ktr america tour
-
హైదరాబాద్‌లో డ్రీమ్ వర్క్స్ థీమ్ పార్క్
*తెలంగాణలో ప్రఖ్యాత హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్ వర్క్స్ థీమ్ పార్క్ *హైదరాబాద్‌లో హై ఎండ్ ఎకో సిస్టమ్ థియేటర్ ఏర్పాటు *తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామన్న డ్రీమ్ వర్క్స్ *టీ హబ్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిన లాస్ ఏంజెల్స్ క్లీన్ టెక్ ఇన్ క్యుబేటర్ *ఐదో రోజు లాస్ ఏంజెల్స్ లో విజయవంతమైన మంత్రి కేటీఆర్ పర్యటన హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకొస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ అయిన డ్రీమ్ వర్క్స్, తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంచుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా అయిదో రోజు లాస్ ఏంజెల్స్ లో పర్యటించిన ఐటీ,పురపాల శాఖ మంత్రి కె.తారకరామారావు, డ్రీమ్ వర్క్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సీఈవో జెఫ్రీ కాట్జన్ బర్గ్ ను కలుసుకున్న కేటీఆర్, ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు గురించి వివరించారు. భారత్ లో డ్రీమ్ వర్క్స్ సంస్థను విస్తరించే ఆలోచనలు ఉన్నాయన్న జెఫ్రీ, సమర్థ నాయకత్వంలో ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామన్నారు. తమ దీర్ఘకాలిక ప్రణాళికల అమలులో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కోరుతున్నామన్నారు. అంతేకాకుండా తమ సినిమాల ప్రమోషన్ కోసం హైఎండ్ ఎకో సిస్టమ్ తో ఒక థియేటర్ ను నిర్మిస్తామని అందుకు సహకరించాలని మంత్రిని జెఫ్రీ కోరారు. డ్రీమ్ వర్క్స్ కు చేతనైనంత సహాయం చేస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డ్రీమ్ వర్క్స్ విస్తరణకు అంతర్జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్‌లో నిర్మించే ఫిల్మ్ సిటీకి అత్యంత అనుకూలంగా ఉంటుందన్నారు. ఇక పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్ లో చిన్నతరహా థీమ్ సెంటర్, డ్రీమ్ ప్లేను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డ్రీమ్ వర్క్స్ ఈ సమావేశంలో నిర్ణయించాయి. హైదరాబాద్ వచ్చి భారత మార్కెట్ అవసరాలు, స్థానిక నైపుణ్యాన్ని పరిశీలించాలని జెఫ్రీని మంత్రి కేటీఆర్ కోరారు. అనంతరం కేటీఆర్ లాస్ ఏంజెల్స్ ఇన్నోవేషన్ సెంటర్ క్లీన్ టెక్ ఇంక్యుబేటర్ ను సందర్శించారు. నీటి సంరక్షణతో పాటు మురుగునీటి శుద్దిలో వినూత్నమైన పద్దతులను అవలంబిస్తున్న క్లీన్ టెక్ పనితీరు, విజయవంతమైన తీరును అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన టీ హబ్ గురించి వివరించి తగిన సహకారం అందించాలని, కలిసి పనిచేయాలని కోరారు. ఇంక్యుబేటర్ సీఈఓను హైదరాబాద్ రావాలని మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. -
తొలి అడుగు పడింది...: కేటీఆర్
హైదరాబాద్ : ఏడాది కాలంలో ఎన్నో సవాళ్లను తెలంగాణ ప్రభుత్వం అధిగమించిందని ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'అమెరికా పర్యటన'పై ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించామని, అన్ని రంగాల సమన్వయంతో ముందుకు వెళుతున్నామన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నట్లు ఆయన అన్నారు. సంవత్సరం కిందట ఎన్నో రకాలు అనుమానాలు, అపోహలు, ఉత్సాహం, రకరకాల భావోద్వేగాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అసాధారణ పరిస్థితుల మధ్య ఏర్పడ్డ రాష్ట్రమని, కొత్త రాష్ట్రం మీద తెలంగాణ ప్రజలకు కోటి ఆశలు, మరోవైపు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారికి కోటి అనుమానాలు ఉన్నాయన్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తొలి ఏడాదిలో ఎలా నిలదొక్కుకుంటుందనే అనేక సంశయాల మధ్య తాము మొదటి అడుగు వేయటంలో విజయం సాధించామన్నారు. ఇక తన శాఖకు సంబంధిస్తే ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల విషయంలో రెండు శాఖలను మేళవించుకుని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు పోయామన్నారు. దేశంలోనే ఓ మోడల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్, ఐటీ ఇండస్ట్రీపై ఎన్నో ప్రచారాలు జరిగినా, అవన్నీ ఒట్టి అపోహలే అని తేలిపోయిందన్నారు. సంవత్సర కాలంలో హైదరాబాద్ నగరంలో ఒక చిన్న అవాంఛనీయ ఘటనలు లేకుండా శాంతిభద్రతలను పరరక్షించామన్నారు. ఐటీ రంగంలోకి వస్తే నాలుగు లక్ష్యాలతో ముందుకు వెళ్లామని, హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని విస్తరించటంతో పాటు, రాబోయే అయిదేళ్లలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశంలోనే అతిపెద్ద టెక్నాలజీని ప్రారంభిస్తామన్నారు. అలాగే వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూసామన్నారు. అలాగే ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ రంగంలోనే తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.