‘ఆ మాటకు కట్టుబడి ఉన్నా.. వాళ్లను వదలం’
హైదరాబాద్: తప్పు చేసిన ఉద్యోగులు తప్పించుకోలేరన్న మాటకు కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. కొందరు ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీకి ఓటేసిన ప్రజలను వేధిస్తున్న అధికారులను ప్రశ్నించకూడదా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఉద్యోగులను సమర్థించాలా అని ప్రశ్నించారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి జరిగినప్పుడు ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఏమయ్యారని నిలదీశారు. విజయవాడలో ఆర్టీఏ అధికారిపై అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే దౌర్జన్యం చేసినప్పుడు ఉద్యోగ సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని అడిగారు.
నేను ఇబ్బంది పెట్టినట్టు నా నియోజకవర్గంలో ఒక్క ఉద్యోగినైనా ఒప్పించగలరా అని సవాల్ విసిరారు. 90 శాతం మంది ఉద్యోగులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారులను మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు.