
సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఆ భూములపై హక్కులు కల్పించాల్సింది పోయి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 18,665 ఎకరాల భూములను వారి నుంచి లాక్కున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 1,950 మంది గిరిజనుల నుంచి ఈ భూములను లాక్కున్నారని ఆయన చెప్పారు. శనివారం టీపీసీసీ ఎస్టీ సెల్, కిసాన్‌సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన అటవీభూముల హక్కులపై రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ భూములపై హక్కుల కల్పన కోసం గిరిజనుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చా రు. అటవీభూములకు పోడు భూములనే పేరు పెట్టి వాటిపై గిరిజనులకు హక్కులు కల్పించకుండా టీఆర్‌ఎస్ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమిని గిరిజనులకు పంపిణీ చేశామని, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్, రాములు నాయక్, కోదండరెడ్డి, మంగీలాల్ నాయక్, చారులతా రాథోడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment