్- ఫలక్‌నుమా మీదుగా నిర్మిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు. జీహెచ్ఎంసీ పునర్విభజన, ఎన్నికల పొత్తుపై పార్టీ వైఖరిని త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రభుత్వం హజ్ యాత్రికులకు అందించే సబ్సిడీ రద్దు చేసి ఆ మొత్తాన్ని ముస్లిం బాలికల ఉపకార వేతనాల పెంపులో వినియోగిస్తే బాగుంటుందన్నారు. -
బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుంచి షిండే డిశార్జ్
బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే (72) ను ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశార్జ్ చేశారని ఆయన కుమార్తె, షోలాపుర్ ఎమ్మెల్యే ప్రీతి షిండే ఆదివారం ముంబైలో వెల్లడించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మరో ఐదారు రోజుల్లో ఆయన విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. అప్పటి వరకు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. ఉపిరితిత్తులు కొద్దిగా పెరగడంతో షిండేకు ఈనెల 4వ తేదీన బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే.