- దేవెగౌడ విమర్శ ..
- ఆయన కేవలం ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి
- ఆయనదంతా ప్రచార ఆర్భాటమే
- ఎవరి పవనాలు వీస్తున్నాయో మే 16న తెలుస్తుంది
- ప్రధానిగా ఉన్న స్వల్ప కాలంలోనే అనేకం చేశా
- ‘ఫలితాల’ తర్వాత తృతీయ ఫ్రంట్ ఆవిర్భావం
మైసూరు, న్యూస్‌లైన్ : నరేంద్ర మోడీకి దేశ సమస్యలపై అవగాహన లేదని, ఆయన కేవలం గుజరాత్‌కు ముఖ్యమంత్రి మాత్రమేనని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు. శుక్రవారం ఆయనిక్కడ ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడుతూ.. దేశంలో ఎవరి పవనాలు వీస్తున్నాయో...మే 16న తెలుస్తుందన్నారు. అయితే గుజరాత్‌లోని ఓ సామాన్య సీఎంకు దేశ వ్యాప్తంగా ప్రచారం కల్పిస్తున్నది మీరేనంటూ విలేకరుల వైపు వేలెత్తి చూపారు.
తాను స్వల్ప కాలం ప్రధానిగా ఉన్నప్పటికీ ఎన్నో పనులు చేశానంటూ, తన సాధనలతో కూడిన చిరు పుస్తకాన్ని ఆయన ప్రదర్శించారు. గత శాసన సభ ఎన్నికలు, మండ్య, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో జేడీఎస్ వెనుకబడిన మాట నిజమేనని అంగీకరించారు. అప్పట్లో తమ పార్టీ పనై పోయిందని చాలా మంది భావించారని అన్నారు. ఆ సమయంలో అనారోగ్యం వల్ల తాను నాలుగైదు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
అనంతరం పార్టీ తరఫున పలు కార్యక్రమాలను నిర్వహించామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తృతీయ ఫ్రంట్ ఆవిర్భవిస్తుందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తృతీయ ఫ్రంట్ అస్తిత్వంలో ఉందన్నారు. మే 16 తర్వాత రాజకీయ పునరేకీకరణ జరుగుందని జోస్యం చెప్పారు. దేశంలో కాంగ్రెస్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని, దీని ద్వారా బీజేపీ లాభపడాలని చూస్తోందని అన్నారు.
మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, నవీన్ పట్నాయక్ సహా ఎండీఎంకే, ఏఐఏడీఎంకే, జేడీఎస్, వామపక్షాలు, ముస్లిం లీగ్ సహా అనేక పార్టీలు తృతీయ ఫ్రంట్ వైపు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు 23 స్థానాలు చొప్పున గెలుస్తామంటూ బీరాలు పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ లెక్కన హాసన స్థానం కూడా తనకు దక్కేట్లు లేదని ఆయన చమత్కరించారు.