రాష్ట్రానిదే తుది నిర్ణయం :వెంకయ్యనాయుడు | state government have the final decision on capital location | Sakshi
Sakshi News home page

రాష్ట్రానిదే తుది నిర్ణయం :వెంకయ్యనాయుడు

Published Fri, Sep 5 2014 4:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

రాష్ట్రానిదే తుది నిర్ణయం :వెంకయ్యనాయుడు - Sakshi

రాష్ట్రానిదే తుది నిర్ణయం :వెంకయ్యనాయుడు

ఏపీ రాజధానిపై వెంకయ్యనాయుడు వెల్లడి
 
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, కేంద్రం ఇందులో జోక్యం చేసుకోజాలదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ‘విభిన్న వర్గాల అభిప్రాయాలు, విభిన్న అంశాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అంశమైనందున రాజధాని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేశాం..’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
సమయపాలన.. చాలా కీలకం..
మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లో వంద అడుగులు వేసిందని వెంకయ్య వివరించారు. ‘వంద రోజులనేది పెద్ద విషయం కాకపోయినప్పటికీ ఈ స్వల్ప సమయంలో ప్రభుత్వ పనితీరును అంచనావేయవచ్చు. దేశంలో మళ్లీ పరిపాలన అనేది కనిపించడం పెద్ద అడుగు. అలాగే దేశానికి ఒక నాయకుడు లభించడం పెద్ద అడుగు. దేశంలో మళ్లీ అభివృద్ధి మొదలవడం ఒక పెద్ద అడుగు..’ అని పేర్కొన్నారు.

‘సమయ పాలన వంటి చిన్న చిన్న విషయాలను కూడా మోడీ పట్టించుకుంటున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. పరిపాలనలో అది కీలకమైన విషయమే..’ అని పేర్కొన్నారు. తొలి బడ్జెట్ సమావేశాలు పూర్తిగా అర్థవంతంగా సాగాయని వివరిస్తూ, అందుకు సంబంధించి వివిధ అంశాలతో ప్రచురితమైన ఒక బుక్‌లెట్‌ను ఆయన ఆవిష్కరించారు. స్మార్ట్ నగరాల పథకం విధివిధానాల కసరత్తు చివరి దశలో ఉందని, వాటిని ఖరారుచేసేందుకు రాష్ట్రాలతో త్వరలో సమావేశం ఏర్పాటుచేయనున్నామన్నారు.
 
అన్ని రాష్ట్రాలనూ కేంద్రం సమదృష్టితో చూస్తుంది..

టీడీపీ భాగస్వామిగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని టీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలపై కేంద్రం వైఖరి ఏంటని ప్రశ్నించగా ‘అదొక అపోహ మాత్రమే. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమ దృష్టితో చూస్తుంది. నేను తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా చెప్పాను. ఏ అవసరాలపైనైనా ప్రతిపాదనలు పంపాలని చెప్పాను. నిబంధనలకు అనుగుణంగా తప్పనిసరిగా ఆమోదం తెలుపుతాం. మాపై ఆరోపణలు చేయడం తగదు..’ అని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement