CPI (M) Telangana Committee
-
ఏ హామీలనూ నెరవేర్చని టీఆర్ఎస్: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు వేటినీ ఇప్పటివరకు టీఆర్ఎస్ అమలుచేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు. ప్రజాస్వామిక హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. నిరసన తెలిపే హక్కును కూడా అంగీకరించడం లేదన్నారు. అనేక సమస్యలపై జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. రైతుబంధు పథకంతో సన్న, చిన్నకారు రైతులకంటే భూస్వాములకే ఎక్కువ మేలు జరుగుతోందన్నారు. పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులపై దాడులు ఆపాలని, వారిని భూముల నుంచి తొలగించే కుట్రలను మానుకోవాలన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ఓటర్ల చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. -
‘కేరళ రాజకీయం’పై హైదరాబాద్‌లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : గడిచిన కొన్ని ఏళ్లుగా కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హత్యారాజకీయాలపై బీజేపీ, సీపీఎం తెలంగాణ శాఖలు పోటాపోటీ ప్రదర్శనలకు దిగడంతో సోమవారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లోయర్ ట్యాంక్‌బండ్ ఇందిరాపార్క్ వద్ద గుమ్మికూడిన బీజేపీ శ్రేణులు.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం(బసవపున్నయ్య భవన్) వైపునకు ర్యాలీగా బయలుదేరారు. అటు సీపీఎం శ్రేణులు సైతం పోటీ ర్యాలీకి సిద్ధమయ్యారు. అసలు ఈ రెండు పార్టీల ర్యాలీలకు అనుమతులే లేవంటూ పోలీసులు ఇరువర్గాలనూ అడ్డుకున్నారు. కాగా, ఇందిరాపార్క్ సమీపంలోనే బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు నాయకత్వం వహించిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ల, మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతావారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ ఆందోళన పిలుపును ముందే ఇవ్వడంతో సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఎం అధికారంలో ఉన్న కేరళలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలకు నిరసనగా తెలంగాణ బీజేపీ శాఖ ఈ ఆందోళన చేపట్టింది. అటు సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జాతీయ నాయకుడు అజీజ్ పాషాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘కేరళ రాజకీయం’పై హైదరాబాద్‌లో ఉద్రిక్తత
-
అబద్ధాలు చెప్పడంలో సీఎం నెంబర్ వన్!
-
అబద్ధాలు చెప్పడంలో సీఎం నెంబర్ వన్!
అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్ వన్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరన్నారు. రెండు గ్రామాల్లో 500 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించడానికి అయిన ఖర్చు కంటే, దాన్ని ప్రచారం చేసుకోడానికి ఎక్కువ ఖర్చు చేశారని వీరభద్రం మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీల డబ్బులను కూడా వాడుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికల హామీలను ఉల్లంఘిస్తే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు. -
కేసీఆర్.. నా వెంట రా!
గ్రామాల దుస్థితి చూపిస్తా: తమ్మినేని లింగాల: ‘కేసీఆర్ నా వెంట రా.. లేదా నీ కొడుకు, అల్లుడినైనా నా వెంట పంపు.. గ్రామాల దుస్థితి చూపిస్తా’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. సీపీఎం మహాజన పాదయాత్ర శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల, పెద్దకొత్తపల్లి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఏర్పడితే బాగుపడతామని ఎంతగానో ఆశిం చారని, నేడు గ్రామాల్లో కరువు విలయతాండవం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రెండున్నర ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ అధికార దాహంతో తానే సీఎం అయ్యాడని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి, లక్ష ఉద్యోగాలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సీపీఎం వేట కుక్కలా వెంటపడుతుందన్నారు. సీపీఎం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. -
స్వచ్ఛ రాజకీయాలకు పట్టం కట్టండి
* అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి * ‘మీట్ ది ప్రెస్’లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని * ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం * సెటిలర్లపై టీఆర్ఎస్ పార్టీకి స్థిరత్వం లేదు * టీఆర్ఎస్ నేతలు సెటిలర్లపై ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు సాక్షి, హైదరాబాద్: ‘‘అధికార, ప్రతిపక్ష పార్టీ లు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఓడిపోయిన పార్టీల వాళ్లు.. గెలిచిన పార్టీల్లో చేరుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న వారు.. ఐదేళ్లు కూడా ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. జనాన్ని దోచుకున్నా పర్వాలేదుగానీ.. విమర్శించే ప్రతిపక్షం ఉండకూడదని అధికార పక్షం భావిస్తోంది. ఈ ధోరణులు పరోక్షంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇలాంటి పార్టీలను ప్రోత్సహించటం సరికాదు. అందుకే ‘గ్రేటర్’ ఎన్నికల్లో స్వచ్ఛ రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టాలి. అవినీతికి వ్యతిరేకంగా ‘వన్ హైదరాబాద్’ కూటమితో లోక్‌సత్తా, వామపక్షాలు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌గా పోటీ చేస్తున్నాయి’’ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో తమ్మినేని ప్రసంగించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో బూర్జువా పార్టీల అజెండా అంతా ఒక్కటిగా మారిందని, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో.. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అవే చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. ఇంకో పార్టీలో మంత్రిగా పనిచేస్తున్నారని.. ఈ భ్రష్టు విధానాలను రాజకీయ వ్యభిచారం అనకుండా ఏమనగలమని ప్రశ్నించారు. దీనికి ప్రత్యామ్నాయం చూపటమనేది.. నిజమైన రాజకీ యవాదులపై ఉన్న బాధ్యత అని చెప్పారు. వామపక్షాలకు ప్రత్యామ్నాయ విధానాలు ఉండటం వల్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన లోక్‌సత్తాతో కలసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు స్వచ్ఛ రాజకీయాలవైపు మళ్లాలని ఈ సందర్భంగా తమ్మినేని పిలుపునిచ్చారు. వన్ హైదరాబాద్ కూటమి 90 స్థానాల్లో పోటీ చేస్తోందని, మిగతా 60 స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. ఈ కూటమికి మేయ ర్ పీఠం దక్కక పోయినా.. ఎక్కువ స్థానాలను సాధించటానికి కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోందని, టీడీపీ-బీజేపీ కూటమికి ఆ సత్తా లేదని తమ్మినేని విమర్శించారు. సెటిలర్లపై స్థిరత్వం లేదు... సెటిలర్లపై టీఆర్ఎస్కు స్థిరత్వం లేదని తమ్మినేని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు సెటిలర్లపై ఎప్పుడేం మాట్లాడతారో.. వారికే తెలియదన్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల జీతాల పెంపు కోసం తాము ఉద్యమిస్తే.. ఆంధ్ర కుక్కలని సీఎం కేసీఆర్ నిందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నుతానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై నోటుకు ఓటుకు సంబంధించి ఎన్నో విమర్శలు చేసిన కేసీఆర్ అమరావతి సభలో ఆయన గురించి గొప్పలు చెప్పారని దుయ్యపట్టారు. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కాదు.. ప్రజాసేవ.. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, రోడ్లు, కులానికో భవనం, ఎతైన భవనాలు కట్టటం కాదని, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వాస్తవమైన అభివృద్ధిని చూపాల్సిన అవసరం ఉందని తమ్మినేని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్నికల వరకు మాత్రమే పరిమితమన్నారు. టీడీపీ-బీజేపీ కూటమి నగరాన్నిగానీ, తెలంగాణనుగానీ అభివృద్ధి చేస్తుందం టే.. అది భ్రమే అవుతుందని తమ్మినేని ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వ పోకడలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్పై ఇంకా భ్రమలున్నాయి టీఆర్ఎస్పై ప్రజల్లో ఇంకా భ్రమలున్నాయని తమ్మినేని అభిప్రాయపడ్డారు. సెంటిమెంట్ అభిమానం కొనసాగుతోందని, ఈ సానుకూలతతో పాలనా వైఫల్యాలను సరి చేసుకుంటే మంచిదన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కారణంగానే ప్రజలు తమ వైపు ఉన్నారని టీఆర్ఎస్ భావిస్తే పప్పులో కాలేసినట్టే అని చెప్పారు. ఈ కార్యక్రమం లో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు సోమ య్య, బసవపున్నయ్య, పద్మరాజు, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, సీపీఎం నేతలు డీజీ నర్సింహారావు, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
'కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నైజాన్ని కోల్పోయింది'
హైదరాబాద్ : మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకుంటే ఆగస్టు మొదటివారంలో 'ఛలో హైదరాబాద్'కి పిలుపు ఇస్తామని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్ లో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నైజాన్ని కోల్పోయిందని ఆరోపించారు. వరంగల్‌కు త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పది వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల బరిలో నిలబెడతామని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై నిపుణులు, అఖిలపక్షంతో చర్చించాలని తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం నీటి ప్రాజెక్ట్ డిజైన్లు మార్చవద్దంటూ కేసీఆర్ ప్రభుత్వానికి తమ్మినేని వీరభద్రం హితవు పలికారు. -
'కేసీఆర్ తిక్క పనులు చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిక్క పనులు చేస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఊడ్చేయడానికి కార్మికులు సిద్ధం కావాలని ఆయన మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఆయన మద్దతు ప్రకటించారు. కార్మికులు లేకుండా స్వచ్ఛ భారత్ సాధ్యమా ?.. చీపుర్లతో ఫొటోలు దిగితే స్వచ్ఛ భారత్ అవుతుందా అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్నికి తమ్మినేని ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్ నగరంలో కంపునకు సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని... కార్మికులను మాత్రం తిట్టవద్దని నగర వాసులకు తమ్మినేని వీరభద్రం సూచించారు. హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్మికులు శనివారం చేపట్టిన ధర్నాలో 7 కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ ధర్నాకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతు ప్రకటించాయి. -
ఏం చేస్తారో అడిగి ఓటేయండి: తమ్మినేని వీరభద్రం
తెలంగాణ తెచ్చాం.. ఇచ్చామనే వాళ్లకు ఓటొద్దు: తమ్మినేని వీరభద్రం సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ తెచ్చాం.. ఇచ్చామనే నినాదానికి ఓటేయకండి. వచ్చిన తెలంగాణకు ఏమి చేస్తారనే దానికి ఓటేయండి. వచ్చే ఎన్నికల్లో మా నినాదం ఇదే’ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినంత మాత్రాన ఆ వర్గాలకు సామాజిక న్యాయం దక్కినట్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయమంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు టికెట్లు ఇవ్వడమే కాదన్నారు. దళితుడు సీఎం అయితే తమకూ సంతోషమేనని, అయితే ఆ వ్యక్తులు దళితులకు ఉపయోగపడే వారా? కాదా? అన్నది ముఖ్యమన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది మీడియా కార్యక్రమంలో వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన పూర్తయినందున తమ పార్టీ ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిదని చెప్పారు. కొందరి లబ్ధికే పనికివచ్చేది సామాజిక న్యాయమెలా అవుతుందని ప్రశ్నించారు. చాలా మంది తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్నారని, అసలు దానర్థం ఏమిటో వారు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో శిథిలమైందేమిటో, ఏం పునర్నిర్మాణం చేయబోతున్నారో చెప్పాలన్నారు. కమ్యూనిస్టులు శిథిలం చేసిన దొరల రాజ్యాన్ని తిరిగి తీసుకువస్తారా? అని ప్రశ్నించారు. పొత్తులపై స్పష్టత రాలేదు.. పొత్తులపై స్పష్టత రాలేదని, వైఎస్సార్ కాంగ్రెస్‌తో పొత్తుపైనా నిర్దిష్ట నిర్ణయం జరగలేదని వీరభద్రం చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్యాకేజీలు, విలీనాలు నడుస్తున్నాయని, అవి తేలకుండా నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. టీఆర్ఎస్తో పొత్తు అవకాశాన్ని తోసిపుచ్చలేమన్నారు. సీపీఐ, సీపీఎం మధ్య భావసారూప్యత ఉందని, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో సర్దుబాట్లు పెట్టుకుంటామని చెప్పారు. కుదరకపోతే ఒంటరిపోరుకైనా సిద్ధమేనని తమ్మినేని చెప్పారు. పోలవరం డిజైన్ మార్చాలి.. పోలవరం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చాలన్నది తమ పార్టీ డిమాండ్ అని, దానివల్ల ముంపు ప్రాంతాల సంఖ్య తగ్గుతుందని వీరభద్రం అన్నారు. ఎత్తు తగ్గించి కూడా ప్రయోజనాలను పొందవచ్చని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్ బసవపున్నయ్య, హెచ్‌యూజే అధ్యక్షుడు పి.ఆనందం, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, నర్సింగరావు, సోమయ్య, పి.రామచందర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీజేపీ తప్ప.. ఎవరైనా ఓకే!
తెలంగాణ సీపీఎం నిర్ణయం సీపీఐతో సమన్వయం తప్పనిసరి వైఎస్సార్సీపీ, పవన్, టీఆర్ఎస్ సహా ఎవరైనా పర్లేదు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జట్టు కట్టాలనే దానిపై సీపీఎం తెలంగాణ కమిటీ తేల్చుకోలేకపోయింది. పార్టీ జాతీయ విధానానికి అనుగుణంగా కాంగ్రెస్సేతర, బీజేపీయేతర శక్తుల్ని ఏకం చేసేందుకు ప్రయత్నించాలని భావించింది. పొత్తులపై స్పష్టత రానందున పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం కోసం వేచి ఉండాలని నిర్ణయించింది. సీపీఎం తెలంగాణ ప్రాంత నేతలు, క్రియాశీల కార్యకర్తల సమావేశాన్ని బుధవారమిక్కడ నిర్వహించింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ సీతారాములు, నాగయ్య, చుక్కా రాములు, మల్లు స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సామాజిక కోణం, సమగ్రాభివృద్ధి, పార్టీ నిర్మాణం, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు తదితర అంశాలను చర్చించారు. ప్రభావశీలిగా ఎదగాలి: ప్రస్తుతం తామున్న ఆత్మరక్షణ దశ నుంచి ఏడాదిలోగా ప్రభావిత దశకు ఎదగాలని తమ్మినేని పిలుపిచ్చారు. స్థానిక సంస్థల మొదలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వరకు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. సీపీఐతో సమన్వయానికి కృషి జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ యేతర శక్తులయిన వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, పవన్‌కళ్యాణ్, కిరణ్ పార్టీ సహా ఎవరొచ్చినా అభ్యంతరం లేదని తెలిపారు. ఇవేవీ కుదరకపోతే ఒంటరి పోరుకైనా మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ నిర్మాణమే భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని మధు చెప్పారు.