సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభను సెప్టెంబర్ మొదటి వారంలో రద్దు చేస్తే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఎన్నికల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఎన్నికలు ఆలస్యంగా లోక్‌సభతో పాటే వస్తాయా? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్ 10వ తేదీలోగా తెలంగాణ శాసనసభ రద్దుకు సిఫారసు చేసిన పక్షంలో డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతో పాటే ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు మొదలుపెడుతోంది. ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నవంబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడనుంది.
‘ఆ నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించడానికి మాకు ఎటువంటి అవరోధాలు లేవు. మీరు ఎంత త్వరగా శాసనసభ రద్దుకు సిఫారసు చేస్తారన్నదే ప్రధాన సమస్య. వీలైనంత త్వరగా అంటే సెప్టెంబర్ 10–15 తేదీల మధ్య సభ రద్దుకు సిఫారసు చేస్తే మేము వెంటనే ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభిస్తాం’అని ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు టీఆర్‌ఎస్ వర్గాలకు భరోసా ఇచ్చాయి. మామూలుగా అయితే శాసనసభ రద్దు అయిన తరువాత ఆరు మాసాలలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ మరో మూడు మాసాల్లో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌కు రెండు నెలల ముందయినా తెలంగాణ శాసనసభ రద్దయి ఉండాలని ఈసీ వర్గాలు చెప్పినట్లు సమాచారం.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సిఫారసు చేసినా.. అదే సమయంలో లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు అప్పటి వాజపేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అసెంబ్లీ ఎన్నికలకు వెనుకడుగు వేయాల్సి వచ్చిందని అప్పటి ఎన్నికల కమిషనర్ ఒకరు సోమవారం ‘సాక్షి’ప్రతినిధితో చెప్పారు. ఇప్పుడు ఆ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు తప్పనిసరి కనుక తెలంగాణకు కూడా ఆ మేరకు షెడ్యూల్ విడుదల చేయడానికి ఇబ్బంది ఉండదని ఆ మాజీ కమిషనర్ చెప్పారు.
సభ రద్దు చేస్తేనే ఈసీ చర్యలు...
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఆచితూచి అడుగులు వేస్తోంది. శాసనసభ రద్దు చేస్తారన్న సమాచారం స్వయంగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల నుంచే వర్తమానం అందడంతో ఇక్కడి చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి (సీఈవో)తో ఓటర్ల జాబితా, ఈవీఎంల వంటి వాటిపై ఈసీ చర్చిస్తోంది. ఎన్నికలకు సంబంధించి బలగాలను తరలించేందుకు ఎటువంటి సమస్య లేదని, తాము సమకూర్చగలమని కర్నాటక, తమిళనాడు డీజీపీలు ఈసీకి భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పోలింగ్‌కు స్థానిక పోలీసులతో పాటు అవసరమైతే పొరుగు రాష్ట్రాల బలగాలను వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీలోగా సభను రద్దు చేసిన పక్షంలో ఈవీఎంల ఏర్పాటుపై వెంటనే దృష్టి సారించాలని సీఈవోకు ఈసీ సూచించినట్లు తెలిసింది.
ఇకపోతే ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే డిసెంబర్ 26–29 తేదీల మధ్యన తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అనుకున్నట్లు శాసనసభను రద్దు చేస్తే ఈ తేదీల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని ఈసీ వర్గాలు తెలియజేస్తున్నాయి. డిసెంబర్ 31వ తేదీలోగా మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఈసీ భావిస్తోంది. శాసనసభ ఎన్నికలకు ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోవాలని, కొత్త ఓటర్ల చేరికకు కొంత సమయం ఇవ్వాలని కూడా ఈసీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment