మూడేళ్లు నేనే సీఎం | i am the cm ofter 3 years - Chief Minister Siddaramaiah | Sakshi
Sakshi News home page

మూడేళ్లు నేనే సీఎం

Published Thu, May 14 2015 2:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మూడేళ్లు నేనే సీఎం - Sakshi

మూడేళ్లు నేనే సీఎం

రెండేళ్లలో 100 హామీలను నెరవేర్చాం
కబ్జాకోరులపై క్రిమినల్ చర్యలు
గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత  మంత్రి వర్గం విస్తరణ
 ‘మీట్ ది ప్రెస్’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

 
బెంగళూరు: ‘మిగిలిన మూడేళ్లు నేనే సీఎం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. రానున్న ఎన్నికల్లోనూ నేను పోటీచేస్తాను. కర్ణాటకను కాంగ్రెస్ రహిత రాష్ట్రంగా చేస్తామంటూ కలలుకంటున్న బీజేపీ నేతలకు వాస్తవాలను తెలియజెప్పడం కోసమే రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి బుధవారంతో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రెస్‌క్లబ్ ఆఫ్ బెంగళూరు, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారమిక్కడి ప్రెస్‌క్లబ్ ఆవరణలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సిద్ధరామయ్య పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎన్నికలకు ముందు తాము ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రజలకు 165 హామీలను ఇచ్చామని, వీటిలో ఈ రెండేళ్లలోనూ 100 హామీలను పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక కోటి ఎనిమిది లక్షల కుటుంబాలకు బీపీఎల్ కార్డుల ద్వారా అన్నభాగ్య పథకాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు నాలుగు కోట్ల మంది పేదలు లబ్ది పొందుతున్నారని వెల్లడించారు.  రాష్ట్రంలోని కోటి మంది చిన్నారులకు ‘క్షీరభాగ్య’ ద్వారా ప్రయోజనం చేకూరుతోందని అన్నారు.

అయితే ఇవేవీ ప్రతిపక్షాలకు కనిపించక పోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ అసలు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో గుర్తు తెచ్చుకోవాలంటూ హితవు పలికారు. పాలనా అవృసరాల దష్ట్యా బీబీఎంపీని విభజిస్తామని బీజేపీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. ఇప్పుడు బీబీఎంపీని విభజిస్తామంటే బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములతో పాటు చెరువులను ఆక్రమించుకున్న కబ్జాదారులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కూడా నిర్దాక్షిణ్యంగా క్రిమినల్ కేసులను నమోదు చేయనున్నట్లు తేల్చి చెప్పారు. ఇళ్లను కోల్పోయిన పేదలకు పునర్వసతి కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించడం ద్వారా ఇప్పటి వరకు 4,052 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వం అనుసరించిన పారిశ్రామిక విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు సైతం పెరిగాయని  పేర్కొన్నారు.

హోరీ మోటార్స్ సంస్థ ఒక్కటి ఆంధ్రప్రదేశ్‌కు తరలి పోయినంత మాత్రాన అన్ని పరిశ్రమలు తరలిపోయాయనడం సరికాదని తెలిపారు. ఐఏఎస్ అధికారి డి.కె.రవి కేసు ప్రస్తుతం సీబీఐ పరిధిలో ఉన్నందున ఈ విషయం పై తానేమీ మాట్లాడలేనని అన్నారు.  గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తై తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement