
కేసీఆర్.. నా వెంట రా!
గ్రామాల దుస్థితి చూపిస్తా: తమ్మినేని
లింగాల: ‘కేసీఆర్ నా వెంట రా.. లేదా నీ కొడుకు, అల్లుడినైనా నా వెంట పంపు.. గ్రామాల దుస్థితి చూపిస్తా’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. సీపీఎం మహాజన పాదయాత్ర శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల, పెద్దకొత్తపల్లి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఏర్పడితే బాగుపడతామని ఎంతగానో ఆశిం చారని, నేడు గ్రామాల్లో కరువు విలయతాండవం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ రెండున్నర ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ అధికార దాహంతో తానే సీఎం అయ్యాడని విమర్శించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి, లక్ష ఉద్యోగాలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సీపీఎం వేట కుక్కలా వెంటపడుతుందన్నారు. సీపీఎం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.