ఏం చేస్తారో అడిగి ఓటేయండి: తమ్మినేని వీరభద్రం
తెలంగాణ తెచ్చాం.. ఇచ్చామనే వాళ్లకు ఓటొద్దు: తమ్మినేని వీరభద్రం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ తెచ్చాం.. ఇచ్చామనే నినాదానికి ఓటేయకండి. వచ్చిన తెలంగాణకు ఏమి చేస్తారనే దానికి ఓటేయండి. వచ్చే ఎన్నికల్లో మా నినాదం ఇదే’ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినంత మాత్రాన ఆ వర్గాలకు సామాజిక న్యాయం దక్కినట్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయమంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు టికెట్లు ఇవ్వడమే కాదన్నారు. దళితుడు సీఎం అయితే తమకూ సంతోషమేనని, అయితే ఆ వ్యక్తులు దళితులకు ఉపయోగపడే వారా? కాదా? అన్నది ముఖ్యమన్నారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది మీడియా కార్యక్రమంలో వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన పూర్తయినందున తమ పార్టీ ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిదని చెప్పారు. కొందరి లబ్ధికే పనికివచ్చేది సామాజిక న్యాయమెలా అవుతుందని ప్రశ్నించారు. చాలా మంది తెలంగాణ పునర్‌నిర్మాణం గురించి మాట్లాడుతున్నారని, అసలు దానర్థం ఏమిటో వారు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో శిథిలమైందేమిటో, ఏం పునర్‌నిర్మాణం చేయబోతున్నారో చెప్పాలన్నారు. కమ్యూనిస్టులు శిథిలం చేసిన దొరల రాజ్యాన్ని తిరిగి తీసుకువస్తారా? అని ప్రశ్నించారు.
పొత్తులపై స్పష్టత రాలేదు..
పొత్తులపై స్పష్టత రాలేదని, వైఎస్సార్ కాంగ్రెస్‌తో పొత్తుపైనా నిర్దిష్ట నిర్ణయం జరగలేదని వీరభద్రం చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్యాకేజీలు, విలీనాలు నడుస్తున్నాయని, అవి తేలకుండా నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు అవకాశాన్ని తోసిపుచ్చలేమన్నారు. సీపీఐ, సీపీఎం మధ్య భావసారూప్యత ఉందని, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో సర్దుబాట్లు పెట్టుకుంటామని చెప్పారు. కుదరకపోతే ఒంటరిపోరుకైనా సిద్ధమేనని తమ్మినేని చెప్పారు.
పోలవరం డిజైన్ మార్చాలి..
పోలవరం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చాలన్నది తమ పార్టీ డిమాండ్ అని, దానివల్ల ముంపు ప్రాంతాల సంఖ్య తగ్గుతుందని వీరభద్రం అన్నారు. ఎత్తు తగ్గించి కూడా ప్రయోజనాలను పొందవచ్చని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్ బసవపున్నయ్య, హెచ్‌యూజే అధ్యక్షుడు పి.ఆనందం, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, నర్సింగరావు, సోమయ్య, పి.రామచందర్ తదితరులు పాల్గొన్నారు.