బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలి | Telangana: MP Demands Cancelling Singareni Coal Block Auction | Sakshi
Sakshi News home page

బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలి

Published Thu, Dec 8 2022 2:01 AM | Last Updated on Thu, Dec 8 2022 2:01 AM

Telangana: MP Demands Cancelling Singareni Coal Block Auction - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌  ఎంపీలు నామా, రంజిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలంపై రాష్ట్ర ఎంపీలు బుధవారం లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయా లని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌సీసీఎల్‌)కే బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరారు.

లోక్‌సభలో సింగరేణి అంశాన్ని ‘అత్యవసర’ అంశంగా లేవనెత్తిన ఉత్తమ్‌.. కల్యాణ ఖని బ్లాక్‌–6, కోయగూడెం బ్లాక్‌– 3, సత్తుపల్లి బ్లాక్‌–3, శ్రావణపల్లి బ్లాకులను వేలం వేయడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఈ బొగ్గు బ్లాకులు 100 ఏళ్ల నాటి ప్రభుత్వరంగ బొగ్గు గనుల సంస్థ ఎస్‌సీసీఎల్‌కు చెందిన ప్రస్తుత బొగ్గు గనులతో కలసి ఉన్నాయన్నారు. మోదీ ప్రైవేటీక రణ చేయబోమని హామీ ఇచ్చారని, అయినా కేంద్ర ప్రభుత్వం వేలం వేసేందుకే ముందుకు వెళుతోందన్నారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ. ఇలాంటి చర్యలతో కేంద్రం తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీస్తోందని మండిపడ్డారు.  

సింగరేణిని కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తోంది 
సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని, ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలాన్ని నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో సింగరేణికి బొగ్గు గనులు దక్కకుండా చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు.

ఢిల్లీలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి నామా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపు అని విమర్శించారు. సింగరేణికి సంబంధించి కేంద్రం వాటా 49 శాతమేనని, దానిని కూడా తెలంగాణనే తీసుకుంటుందని నామా అన్నారు. తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసి, దేశమంతటికీ తెలియజేస్తామని పేర్కొన్నారు. రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నప్పటికీ.. విధానపరమైన నిర్ణయాలను మాత్రం కేంద్రమే తీసుకుంటోందన్నారు. కొత్త బ్లాకులను రాష్ట్ర ప్రభు త్వానికే కేటాయించాల్సిందిగా కోరామని అన్నారు.  

ఆరోపణలు నిరాధారం: కేంద్ర మంత్రి జోషి  
సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ ఎంపీల ఆరోపణలు నిరాధారమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు. రాష్ట్ర ఎంపీల ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉండగా, 49% వాటా కలిగిన కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

అయితే గనుల వేలం విష యంలో కేంద్రం.. ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టం –1957 నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో కళ్యాణఖని బ్లాక్‌–6, కోయగూడెం బ్లాక్‌–3, సత్తుపల్లి బ్లాక్‌–3, శ్రావణపల్లి గనుల వేలం ప్రక్రియలో సింగరేణితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనవచ్చని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. లోక్‌సభలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు.

ఈ నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి, వాటిని ఎస్‌సీసీఎల్‌కు కేటాయించాలని తెలంగాణ అభ్యర్థించినా.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న విధానం ప్రకారం బొగ్గు విక్రయానికి అన్ని కోల్‌ బ్లాకులను వేలం పద్ధ తిలోకి తెచ్చామన్నారు. గనుల వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళుతుందని, బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని మంత్రి విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement