స్వచ్ఛ రాజకీయాలకు పట్టం కట్టండి
* అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి
* ‘మీట్ ది ప్రెస్’లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
* ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం
* సెటిలర్లపై టీఆర్‌ఎస్ పార్టీకి స్థిరత్వం లేదు
* టీఆర్‌ఎస్ నేతలు సెటిలర్లపై ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు
సాక్షి, హైదరాబాద్: ‘‘అధికార, ప్రతిపక్ష పార్టీ లు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఓడిపోయిన పార్టీల వాళ్లు.. గెలిచిన పార్టీల్లో చేరుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న వారు.. ఐదేళ్లు కూడా ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. జనాన్ని దోచుకున్నా పర్వాలేదుగానీ.. విమర్శించే ప్రతిపక్షం ఉండకూడదని అధికార పక్షం భావిస్తోంది. ఈ ధోరణులు పరోక్షంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
ఇలాంటి పార్టీలను ప్రోత్సహించటం సరికాదు. అందుకే ‘గ్రేటర్’ ఎన్నికల్లో స్వచ్ఛ రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టాలి. అవినీతికి వ్యతిరేకంగా ‘వన్ హైదరాబాద్’ కూటమితో లోక్‌సత్తా, వామపక్షాలు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌గా పోటీ చేస్తున్నాయి’’ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో తమ్మినేని ప్రసంగించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో బూర్జువా పార్టీల అజెండా అంతా ఒక్కటిగా మారిందని, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో.. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అవే చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. ఇంకో పార్టీలో మంత్రిగా పనిచేస్తున్నారని.. ఈ భ్రష్టు విధానాలను రాజకీయ వ్యభిచారం అనకుండా ఏమనగలమని ప్రశ్నించారు. దీనికి ప్రత్యామ్నాయం చూపటమనేది.. నిజమైన రాజకీ యవాదులపై ఉన్న బాధ్యత అని చెప్పారు. వామపక్షాలకు ప్రత్యామ్నాయ విధానాలు ఉండటం వల్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన లోక్‌సత్తాతో కలసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఓటర్లు స్వచ్ఛ రాజకీయాలవైపు మళ్లాలని ఈ సందర్భంగా తమ్మినేని పిలుపునిచ్చారు. వన్ హైదరాబాద్ కూటమి 90 స్థానాల్లో పోటీ చేస్తోందని, మిగతా 60 స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. ఈ కూటమికి మేయ ర్ పీఠం దక్కక పోయినా.. ఎక్కువ స్థానాలను సాధించటానికి కృషి చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోందని, టీడీపీ-బీజేపీ కూటమికి ఆ సత్తా లేదని తమ్మినేని విమర్శించారు.
సెటిలర్లపై స్థిరత్వం లేదు...
సెటిలర్లపై టీఆర్‌ఎస్‌కు స్థిరత్వం లేదని తమ్మినేని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలు సెటిలర్లపై ఎప్పుడేం మాట్లాడతారో.. వారికే తెలియదన్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికుల జీతాల పెంపు కోసం తాము ఉద్యమిస్తే.. ఆంధ్ర కుక్కలని సీఎం కేసీఆర్ నిందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నుతానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై నోటుకు ఓటుకు సంబంధించి ఎన్నో విమర్శలు చేసిన కేసీఆర్ అమరావతి సభలో ఆయన గురించి గొప్పలు చెప్పారని దుయ్యపట్టారు.
అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కాదు..
ప్రజాసేవ.. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, రోడ్లు, కులానికో భవనం, ఎతైన భవనాలు కట్టటం కాదని, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వాస్తవమైన అభివృద్ధిని చూపాల్సిన అవసరం ఉందని తమ్మినేని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్నికల వరకు మాత్రమే పరిమితమన్నారు. టీడీపీ-బీజేపీ కూటమి నగరాన్నిగానీ, తెలంగాణనుగానీ అభివృద్ధి చేస్తుందం టే.. అది భ్రమే అవుతుందని తమ్మినేని ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వ పోకడలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్పారు.
టీఆర్‌ఎస్‌పై ఇంకా భ్రమలున్నాయి
టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఇంకా భ్రమలున్నాయని తమ్మినేని అభిప్రాయపడ్డారు. సెంటిమెంట్ అభిమానం కొనసాగుతోందని, ఈ సానుకూలతతో పాలనా వైఫల్యాలను సరి చేసుకుంటే మంచిదన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కారణంగానే ప్రజలు తమ వైపు ఉన్నారని టీఆర్‌ఎస్ భావిస్తే పప్పులో కాలేసినట్టే అని చెప్పారు. ఈ కార్యక్రమం లో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు సోమ య్య, బసవపున్నయ్య, పద్మరాజు, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, సీపీఎం నేతలు డీజీ నర్సింహారావు, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.