టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం | TRS abuse of power utham kumar | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం

Published Thu, Jan 14 2016 3:55 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం - Sakshi

టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం

 ‘మీట్ ద ప్రెస్’లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
 సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి బెదిరింపులు, కేసులు, ప్రలోభాలకు గురిచేస్తూ సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇంట్లో మాట్లాడుకుని టీఆర్‌ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని... కేబినెట్ మీటింగైనా, పార్టీ సమావేశమైనా ప్రజాస్వామ్యమే ఉండదని విమర్శించారు.
 
  కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా చర్చించి నిర్ణయాలు చేస్తుందన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ‘టీయూడబ్ల్యూజే’ ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకుంటామనే విశ్వాసముంటే ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్యను టీఆర్‌ఎస్ ఎందుకు పెంచుకుంటోందని ఉత్తమ్ ప్రశ్నించారు. కేవలం ప్రత్యక్షంగా ఎన్నికయ్యే కార్పొరేటర్లతోనే టీఆర్‌ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే.. తాము దేనికైనా సిద్ధమేనని ఉత్తమ్ సవాల్ చేశారు.
 
  అధికార దుర్వినియో గం చేసి, అడ్డదారిలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టుగా సవాళ్లు చేస్తున్నారన్నారు. ‘‘హైదరాబాద్‌లో కేటీఆర్‌కు ఏ గల్లీ తెలుసు, ఆ గల్లీల్లో కష్టాలేం తెలుసు? ఒక సీఎం కుమారుడిగా కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందా? సీఎం కేసీఆర్ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది’’ అని ఉత్తమ్ అన్నారు.
 
 ప్రచారానికి చిరంజీవి...
 టీఆర్‌ఎస్ పార్టీతో కాకుండా ప్రభుత్వంతోనే పోటీలా ఎన్నికలున్నాయని ఉత్తమ్ అన్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఎన్నికల సంఘం తటస్థ వైఖరిపైనా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మెట్రో రైలుకు అడ్డంకులు కల్పించడం, సెటిలర్లపై అనుచితంగా మాట్లాడటం వంటివాటితో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కేసీఆర్ దెబ్బకొట్టారన్నారు.
 
  దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని చెప్పి 19 నెలలుగా ఏం చేశారని నిలదీశారు. రియల్టర్ల కొమ్ముకాయడానికే భవనాల చట్టానికి సవరణలు తెచ్చారన్నారు. 2014 ఎన్నికల్లో తాము సరైన పనితీరు చూపించలేకపోయామని, గ్రేటర్ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ నేతలతో పాటు చిరంజీవి కూడా ప్రచారానికి వస్తారన్నారు.
 
 ఎంఐఎంతో బీజేపీ చీకటి ఒప్పందం
 బీజేపీతో ఎంఐఎం చీకటి ఒప్పందం చేసుకున్నదని ఉత్తమ్ ఆరోపించారు. పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎంఐఎం పనిచేసిందన్నారు. హైదరాబాద్‌లోని కొన్ని డివిజన్ల లో ఎంఐఎంతో, మరికొన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌తో మాత్రమే తమకు పోటీ ఉందన్నారు. టీడీపీ తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి అదృశ్యమవుతోందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్, మజ్లిస్ మినహా మిగతా పార్టీలతో మద్దతుకోసం చర్చలు జరుగుతున్నాయని... కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందనే విశ్వాసం ఓటర్లలో పెరిగిందని, మేయర్ పీఠం తమకే వస్తుందని పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement