వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జట్టు కట్టాలనే దానిపై సీపీఎం తెలంగాణ కమిటీ తేల్చు కోలేకపోయింది.
తెలంగాణ సీపీఎం నిర్ణయం
సీపీఐతో సమన్వయం తప్పనిసరి
వైఎస్సార్‌సీపీ, పవన్, టీఆర్‌ఎస్ సహా ఎవరైనా పర్లేదు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జట్టు కట్టాలనే దానిపై సీపీఎం తెలంగాణ కమిటీ తేల్చుకోలేకపోయింది. పార్టీ జాతీయ విధానానికి అనుగుణంగా కాంగ్రెస్సేతర, బీజేపీయేతర శక్తుల్ని ఏకం చేసేందుకు ప్రయత్నించాలని భావించింది. పొత్తులపై స్పష్టత రానందున పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం కోసం వేచి ఉండాలని నిర్ణయించింది. సీపీఎం తెలంగాణ ప్రాంత నేతలు, క్రియాశీల కార్యకర్తల సమావేశాన్ని బుధవారమిక్కడ నిర్వహించింది.
పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ సీతారాములు, నాగయ్య, చుక్కా రాములు, మల్లు స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సామాజిక కోణం, సమగ్రాభివృద్ధి, పార్టీ నిర్మాణం, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు తదితర అంశాలను చర్చించారు.
ప్రభావశీలిగా ఎదగాలి: ప్రస్తుతం తామున్న ఆత్మరక్షణ దశ నుంచి ఏడాదిలోగా ప్రభావిత దశకు ఎదగాలని తమ్మినేని పిలుపిచ్చారు. స్థానిక సంస్థల మొదలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వరకు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. సీపీఐతో సమన్వయానికి కృషి జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ యేతర శక్తులయిన వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, పవన్‌కళ్యాణ్, కిరణ్ పార్టీ సహా ఎవరొచ్చినా అభ్యంతరం లేదని తెలిపారు. ఇవేవీ కుదరకపోతే ఒంటరి పోరుకైనా మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ నిర్మాణమే భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని మధు చెప్పారు.