
'కేసీఆర్ తిక్క పనులు చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిక్క పనులు చేస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఊడ్చేయడానికి కార్మికులు సిద్ధం కావాలని ఆయన మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఆయన మద్దతు ప్రకటించారు. కార్మికులు లేకుండా స్వచ్ఛ భారత్ సాధ్యమా ?.. చీపుర్లతో ఫొటోలు దిగితే స్వచ్ఛ భారత్ అవుతుందా అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్నికి తమ్మినేని ప్రశ్నలు సంధించారు.
హైదరాబాద్ నగరంలో కంపునకు సీఎం కేసీఆర్దే బాధ్యత అని... కార్మికులను మాత్రం తిట్టవద్దని నగర వాసులకు తమ్మినేని వీరభద్రం సూచించారు. హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్మికులు శనివారం చేపట్టిన ధర్నాలో 7 కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ ధర్నాకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతు ప్రకటించాయి.