
'లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడిగే రాజకీయ పార్టీలను ప్రజలు బహిష్కరించాలని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ మత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు.
బుధవారం ఆమె 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో మాట్లాడుతూ... హైదరాబాద్ లో నివసిస్తున్నవారందరూ తమవాళ్లేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ సమదృష్టితో చూస్తున్నారని, ఎటువంటి వివక్ష చూపించడం లేదని తెలిపారు. 'మన నగరం.. మన పార్టీ' తమ నినాదం అన్నారు. టీఆర్‌ఎస్ ఎప్పటికీ ప్రజల పార్టీయేనని స్పష్టం చేశారు.
లోకం తెలియని నారా లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 'కారు'లో ప్లేస్ ఉన్న కారణంగానే చాలా మంది నాయకులు 'సైకిల్' వదిలి తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కవిత దీమా వ్యక్తం చేశారు.