
టీఆర్‌ఎస్‌కు హైదరాబాద్‌లో బలమేదీ?
♦ ఫిరాయింపులపైనే అది ఆధారపడుతోంది
♦ ఎంఐఎం మెప్పు కోసమే అబద్ధపు ప్రచారం
♦ మీట్ ద ప్రెస్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు బలమెక్కడిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ చాలా బలహీనంగా ఉందని, ఆ పార్టీకి ఎక్కడా నిర్మాణమే లేదన్నారు. దేశంలోనే బీజేపీ కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ, నగరాల్లోనూ బీజేపీ అధికారంలో ఉందన్నారు.
హైదరాబాద్‌కు, బీజేపీకి అవినాభావ సంబంధముందన్నారు. గ్రేటర్ పగ్గాలను బీజేపీకి అప్పగిస్తే, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం నిధులు భారీగా తెస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. గ్రేటర్‌లో బీజేపీకి, టీడీపీకి స్థానికంగా కార్యకర్తలు, నేతలు ఉన్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు
. కేవలం ఇతర పార్టీల నుంచి ప్రజా ప్రతినిధులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడమే 18 నెలల నుంచి టీఆర్‌ఎస్ పనిగా పెట్టుకుందన్నారు. హైదరాబాద్ మినీ ఇండియా అని, విభిన్న సంస్కృతులకు నిలయమని అన్నారు. ఐసిస్ వంటి తీవ్రవాద సంస్థలకు హైదరాబాద్‌లో సానుభూతిపరులు ఉన్నట్టుగా తేలుతోందని, దీనిపై భద్రతా, నిఘా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ నేతల బోగస్ ప్రచారం
హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు తెస్తున్నామంటూ టీఆర్‌ఎస్ నేతలు బోగస్ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రెండు బెడ్‌రూముల ఇళ్లను ఇస్తామంటూ టీఆర్‌ఎస్ బస్తీ ప్రజలను మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నా ప్రచారం చేయడం లేదన్నారు. కేజీ టు పీజీ ఉచితవిద్య, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కాడన్నారు.
ఎంఐఎం మెప్పు కోసం టీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తున్నదని, బీజేపీపై అబద్ధాలతో ప్రచారం చేస్తున్నదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్ పార్టీలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని ఇటు కేసీఆర్ కుటుంబం, అటు ఒవైసీ కుటుంబాలు పంచుకోవడానికి కుట్రలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అకారణంగా కేసీఆర్, కేసీఆర్ కుటుంబసభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీని గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. 100 సీట్లు లక్ష్యంగా గ్రేటర్ ఎన్నికల్లో పనిచేస్తామన్నారు. మీడియా స్వేచ్ఛను ముఖ్యమంత్రి కేసీఆర్ హరిస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో సవాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తే బాగుంటుందని కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రా ప్రజలంతా రాక్షసులు అంటూ మాట్లాడిన కేసీఆర్ మాటలను ప్రజలు మర్చిపోలేదన్నారు. హిందూ దేవుళ్లను అవమానించిన అక్బరుద్దీన్‌పై ఎందుకు కేసులు పెట్టలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎన్.రామచందర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, యూనియన్ నేతలు క్రాంతి కిరణ్, పల్లె రవికుమార్, పి.వి.శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు.