ప్రాంతీయ చిత్రాలపై నిర్లక్ష్యం | Neglected regional films | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ చిత్రాలపై నిర్లక్ష్యం

Published Tue, Nov 5 2013 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

Neglected regional films

 

= బాలీవుడ్ దర్శకుడు అమోల్ పాలేకర్..
 = మంచి ప్రాంతీయ చిత్రాలూ ఫెయిల్ అవుతున్నాయి
 = చిన్న చిత్రాలకు వేదిక అవసరం
 = రాజకీయాలకు నేను దూరం
 = మోడీపై లతా మంగేష్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించను
 = అనేక విజయాలను చూశాననే ఆత్మ త ృప్తి చాలు
 = వన్డే మ్యాచ్‌ను తిలకించడానికి ఇక్కడికి వచ్చా

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ప్రాంతీయ చిత్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారని బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ విచారం వ్యక్తం చేశారు. బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. విజయవంతమైన వాణిజ్య చిత్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రాంతీయ చిత్రాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ పరిణామాల మధ్య ప్రాంతీయ సినిమా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆగత్యం ఏర్పడిందన్నారు. జన జీవన స్రవంతిలో కలసిపోయే 90 శాతం సినిమాలు విజయాన్ని సాధించలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో చిన్న చిత్రాలకు వేదికను నిర్మిస్తే, ప్రేక్షకులు తమంతట తాముగా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
మహారాష్ట్రలో సంబరాలు

భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహారాష్ర్టలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కె మహారాష్ట్ర వారు కావడంతో పాటు బాలీవుడ్‌కు ముంబై కేంద్రం కావడం దీనికి కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు తానెంతో దూరమని చెప్పారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు.

అయితే బాధ్యత కలిగిన పౌరుడుగా తానేం చేయాలో బాగా తెలుసునన్నారు. 45 ఏళ్ల రంగ స్థల, సినిమా జీవితంలో ఎన్నో విజయాలను చూశానని అన్నారు. ఆత్మ తృప్తి ఉందన్నారు. ఇప్పుడు తన మూల వృత్తి చిత్ర కళపై ఆసక్తి పెరిగిందని తెలిపారు. కాగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరిగిన చివరి వన్‌డేను తిలకించడానికి ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ప్రఖ్యాత క్రికెటర్ జీఆర్. విశ్వనాథ్‌తో కలసి మ్యాచ్‌ను చూడడాన్ని ఎప్పటికీ మరువలేనని చెప్పారు.

తొలి నుంచీ తాను క్రికెట్ అభిమానిని, మ్యాచ్‌లను చూడడానికి షూటింగ్‌లకు కూడా ఆపేసే వాడినని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో పలు సార్లు తన భార్య చేత చీవాట్లు తిన్నానని గుర్తు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా కన్నడ నట దిగ్గజాలు అనంత్ నాగ్, అరుంధతీ నాగ్, గిరీశ్ కర్నాడ్‌లతో కలసి కాలక్షేపం చేసే అవకాశం రావడం తనకెంతో సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement