కల్తీ జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్య తీసుకోవాలి
ఆ అంశాన్ని కులమతాలకు ఆపాదించి లౌకికతత్వాన్ని దెబ్బతీయకూడదు
ఏకత్వం పేరుతో దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం
ఏచూరి సంతాప సభలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
సనాతన ధర్మం గురించి ఆ పెద్దమనిషికి తెలుసా? అంటూ పవన్‌పై పరోక్ష వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు తేలితే దోషులను పట్టుకుని శిక్షించాలిగానీ, దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. లడ్డూలో వాడే శనగపిండి, పంచదార ఏ కల్తీ అయినా మనకు పుణ్యం తీసుకురావని, పాపమే తెస్తాయన్నారు. ఈ అంశాన్ని కులమతాలకు అంటగట్టకుండా లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నేతలపై ఉందని హితవు పలికారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య (ఎంబీ)భవన్‌లో ఆదివారం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ.. సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడని, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో అయన్ని చెప్పమనండి అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రాఘవులు ప్రశ్నించారు.
సనాతన ధర్మం గురించి సీతారాం ఏచూరి పెద్ద పుస్తకమే రాశారని, సనాతన ధర్మంలో కీలకం కుల వ్యవస్థ అని, కులంపై అభిమానం ఉన్నవాళ్లు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారన్నారు. కుల వ్యవస్థ శ్రమకు, సాటి మనిషికి గౌరవం ఇవ్వదన్నారు. అలాగే, కుల వ్యవస్థను తీసేస్తే సనాతన ధర్మం ఉండదని, అది ఆధునిక ధర్మం అవుతుందన్నారు.
ఈ దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడాలంటే కుల, మత వ్యవస్థను తొలగించాలని రాఘవులు తేల్చిచెప్పారు. కేంద్రంలోని బీజేపీ వంటి మతతత్వ శక్తుల కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటివి ప్రమాదంలో పడిపోయాయని, ఈ తరుణంలో సీతారాం ఏచూరి వంటి నాయకులు లేకపోవడం దేశానికి పెద్ద లోటన్నారు.
ఒకే దేశం.. ఒకే ఎన్నికతో అనర్థాలు..
తాజాగా.. కేంద్ర మంత్రివర్గం ఒకే దేశం, ఒకే ఎన్నికకు ఆమోదం తెలిపిందని, ఈ నినాదం బాగుందని అనుకోవద్దని, దీనివల్ల ఏకత్వం మాటెలా ఉన్నా దేశంలో ప్రాంతాల వారీ తగదాలకు, విభజనకు దారితీస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు. అధ్యక్ష తరహా పాలనను గతంలో ప్రతిపాదించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఒకే ఎన్నిక అంటోందన్నారు.
140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలని, మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదని రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇక కామన్ సివిల్‌కోడ్ గురించి మనమంతా మాట్లాడుకుంటుంటే సాక్షాత్తు ప్రధానమంత్రే కమ్యూనల్ సివిల్‌కోడ్ తెస్తామని చెబుతున్నాడని.. ఇది ఏకత్వం కాదని, ఈ దేశం ఐక్యతను దెబ్బతీసే చర్యలని రాఘవులు విమర్శించారు.
సిద్ధాంతానికి కట్టుబడ్డ ఏచూరి..
మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలకు కట్టుబడి దేశంలో పీడిత తాడిత వర్గాల కోసం ఆహర్నిశలు పోరాడిన యోధుడు సీతారాం ఏచూరి మన తెలుగు వాడు కావడం గర్వకారణమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి ‘రాజీనామా చేయండి’ అని డిమాండ్ చేసిన ధైర్యశాలి సీతారాం అన్నారు. 1984లో ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పుడు, ఆయన్ను మళ్లీ సీఎం పీఠం ఎక్కించడానికి రాష్ట్రంలోను, ఢిల్లీలోను సీతారాం చేసిన కృషి ఎనలేనిదన్నారు.
ఉత్తమ పార్లమెంటేరియన్ మన ఏచూరి : అంబటి
మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల కోసం పోరాడే శక్తి అని, అటువంటి పార్టీలో నిబద్ధతతో రాటుదేలి రాణించడమే కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీతారాం ఏచూరి మన తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. భారత పార్లమెంట్‌లో ఆయన పెట్టిన సవరణలు ఆమోదించేలా పోరాడిన సీతారాం ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారన్నారు.
సీతారాం మరణం భారత రాజకీయాలకు తీరనిలోటని, ఆయనకు ఘనంగా నివాళి అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు వచ్చానని అన్నారు. జీవితాన్నే ఉద్యమానికి అంకితం చేసిన సీతారాంకు తమ నాయకుడు జగన్ తరఫున, తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నానని రాంబాబు పేర్కొన్నారు.
సభలో ఇంకా మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ కూడా మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని సీతారాం చిత్రపటానికి అంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment