మోదీజీ మీ చేతిలో అధికారం ఉంది
ముస్లింలను ఏం చేస్తారో చేయండి
భయపడేది లేదు.. ఎక్కడికి రావాలో చెప్పండి
నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అమరావతి అభ్యర్థి (సిట్టింగ్ ఎంపీ) నవనీత్ కౌర్.. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలకు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ మజ్లిస్ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్.. దాదాపు పన్నెండేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని చిన్నోడు అన్నాడని, కానీ వాళ్లకు 15 నిమిషాలేమో..మాకు 15 సెకన్లు చాలు..’అంటూ వ్యాఖ్యానించారు. కాగా గురువారం పాతబస్తీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అసద్ వద్ద.. నవనీత్ కౌర్ వాఖ్యలను మీడియా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు.
దమ్ముంటే చేసి చూపించండి
‘నరేంద్ర మోదీజీ 15 సెకన్లు కాదు.. గంట.. 15 గంటలు సమయం ఇవ్వండి.. అధికారం మీ చేతిలో ఉంది...ముస్లింలను ఏం చేస్తారో చేయండి.. మీలో మానవత్వం మిగిలి ఉందా? లేదా? అని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం..అంతా మీదే.. అధికారం మీదే అయినప్పుడు ఎవరు ఆపుతున్నారు? మేం భయపడేది లేదు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం... దుమ్ముంటే చేసి చూపించాలి..’అంటూ అసదుద్దీన్ సవాల్ చేశారు.
హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదని, వారు పౌరులని, రాజకీయ పార్టీల ఆస్తులు కాదని వ్యాఖ్యానించారు. నలభై ఏళ్లుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడిస్తూ ఎంఐఎంకు అప్పగిస్తోందన్నారు. హిందుత్వం మళ్లీ ఓడిపోతుందని చెప్పారు. ముస్లింలను ద్వేషించడమే ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచన విధానమని, అందుకే మరోమారు బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment