సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల హక్కులను కేంద్రప్రభుత్వం కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అమలు కాకుండా ఆటంకాలు కల్పిస్తోందని విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిందించారు.
తెలంగాణలోనూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలి అదే విధంగా ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను సైతం ధ్వంసం చేస్తోందని విమర్శించారు. దాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని అప్పుడే దేశ సమైక్యతను కాపాడుకోగలమన్నారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని ధ్వంసం చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని నిందించారు.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టుపై రోజూ విమర్శలు గుప్పిస్తున్నారనీ వారికి నచ్ఛిన వారిని న్యాయమూర్తులుగా నియమించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను సైతం కేంద్రం తొక్కిపెడుతోందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిసిత్థుల్లో రాబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీపై బీఆర్‌ఎస్ గట్టిగానే పోరాటం చేస్తోంది: తమ్మినేని
ప్రజాసమస్యల కంటే మతచిచ్చురేపడమే బీజేపీ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ’భాగ్యలక్ష్మి దేవాలయం పేరుతో విద్వేషాలు పెంచడం, సచివాలయం గుమ్మటాలు నిజాంకాలం నాటి కట్టడాలుగా ఉన్నాయనీ, మసీదులు తవ్వితే శవాలు వస్తే వారికి, శివలింగాలు వస్తే మాకు’ అంటూ బండి సంజయ్, బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ గట్టిగానే పోరాటం చేస్తోందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. తెలంగాణపై బీజేపీ గురిపెట్టిందని, అందుకే కేంద్ర మంత్రులు, ప్రధాని ఇక్కడికి వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుందన్నారు.
17 నుంచి జన చైతన్య యాత్రలు
బీజేపీ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 17 నుంచి చేపట్టే జనచైతన్య యాత్రలో ప్రసంగాలతోపాటు విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. 17న వరంగల్‌లో మొదటి యాత్రకు ముఖ్యఅతి«థిగా సీతారాం ఏచూరి, 23న ఆదిలాబాద్‌లో రెండోయాత్రకు రాఘవులు, 24న నిజామాబాద్ లో మూడో యాత్రకు విజయరాఘవన్, 29న హైదరాబాద్‌లో ముగింపు సభకు ప్రకాశ్‌కరత్ ముఖ్యఅతిధిగా హాజరవుతారన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు తిరిగేలా బస్సు యాత్ర ప్రణాళికను రూపొందించామని తమ్మినేని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment