
తొలి అడుగు పడింది...: కేటీఆర్
హైదరాబాద్ : ఏడాది కాలంలో ఎన్నో సవాళ్లను తెలంగాణ ప్రభుత్వం అధిగమించిందని ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో 'అమెరికా పర్యటన'పై ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించామని, అన్ని రంగాల సమన్వయంతో ముందుకు వెళుతున్నామన్నారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మీట్ ది ప్రెస్లో పాల్గొన్నట్లు ఆయన అన్నారు. సంవత్సరం కిందట ఎన్నో రకాలు అనుమానాలు, అపోహలు, ఉత్సాహం, రకరకాల భావోద్వేగాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అసాధారణ పరిస్థితుల మధ్య ఏర్పడ్డ రాష్ట్రమని, కొత్త రాష్ట్రం మీద తెలంగాణ ప్రజలకు కోటి ఆశలు, మరోవైపు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారికి కోటి అనుమానాలు ఉన్నాయన్నారు.
దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తొలి ఏడాదిలో ఎలా నిలదొక్కుకుంటుందనే అనేక సంశయాల మధ్య తాము మొదటి అడుగు వేయటంలో విజయం సాధించామన్నారు. ఇక తన శాఖకు సంబంధిస్తే ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల విషయంలో రెండు శాఖలను మేళవించుకుని సక్సెస్ఫుల్గా ముందుకు పోయామన్నారు. దేశంలోనే ఓ మోడల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్, ఐటీ ఇండస్ట్రీపై ఎన్నో ప్రచారాలు జరిగినా, అవన్నీ ఒట్టి అపోహలే అని తేలిపోయిందన్నారు.
సంవత్సర కాలంలో హైదరాబాద్ నగరంలో ఒక చిన్న అవాంఛనీయ ఘటనలు లేకుండా శాంతిభద్రతలను పరరక్షించామన్నారు. ఐటీ రంగంలోకి వస్తే నాలుగు లక్ష్యాలతో ముందుకు వెళ్లామని, హైదరాబాద్లో ఐటీ రంగాన్ని విస్తరించటంతో పాటు, రాబోయే అయిదేళ్లలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశంలోనే అతిపెద్ద టెక్నాలజీని ప్రారంభిస్తామన్నారు. అలాగే వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూసామన్నారు. అలాగే ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ రంగంలోనే తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.