సాక్షి, హైదారాబాద్: కాంగ్రెస్ నేత జానారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరును తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తప్పుబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014కి ముందు ప్రారంభమైన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులను సందర్శించాలంటే పోలీసులు అడుగడుగనా అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. దీనిపై కనీసం డీజీపీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏ చట్టం ప్రకారం కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తాము ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా పని చేశామని తెలిపారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏమైనా ఆధారాలు చూపమంటే పైనుంచి ఆదేశాలు అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అందరినీ గుర్తు పెట్టుకుంటామని, పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని ఉత్తమ్ అన్నారు. పోలీసులు చెంచాగిరి చేయడం మంచిది కాదన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద దీక్ష కోసం వారం రోజుల కింద సమాచారం ఇచ్చారని తెలిపారు. కనీసం ముగ్గురికైనా అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కానీ అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తమ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులను సందర్శిస్తామని అడిగినా పట్టించుకోలేదన్నారు. తమ సొంత జిల్లాలో కూడా ప్రాజెక్టులను చూడనివ్వలేదని దుయ్యబట్టారు. ఇది నియంత పాలన అని ఎన్నికల సమయంలో ప్రాజెక్ట్‌లపై ఏమి చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ నేతలు అధికార గర్వంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కమిషన్లు రావనే ఉద్దేశంతో పాత ప్రాజెక్టుల జోలికి పోవడం లేదని ఉత్తమ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment